ఈసాణుడు వనభోజనం కోసం వంటలు చేయడానికి దేవిని, సుద్దిని వెంటబెట్టుకుని రమ్మని అవణాయరుకు చెప్తాడు. తనతో జాయపను తీసుకొని వెళ్తాడు. భాణుసత్తి, ఆనందుల ప్రణయాన్ని ఆపడం గురించి ఆలోచిస్తుంది ఆహవ. ఆంతరంగిక సమావేశానికి మలయసేహరుడు ఎందుకు రాలేదని అడుగుతాడు సౌరిసంబ మహారాజు. తర్వాత..
మనసు పిచ్చిదమ్మ మరుల నూహించుక ధైర్యమును వహించు తగరు వోలె వాని కించుకైన వలపు నీ పైనను కలదొ? లేదొ? తెలియవలదె మగువ! (ఓ మగువా! నీ మనసు పిచ్చిది! ఏదో ప్రేమను ఊహించుకొని పొట్టేలులా ధైర్యం వహిస్తున్నది. మరి వానికి నీమీద కొంచెమైనా ప్రేమ ఉన్నదో లేదో నీవు తెలుసుకోవాలి కదా! ).. అంటూ ఆమెలోని వివేకం ఎత్తిచూపేసరికి, అంతవరకూ గుండెలో గూడు కట్టుకుని ఉన్న దుఃఖం కట్టలు తెంచుకున్నది. భాణు దుఃఖం చూసి మరింత కంగారు పడ్డాడు ప్రణాలానందుడు. ఆమె తన చేతులు పట్టుకొని ప్రాధేయపడటంతో మూడు వంతులు ప్రేమికుడైన వాడు, ఇప్పుడు దుఃఖంతో ఆమె చిగురుటాకులా వణికిపోవడం చూసి కాముకుడే అయిపోయినాడు. “ఏడవకు భాణూ! ఏడవకు!” అంటూ కన్నీరు తుడిచి, దగ్గరికి తీసుకో బోయినాడు. “ఆపండి! చాలు!” ఇంక చూడలేక దూరం నుండే గట్టిగా అరిచింది ఆహవ. ఇద్దరూ ఠక్కున ఆగిపోయినారు.
వాళ్లిద్దరి వద్దకు వస్తూ ఆవేశంతో ఇలా అన్నది.. “ఉన్నతమైన వంశంలో పుట్టిన నీకు; ఉత్తమ మార్గంలో నడవాలి అనుకునే అతనికి.. నీతి, నియమం, సంఘం, కట్టుబాటు, ధర్మం, సంప్రదాయం అనే వాటిమీద గౌరవం లేదా?” ప్రణాలునిలోని సాధనానందునికి చెర్నాకోల దెబ్బల్లా తగిలినాయి ఆమె మాటలు. వెంటనే భాణుకు దూరంగా జరిగినాడు. ఏదో పని ఉన్నట్లు అక్కడి నుండి వెళ్లసాగినాడు. నోటి వద్దకు వచ్చిన ముద్దను కాకి తన్నుకొని పోయినట్లు.. ఆహవ చేసిన నిర్వాకానికి పట్టరాని కోపం వచ్చింది భాణుకు. ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి చెంప పగిలేలా కొట్టింది. కన్నీళ్లు జలజలా రాలుతుండగా, భాణు ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని.. “రాణి గారూ! తమరు నన్ను కొట్టడంలో తప్పులేదు! కొట్టినారని బాధ కూడా లేదు! మీరు ఇప్పుడు రెండు వంశాల పరువు మర్యాదలకు ప్రతినిధి అన్నమాట మరువకండి! మీరు చేసే ఈ పని వల్ల చరిత్రహీనులుగా మిగిలిపోతారు తల్లీ!” అంటూ చేతులు జోడించింది ఆహవ. “ఇంకెక్కడి చరిత్రనే పిచ్చిదానా! అత్తగారింట అడుగుపెట్టడంతోనే నా బతుకు కూలిపోయింది; కోటతోపాటు మిగిలిన బతుకు కాస్త కాలిపోయింది; ఆ జీవితం అక్కడే అంతమైపోయింది. ఇది కొత్త జీవితం! నేను ఇప్పుడు రోహాదేవిని కాదు; భాణుసత్తిని! ఇప్పుడిప్పుడే ఆనందుడు అనే వృక్షానికి అల్లుకుంటున్న నా బతుకు తీగ చిగురిస్తున్నది. దీన్ని మొగ్గలోనే తుంచేసి నన్ను రెంటికి చెడ్డ రేవడిని చేయకు! నేనే నీకు దండం పెడతాను. దయచేసి నా దారికి అడ్డు రాకు!” ఆమె మాటలు కరుకైన బాణాల కంటే కఠినంగా ఉన్నాయి.
వనంలో జనం లేని చోట భోజనం ఉంటుందా?! ఈసాణుడు వన భోజనం అన్నమాట.. నేతి బీరకాయలోని నేయి వంటిదే! అడవిలోకి వెళుతుంటేనే అందరికీ క్రమంగా అర్థం కాసాగింది. ముగ్గురూ తలా ఒక రకంగా ఆలోచించసాగినారు. ‘వీడు మహా దుర్మార్గుడని తెలుసు; కనులకు ఇంపైన ఆడవాళ్లు కనిపిస్తే విడిచిపెట్టడనీ తెలుసు. ఇప్పుడు నా దేవికి, అమాయకురాలైన సుద్దికి కచ్చితంగా అపకారం తలపెడతాడు. వీణ్ని ఎదుర్కోవడం ఎట్లా? అధికారం వీని చేతిలో ఉన్నది. అయినా ఆడవాళ్లను కాపాడుకోవాలి కదా..!’ అనుకున్నాడు అవణాయరు. ‘నిన్న మా మందిరానికి వచ్చి మాట్లాడినప్పుడే ఈసాణుడి దుర్బుద్ధి అర్థమైంది. వాడు రాజు; కావలసినంత సైన్యం అండగా ఉన్నది; అరణ్యమధ్యంలో మమ్ములను అంతం చేయాలన్న తలంపుతోనే ఈ పన్నాగం పన్నినట్లున్నాడు! నాతోపాటు సౌగంధిక కూడా ఉన్నది. ఆమెను వీడు గుర్తుపట్టి ఉంటాడా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా కాపాడుకోవాలి..’ అంటూ మధన పడసాగినాడు దేవి రూపంలో ఉన్న వామదేవుడు. ‘ఆ కాముకుడు ఈసాణుడు నన్ను గుర్తుపట్టే ఉంటాడు! ఎప్పటినుంచో సొంతం చేసుకోవాలన్న కోరికతో రగిలిపోతున్నాడు వాడు! అడవిలో ఏం చేయనున్నాడో.. ఏం చేసినా నేను వానికి దక్కనుగాక దక్కను! చివరికి ఆత్మ త్యాగమైనా చేస్తాను కానీ, వాడిని తాకనిస్తానా?’ అనుకున్నది సుద్ది రూపంలోని సౌగంధిక. రాజధాని కళింగను అనుకొని ఉన్న సాంద్రారణ్యం నడుమ ఒక రథం, ఒక ఎద్దుల బండి వచ్చి ఆగినాయి. రథం నుండి ముందుగా అవణాయరు దిగినాడు. చుట్టూ పరికించి చూసినాడు.
అతనికి ఏమీ అర్థం కాలేదు. వన భోజనం మిషతో ఇక్కడికి తెచ్చిన విషయమైతే అర్థమైంది కానీ, ఏం చేస్తాడనేది అంతు చిక్కలేదు. రథాన్ని అనుసరించి వచ్చిన బండి నుండి దేవి, సుద్ది కిందికి దిగినారు. ఎక్కడా వంట పాత్రలు గానీ, పదార్థాలు గానీ, వంట చెరుకు అంటే.. ఇంధనం.. ఏమీ లేవు! తినడానికి కూడా ఎవరూ వచ్చిన ఆనవాళ్లు లేవు. “మీరేమీ అంత ఆశ్చర్యపోనవసరం లేదు అవణాయరు ప్రభూ!” అప్పుడే అక్కడ ప్రత్యక్షమైన ఈసాణుడు వెటకారంగా ఇంకా ఇలా అన్నాడు.. “అమాయకులను మోసం చేయడం తేలిక కానీ, మోసగాళ్లను వంచించడం అంత సులభం కాదు! ఇక్కడ వన భోజనం లేదు! నిన్ను మాయలో ముంచిన ఈ వంచకులకు కావలసినంత దండన భోజనం ఏర్పాట్లు చేయడమైనది..” “వంచకులా?.. వంచకులు ఎవరు మహారాజా..? వనభోజనం అన్నారు కదా!” అయోమయంగా చూస్తూ అన్నాడు అవణాయరు. “ఒరేయ్ అవణా! నీవింత దద్దమ్మవు కాబట్టే ఈ మగాడు ఆడదైనాడు; ఈ అందగత్తె అనాకారి అయ్యింది..” అంటూ వామదేవుణ్ని, సౌగంధికను చూయించినాడు. తననట్లా తేలిక చేసి పిలవడం అవమానకరమైంది అవణాయరుకు. “ఈసాణా!” అన్నాడు ఆగ్రహంతో. “నోరు ముయ్యిరా చవటా!” పండ్లు పటపటలాడిస్తూ అన్నాడు ఈసాణుడు. “నీ అజ్ఞానాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుని నీతో ఆడుకున్నారురా వీళ్లు.. ఇప్పటికీ నీకు అర్థం కాలేదంటే, నీవెంతగా దిగజారి పోయినావో..! చూడు!” అంటూ, వామదేవుని తల మీదున్న జుట్టుముడిని బలంగా లాగితే అది ఊడి చేతుల్లోకి వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించి వామదేవుడు వెంటనే ఈసాణుడి మీదికి ఉరికినాడు. ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన ఈసాణుడు.. వామదేవుని దెబ్బను ఒడుపుగా తప్పించుకొని, కత్తిపిడితో అతని తలమీద గట్టిగా కొట్టినాడు. దెబ్బ బలంగా తగలడంతో లేవలేకుండా పడిపోయినాడు వామదేవుడు. “దేవా!” ఏడుస్తూ వామదేవుని వద్దకు పరిగెత్తింది సౌగంధిక.
ఆమె నాలుగడుగులు వేయగానే భటులు అడ్డుకున్నారు. ముందుకెళ్లకుండా పట్టుకున్నారు. “అరెరెరెరే.. ఏం మనుషులు రా? అది సుకుమారి రా! దాని పేరు సౌగంధిక; పూల సువాసన వెదజల్లే అందం రా దానిది! పైన మసి రుద్దుకున్నంత మాత్రాన అదేదో పనిమనిషి అనుకోకండిరా! మీరు మనుషులా? పశువులా?” అంటూ భటులను మందలించి, ఆమె దగ్గరగా వచ్చి బుగ్గల కిందుగా చేతిని పోనిచ్చి గట్టిగా వత్తినాడు. సౌగంధిక కళ్లనుండి నీరు బొటబొటా ఒలికింది. “ఒరేయ్ తిక్క వెధవా! అవణా! నీవెంత అవకతవక గాడివో ఇప్పటికైనా అర్థమైందా?” అంటూ గట్టిగా మూడుసార్లు చప్పట్లు చరిచినాడు. మరుక్షణం బిలబిలమంటూ 60 మంది సైనికులు చెట్ల వెనుక నుంచి ఒక్కసారిగా వచ్చినారు. పడిపోయిన వామదేవుణ్ని, ఏడుస్తున్న సౌగంధికతోపాటు అవణాయరును కూడా బంధించినారు. “ఈసాణా! నన్నెందుకు బంధిస్తున్నావ్?” అన్నాడు ఆశ్చర్యంగా అవణాయరు. “ఆఁ.. నిన్నే కాదు! నీ మందిరం ముందు కాపలా కాసే ఆ జాయప గాణ్ని, నా వెంట సేవలందించడానికి కుదురుకున్న మియంకుణ్నీ వదిలిపెట్టలేదు. ఎందుకంటే వీళ్లలో ఎవరిని వదిలిపెట్టినా, వీళ్లు నన్ను వదిలిపెట్టరు! వీళ్లందరికీ మూలకారకుడైన కుసుమ శ్రేష్ఠిని మాత్రం చంపదలచుకోలేదు. వాడిని విడిగా చంపనవసరం లేదు. వీళ్లందరూ చస్తే.. వాడు బతికినా శవంతో సమానమే. బతికినంత కాలం వాడు జీవచ్ఛవంగా నా కళ్లముందు తిరుగుతూ ఉండాలి!” అన్నాడు వికటాట్టహాసం చేస్తూ. ఇది జరగడానికి ముందు.. అంటే గత రాత్రి ఒక సంఘటన జరిగింది.
భటుడు అల్లడు ఈసాణుడితో ఏకాంతంగా మాట్లాడటానికి సిద్ధం కాగానే తమకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతున్నదని గ్రహించిన మియాంక తాత వేషంలో ఉన్న పోటిసుడు.. ముందుగా కుసుమ శ్రేష్ఠిని బంధించిన చీకటికొట్టు వద్దకు వెళ్లినాడు. సరిగ్గా అప్పుడే ఒక భటుడు కుసుమ శ్రేష్ఠికి ఆహారం తీసుకొని వచ్చినాడు అక్కడికి. “ఒరేయ్ ముసలోడా! ఇక్కడ నీకేం పనిరా..?” అని మందలించినాడు ఆ వచ్చిన భటుడు. “పని నీతోనేనోయ్ పిల్లగాడా!” అన్నాడు మియంకుడు. “నాతో నీకేం పని..” భటుని కనుబొమలు ముడివడ్డాయి. “మనకు ఒకరితో ఒకరికి పని లేకున్నా, నీకు కార్షాపణాలతో పని ఉంటుంది కదరా!” అన్నాడు మియంకుడు, వాని మొహంలో రంగులు మారడాన్ని ఓ కంట కనిపెడుతూ.. ధనమంటే ఎవరికి చేదు?! అయినా వాడు..“కార్షాపణాలు ఎక్కడున్నాయి? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు..?” అన్నాడు కొంచెం స్వరం తగ్గించి. స్వరం మరింత తగ్గించి, గుసగుసలాడుతున్నట్లు మియంకుడు.. “వేయి కార్షాపణాలు.. నీ కోసమే. ఆ విషయం చెప్పాలనే ఇక్కడ ఎదురుచూస్తున్నా” అన్నాడు. వాని కళ్లల్లో ఆశ వేయి తారకలైంది. “నీవు రోజూ ఎవరికి ఆహారం ఇస్తున్నావో ఆ మహానుభావుడు సామాన్యుడు కాదు! కుబేరుని వంటి వాడు! మన ఈసాణుడు ఆ ధనం కోసమే అతణ్ని హింసిస్తున్నాడు. ఈసాణుని వంటి దుర్మార్గునికి ఆ ధనం అప్పజెప్పడం కన్నా మనలాంటి వాళ్లకు సాయం చేయడానికి ఆ పెద్దమనిషి సిద్ధంగా ఉన్నాడు.
నేను నీకు ఈ విషయం చెప్పడానికి నాకు నూరు కార్షాపణాలు ఇచ్చినాడు. ఈ ఉదయమే మా ఊరికి పంపినాను! కావాలంటే నేనూ నీతోపాటు లోపలికి వచ్చి అతనితో మాట్లాడిస్తా” అన్నాడు. ఆ కాపలాదారు తమను ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకొని, తాళం తీసి, లోపలికి తనతోపాటు మియంకుని కూడా ఆ చీకటి కొట్టులోకి తీసుకొని పోయినాడు. భటుని చేతిలోని చిన్న కాగడా వెలుతురులో కుసుమ శ్రేష్ఠిని చూసిన పోటిసునికి దుఃఖం ఆగలేదు. కుసుమ శ్రేష్ఠి పాదాలను చుట్టుకొని పసిపిల్లవానిలా ఏడ్చినాడు. “ఎవరు నాయనా! వయసులో నాకంటే పెద్దవాడిలా ఉన్నావు. ఎందుకు దుఃఖిస్తున్నావు?” అన్నాడు శ్రేష్ఠి. “ప్రభూ! నన్ను గుర్తుపట్టలేదా? నీ దాసుడిని. ఇన్ని కష్టాలకు, ఇంతమంది దుఃఖానికి, అపారమైన నష్టానికి కారణమైన వాడిని.. పోటిసుడిని!” అన్నాడు. ఆ మాట వినగానే శ్రేష్ఠి కంఠం గాద్గదిక మయింది. కళ్లనుండి ఆనందబాష్పాలు ధార కట్టినాయి. పోటిసుణ్ని పైకెత్తి గుండెకు హత్తుకున్నాడు. “ప్రభూ! మీతో మాట్లాడటానికి సమయం లేదు! మనకు సహాయం చేస్తే, మీరు ఈ భటునికి వెయ్యి కార్షాపణాలు ఇస్తారని నేను మాటిచ్చినాను..” పోటిసుని మాట పూర్తి కాలేదు. “అతను ఆ సాయం చేస్తే.. వేయేమిటి, పదివేలైనా ఇస్తా!” అన్నాడు కుసుమ శ్రేష్ఠి. ఉబ్బి తబ్బిబ్బై పోయినాడు ఆ భటుడు. “రేపు ఈసాణుడు అంతఃపురంలో ఉండడు. ఈ భటుడు తమరిని కొన్ని గడియల సేపు బయటకి పంపుతాడు. అప్పుడు మీరు మహారాజు కళింగాదిత్యుని కలిసి జరిగిన పరిణామాలన్నీ చర్చించండి. ఇక్కడ నేను ఎక్కువ సేపు ఉండటం ప్రమాదకరం!” అంటూ గబుక్కున బయటపడి, వేగంగా నడుచుకుంటూ ఈసాణుని మందిరం వద్దకు చేరుకున్నాడు. అక్కడ అతని కోసమే ఎదురుచూస్తున్న పదిమంది వస్తాదులు పోటిసుణ్ని బంధించినారు. అప్పుడే అక్కడికి చేరిన ఈసాణుడు నవ్వుతూ.. “భయపడకు మియాంక తాతా! చిలుకవాడలో నీతో పని ఉన్నదని మా సవరసత్తి కబురు చేసింది. నిన్ను అక్కడికే పంపుతున్న!” అన్నాడు. తాను పూర్తిగా ప్రమాదంలో చిక్కుకున్నట్లు అర్థమైంది పోటిసునికి.
పోదనలో.. “మహారాజా! సేనాని మలయసేహరుడు వ్యక్తిగత కార్యాల కారణంగా గ్రామాంతరంలో ఉన్నారు. అత్యవసరమైతే పిలిపించగలను!” అన్నాడు వినయపూర్వకంగా మంత్రి చామీకరుడు. “అవునా! అయితే మనం మన మిత్రుడు కుసుమ శ్రేష్ఠి గారి ఇంటికి వెళ్లాలి. ఆ ఏర్పాట్లు చూడండి!” అన్నాడు మహామంత్రి చామీకరునితో రాజు సౌరిసంబ. “తప్పకుండా మహారాజా!” అని సంసిద్ధమవుతూ, అంతలోనే తన సందేహాన్ని వెలిబుచ్చినాడు.. “అక్కడ మనం చేయవలసిన పనులేమిటో సెలవిస్తే, తదనుగుణంగా ఏర్పాట్లు చూసుకోగలను ప్రభూ!” అప్పుడు గుర్తుకొచ్చింది సౌరిసంబకు.. “వీరు ముళక నుండి ఆ విషయం గురించే తెలుసుకోవడానికి ఇక్కడికి దయచేసినారు!” అని గుర్తు చేసినాడు. “అవునా ప్రభూ! మనవాళ్లు ఆ విషయంలో నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. శ్రేష్ఠి గారి కోట గోడలకు కాపలాగా 20 మంది సైనికులున్నారు. శ్రేష్ఠి గారి గురించి, వారిని వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ల గురించి తెలుసుకోవడానికి ఒక వేగును కళింగరాజు వద్దకు పంపినాము. మరో నలుగురు గూఢచారులు పోదనలో, పరిసర గ్రామాల్లో వారి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కలిసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇంతవరకూ స్పష్టమైన సమాచారం తెలియ రాలేదు!” “మావద్ద ఒక ముఖ్యమైన సమాచారం ఉంది అమాత్యశేఖరా!” అన్నాడు మేఘచంద్రుడు. సరిగ్గా అప్పుడే ప్రతీహారి వచ్చి నమస్కరించి.. “మహారాజులకు జయమగు గాక! కుసుమ శ్రేష్ఠి భవనం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని మన భటులు తీసుకొని వచ్చినారు ప్రభూ!” అన్నాడు.