హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): 2026 ఎప్‌సెట్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీవోఈలకు చెందిన విద్యార్థులు వ్యవసాయం, మెడిసిన్ విభాగంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వివరించారు. ఫలితాలు సాధించిన విద్యార్థులు, కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
మైనారిటీ గురుకుల విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ ; అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించిన ముఖర్రమ్
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి ముఖర్రమ్ అహ్మద్ సత్తాచాటాడు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ విద్యార్థులతో పోటీపడి, వారికి దీటుగా స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముఖర్రమ్ 5వ తరగతిలోనే గోషామహల్ బాలుర-1 మైనారిటీ గురుకుల పాఠశాలలో చేరాడు. ఇంటర్ పూర్తిచేసి 2026 ఎప్‌సెట్ పరీక్ష రాసిన ముఖర్రమ్ ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 38.83, జువాలజీలో 36.92, బోటనీలో 34.41 మార్కుల చొప్పున మొత్తం 150.16 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు.
గురుకులాలు నిరుపేదల ఆశాదీపాలు..
ఈ సందర్భంగా ముఖర్రమ్ అహ్మద్‌ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. మైనారిటీ గురుకుల పాఠశాలలు నిరుపేదల ఆశాదీపాలుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. గ్రురుకులాలను ప్రారంభించిన కేసీఆర్‌కు, ముఖర్రమ్ ధన్యవాదాలు తెలిపాడు. పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటానని తెలిపాడు. ఎంబీబీఎస్ చదువాలన్న ఆసక్తిలేదని, జంతు ప్రేమికుడినైన తాను బీఎస్సీ వెటర్నరీ సైన్స్‌లో చేరుతానని చెప్పాడు. భవిష్యత్తులో వెటర్నరీలో రిసెర్చ్ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నానని, మైనారిటీ గురుకులంలో బోధన, నేర్పించిన క్రమశిక్షణతోనే రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించానని స్పష్టంచేశాడు.