దామరచర్ల, మే 17 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ నెల 12న సీవోడీ పూర్తిచేసుకున్న మూడో యూనిట్లో ఆదివారం ఉదయం బాయిలర్ ఫీడింగ్ పంప్ వద్ద షార్ట్‌సర్యూట్ కారణంగా నిప్పు అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో కార్మికులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్లాంటులోని అగ్నిమాపక దళాలు స్పందించి మంటలు ఆర్పివేశారు.
ఈ సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని ప్రమాదంలో కంట్రోల్ కేబుళ్లు, వాల్వ్‌లు కాలిపోగా మెయిన్ మెషినరీకి ఎలాంటి నష్టం జరుగలేదని సమాచారం. మొదటి యూనిట్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇదే రీతిలో ఆయిల్ లీకేజై కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకొని ప్రమాదం జరిగింది.