జంగిటి గ్రామంలోకి ప్రవేశించడంతో సాధనానందుడి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సౌగంధికను అంతఃపురంలోకి పంపేందుకు వామదేవుడు, సవరసత్తి, పోటిసుడు తీవ్రంగా ఆలోచిస్తుంటారు. కళింగకు సేనాధిపతినే వెళ్లమంటాడు సౌరిసంబ మహారాజు. రాయహత్థి, చంద్రహత్థిల ప్రయాణాన్ని కటిలుడు అడ్డుకుంటాడు. ఆ తర్వాత..
జంగిటిలో.. భాణుసత్తి, ఆహవసత్తి నవ్వుతూ.. మాట్లాడుకుంటూ పొలాల వైపు వెళుతున్నారు. వాళ్లకు తెలియకుండా సచ్చసామి అనుసరిస్తున్నాడు. అది వాళ్లు గమనించకుండా ముందుకు చూస్తూ నడుస్తున్నారు. అప్పుడు వాళ్లకు అటుగా వెళుతున్న ఒక వేటగాడు కంటపడ్డాడు. “ఓ! అందగాడా!” అని పిలిచింది ఆహవ. ఆడ గొంతు వినగానే అదాటుగా వెనుకకు తిరిగి చూసినాడు వాడు. ఆహవ పిలుపునకు వాని మొహానికి ఏమాత్రం పోలిక కుదరలేదు. అది చూసి నవ్వు బిగబట్టి మొహం పక్కకు తిప్పుకొన్నది భాణు. వాడు ఈ అందాల భామలను నోరు తెరుచుకొని ఆశతో చూడటం మానలేదు. “నీకు కొత్తగా పెళ్లయింది కదా!” అన్నది ఆహవ. “అవును!” అన్నాడు వాడు, మెలికలు తిరుగుతూ. కన్నార్పకుండా వాళ్లను చూస్తూనే. వాని చూపు తట్టుకోలేక పోతున్నది భాణు. “మీ ఇంటి వెలుగు నిన్ను తొందరగా వచ్చేయి మన్నది. వేరే ఆడవాళ్ల వైపు చూసినా; ఇంటికి ఆలస్యంగా వచ్చినా నీకు ఉపవాసమే గతి! అని చెప్పమన్నది” అన్నది. వెంటనే అతను తలవంచుకొని గబగబా ముందుకు సాగినాడు.
అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. “అవునూ.. వాడు నీకు ఇంతకుముందు తెలుసా? వాని కథంతా నీకు ఎవరు చెప్పినారే?” ఆశ్చర్యంగా అడిగింది భాణు. “వాని నీరసించిన నడక, అలసిపోయిన దేహం చూసి అంతా కనిపెట్టేసిన అక్కా!” కిలకిలా నవ్వింది ఆహవ. “ఎట్లా?!” మరింత ఆశ్చర్యపోయింది భాణు. కొత్త ఆలి ప్రేమ కోరలలో చిక్కి వేటగాడు గీము వీడ లేక ధనువు భారమాయె ననుకొని వేటకై వెడలు చుండె శక్తి సడలినటుల! (కొత్త పెళ్లాం ప్రేమ కోరల్లో చిక్కుకున్న ఆ వేటగానికి.. ఇల్లు వదిలి వెళ్లడం ఇష్టంలేదు. తప్పనిసరిగా వెళుతున్న వానికి ధనుస్సు చాలా భారంగా, శరీరం బలహీనంగా అనిపించ సాగినాయి) “వాని నడకతోనే ఈ కథంతా ఊహించేసిన అక్కా!” అన్నది. “అబ్బా! ఎంత గడుసు దానివే! చాలా తెలివి నీకు!” మెచ్చుకోలుగా బుగ్గన ముద్దు పెట్టుకున్నది భాణుసత్తి. “నేను తెలివైన దానినో కాదో కానీ, నీ అంత అమాయకురాలిని అయితే కాదు!” అన్నది జాలిగా అక్కను చూస్తూ ఆహవసత్తి. అంతలో హఠాత్తుగా వాళ్లనడక ఆగిపోయింది. అంతసేపూ వెనుక నుంచి వస్తున్న సచ్చసామి వీళ్ల నడక మందగించగానే వేగంగా ముందుకు వచ్చి అడ్డుగా నిలబడ్డాడు.
“అవణాయరుడు!” సవరసత్తి నోటి నుంచి వచ్చిన ఆ పేరు మిగతా ముగ్గురికీ తెలవదు. “ఎవరా అవణాయరుడు?” అడిగింది సౌగంధిక. “ఇప్పుడు మనకు కావలసినవాడు” అంటూ అతని గురించి వివరించింది.. “అంతఃపుర రక్షకుడు. ఈసాణుడి ఆంతరంగికుల్లో ఒకడు. మహారాణి ఖరహర ప్రియకు దూరపు బంధువు కావడం వలన, అతను చేసే పనులను ఈసాణుడు చూసీ చూడనట్లు ఉంటాడు. అవణాయరుడు భోజన ప్రియుడు. స్త్రీ లోలుడు కాకపోయినా, కొంగు గాలికి లొంగని మగాడు ఉండడు కదా! వానికి రుచికరమైన వంటలు చేసి పెట్టగల అందమైన ఆడది కావాలి” “అయితే, అందుకు తగిన దాన్ని నేనే!” వెంటనే అన్నది సౌగంధిక. “అరే! పూర్తిగా చెప్పనీయవా? ప్రతి దానికి ‘నేనే.. నేనే..’ అంటూ ఉరుకులాడుతావు?” చిరుకోపంతో అన్నాడు వామదేవుడు. చిన్నబుచ్చుకుని మొహం పక్కకు తిప్పుకొన్నది సౌగంధిక. అది చూసి కిసుక్కున నవ్వింది సవరసత్తి. “అయితే, ఎవరిని పంపడం బాగుంటుంది తల్లీ!” వాళ్ల సరసాన్ని పట్టించుకోకుండా కర్తవ్యం గుర్తుచేసినాడు పోటిసుడు.
“నన్ను అందరూ గుర్తుపడతారు కాబట్టి, ఆ స్థానంలో సౌగంధికను పంపడమే సరైనది” ఓరకంట వామదేవుని కనిపెడుతూ అన్నది సవరసత్తి . సౌగంధిక కళ్లు పెద్దవి చేసింది, ఆమె ముఖం విచ్చుకున్నది సంతోషంతో. ఉడుక్కున్నాడు వామదేవుడు. అది గమనించింది సవర. “కావాలంటే తనకు తోడుగా వామదేవుడు కూడా వెళ్లవచ్చు!” దీర్ఘం తీస్తూ అన్నది వామదేవుని ఓ కంట గమనిస్తూ. “నేను సిద్ధం!” ఎగిరి గంతేసింది వామదేవుని మనసు. “ఎందుకు? అతనికి ఏమన్నా వంటలు వస్తాయా?” మొహం ముడుచుకుంటూ అన్నది సౌగంధిక. “చూస్తుంటే.. నేను నీ వెంట రావడం ఇష్టం లేనట్లున్నది!” మాటకు మాట అన్నట్లు అన్నాడు వామదేవుడు. “అవును!!” ముక్తసరిగా అన్నది సౌగంధిక. “మీరు తర్వాత పోట్లాడుకోవచ్చు, ముందు చెప్పేది జాగ్రత్తగా వినండి!” అంటూ ఈ విధంగా అన్నది సవరసత్తి. “సౌగంధిక నిజంగానే వంటల్లో మేటి! ఆమె తన ఇల్లు విడిచి బయటికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ కాబట్టి చిలుకవాడలోనే ఆమెను గుర్తుపట్టే వాళ్లు అరుదు. కళింగలో అయితే ఏమాత్రం గుర్తించరు! ఈసాణుడి మనుషులు ఒకసారి చూసినారు. వాళ్లు గుర్తుపడితే మాత్రం మన ఆలోచనలన్నీ తలకిందులు అయిపోతాయి. అందుకే మనం రెండు పనులు చేయాలి!” మిగతా ముగ్గురు శ్రద్ధగా వింటున్నారు.
“మొదటిది.. ఈమెను ఇంత అందంగా కాకుండా, పల్లెటూరి మనిషిలా కొంచెం మొరటుగా తయారు చేయాలి. దానికి తగినట్లు భాష కూడా మార్చాలి. చేసేది సాహసోపేతమైన కార్యం కాబట్టి తోడుగా ఒక మనిషి ఉండటం అవసరం!” “అయితే నేను వెళ్తా!” వెంటనే అన్నాడు వామదేవుడు. సౌగంధిగక బుగ్గలు విచ్చుకున్నాయి. “ఒక ఆడమనిషి వెనుక మగవాడు ఉన్నాడంటే అవతలివాడు చొరవ చూపించడు కాబట్టి ఆడమనిషి ఉంటేనే బాగుంటుంది!” సౌగంధికకు మాత్రం అతనే తన వెంట రావాలని ఉన్నది; వామదేవునికి తాను తప్ప ఇంకొకరెవరూ ఆమె వెంట వెళ్లకూడదని ఉన్నది. వీళ్ల ఆలోచనలు కనిపెడుతూ.. “ఆ ఆడమనిషి నీవే అయినా పర్వాలేదు!” అన్నది సవర నవ్వు బిగబట్టుకుంటూ. ఆశ్చర్యపోయినాడు వామదేవుడు. అతణ్ని స్త్రీగా ఊహించుకొని ఫక్కున నవ్వింది సౌగంధిక. “అవును వామదేవా! నీవు ఆడదానిగా మారి ఆమెకు రక్షణ కల్పించాలి. సౌగంధికకు అత్తగా రంగప్రవేశం చేయి!” అన్నది సవరసత్తి. వామదేవుని ముఖం ప్రశ్నార్థకమైంది. ‘మంచి పని అయ్యింది!’ అనుకున్నది సౌగంధిక.
“ఆమెకు పనుల్లో సాయం చేస్తావు; ప్రమాదాల్లో కాపు కాస్తావు. అత్తా కోడళ్లుగా మీరు అక్కడ నిర్వహించే నాటకానికి తగిన యోజన మీరు చేసుకోండి! నేను పోటిసునికి మరొక ముఖ్యమైన పని అప్పగిస్తాను!” అంటూ అక్కడి నుంచి భూగృహం బయటికి దారితీసింది సవరసత్తి. అనుసరించినాడు పోటిసుడు. వాళ్లు వెళ్లగానే.. పైన బడుచుకొట్టె ప్రణయిని కోపాన కొట్టి కొట్టి నొప్పి పుట్టె; చేయి తనదు మోము చేర్చి, తాప మాప నతండు మురిసి అల్లుకొనెను మరొక చేత! (కోపం ఆపజాలక అతని మీద పడి కొట్టింది ఆమె. కొట్టి కొట్టి సుకుమారమైన ఆమె చేయి నొప్పి పెట్టింది. నొప్పి పెట్టిన ఆమె చేతి నొప్పిని తగ్గించేందుకు తన చేతుల్లోకి తీసుకొని ముఖానికి దగ్గరగా చేర్చుకున్నాడు. వెచ్చని అతని ఊపిరి తాకడంతో ఆమె తాపం కరిగిపోయి, మరో చేత్తో అతన్ని అల్లుకున్నది)
చెంచు గూడెంలో.. “ఏందిరా నీ బాధ?” మాట్లాడకుండా తటపటాయిస్తున్న కటిలుణ్ని చూస్తూ విసుక్కున్నది రాయహత్థి. “అక్కా! నాది బాధ కాదు, బాధ్యత! మొన్ననే నేను కళింగకు వెళ్లి, ఈ ఉదయమే వచ్చినాను” అన్నాడు. ఆ మాట విని ఆశ్చర్యపోయింది రాయహత్థి. నమ్మలేనట్లు చూసింది చంద్రహత్థి. “కొత్తగా గుర్రం కొనుక్కున్నాను!” ఈసారి ఇద్దరూ ఉలిక్కిపడినంత పని అయింది. “ఇదంతా నేను నీకు ఇచ్చిన మాటలో భాగమే..!” అతని నోటిలో మాట పూర్తి కాకుండానే.. “పోటిసుడు కనిపించినాడా?” అన్నది చంద్రహత్థి. అతని నుంచి వినదగిన వాక్యం ఆమెకు అదొక్కటే! మిగతా విషయాలతో పనిలేదు కదా! “ఎప్పుడు వెళ్లినావు? ఎట్లా వెళ్లినావు? ఏం తెలుసుకున్నావు? అన్నీ పూర్తిగా చెప్పురా!” అంటూ అతణ్ని గుడిసెలోనికి తోడుకొనిపోయి కూర్చోబెట్టింది రాయహత్థి . వెంటనే చల్లని మంచినీళ్లు అందించింది చంద్రహత్థి. “చెప్పు! నా పోటిసుడు కనిపించినాడా? ఎట్లా ఉన్నాడు? నీవు కలిసి మాట్లాడినావా? ఏమన్నాడు? నా గురించి గుర్తు చేసినాడా?” గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు కురిపించింది చంద్ర. “కనిపించలేదు!” ఆ ఒక్క మాటతో నిరుత్సాహంతో నీరసించింది చంద్రహత్థి.
“మరి ఏం చూసినావు? ఎవరిని కలిసినావు? ఏం తెలుసుకున్నావు?” అని అడిగింది రాయహత్థి. “కళింగ నగరంలోకి వెళ్లకుండానే నాకు చాలా విషయాలు తెలిసినాయి” అంటూ తనకు తెలిసిన సంగతులన్నీ ఇట్లా చెప్పసాగినాడు కటిలుడు. “కళింగకు చేరడానికి ముందు ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు చిలుకవాడ. అంటే అక్కడంతా చిలుకలే ఉంటారన్నమాట! మామూలుగా అయితే మగవాళ్లు కంటబడితే ఆడవాళ్లు విడిచిపెట్టరట! కానీ, కొంతకాలంగా ఊరు కోలాహలంగా ఉన్నది. కళింగ రాజుగారి మహామంత్రి ఈసాణుడి వల్ల అదంతా జరుగుతున్నదట! అతను ఎవరో ఒక వ్యాపారిని బంధించినాడట! కాపాడటానికి ఇద్దరు మహాయోధులు వచ్చినారట! వాళ్లలో ఒకడిని ఆ మంత్రిగారి మనుషులు పట్టుకొని పోయినారట! రెండవ వాడిని కూడా తీసుకొని పోతుంటే ఒక మహావీరుడు ఆ భటులందరినీ తరిమికొట్టి అతణ్ని విడిపించినాడట!” “అయితే ఆ మహావీరుడు పోటిసుడే!” నమ్మకంగా అన్నది చంద్రహత్థి. అట్లా అంటుంటే దాని కళ్లు మెరిసినాయి; గుండె మురిసింది; ఒంటిమీద పులకాంకురాలు పొడసూపినాయి.
“అవును! చంద్ర అన్నట్లు అతను పోటిసుడేనని నాక్కూడా అనిపించింది. అయితే, ఆ తర్వాత అతను ఎక్కడికి పోయినాడో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. కొందరు సముద్రం వైపు వెళ్లినాడని; ఇంకొందరు రాజధానికే వెళ్లి ఉంటాడని అన్నారు. మరి కొందరేమో ఊరవతల పొలాల్లోనికి పోయి, మాయమైపోయినాడు అంటున్నారు. మరింత ఆశ్చర్యపోయినారు హత్థిలు ఇద్దరూ. “మరి అతను ఎక్కడున్నాడో నీవు ఎందుకు తెలుసుకోలేదు?” “తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించిన. ముందుగా సముద్రతీరానికి వెళ్లినాను, అక్కడ రాజ భటులతో ఆ యువకులు చాలా భయంకరంగా పోరాడినారట! అక్కడే ఒకడిని బంధించినారట! రెండోవాడు చిలుక వాడకు ఎందుకు వచ్చినాడు? అక్కడ వానితోపాటు ఒక వారంగను కూడా ఎందుకు బంధించి తీసుకొని పోవాలనుకున్నారో తెలిస్తే.. మనకు పోటిసుని సంగతి కూడా పూర్తిగా తెలిసేది. నేను చిలుకవాడలో ఒకరిద్దరిని అడిగి, పోటిసుడు మాయమైన పొలాల వద్దకు వెళ్లినాను వెతుక్కుంటూ. నన్ను ఇద్దరు రాజభటులు అనుసరిస్తున్న విషయం గమనించలేదు. ఆ పొలాల మధ్య వాళ్లు నన్ను అడ్డగించి ఎన్నో ప్రశ్నలు అడిగినారు. ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదని తప్పించుకొని వచ్చినాను!” అంటూ ముగించినాడు కటిలుడు.