మన్సూరాబాద్: ఎనిమిది రోజుల పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టిన ఉదంతం ఎల్బీనగర్లో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్ వివరాల ప్రకారం.. ఎన్టీఆర్నగర్కి చెందిన ముక్తార్ బేగ్ చిన్న కూతురికి పిల్లలు కలగకపోవడంతో ఎవరి నుంచైనా చిన్నారిని దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్‌కి చెందిన లాల్మోన్ కాటూన్ (34) అనే మహిళ ఎనిమిది రోజుల క్రితమే లాల్మోన్ కాటూన్కి ఆడ బిడ్డ జన్మించింది.
ఎన్టీఆర్నగర్కి చెందిన ముక్తార్ బేగ్ చిన్న కూతురు, ఓ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తుందన్న విషయం కొందరి ద్వారా కాటూన్ తెలుసుకుంది. ఈ నెల 7న ఎన్టీఆర్నగర్కి చేరుకున్న ఆమె చిన్నారిని ఒక లక్ష రూపాయలకి దత్తత ఇచ్చేందుకు ముక్తార్ బేగ్‌ని సంప్రదించింది. ఆయనకు ఎక్కడి నుంచైనా పాపను ఎత్తుకొచ్చిందేమోనన్న అనుమానం కలిగింది. ముక్తార్ బేగ్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు లాల్మోన్ కాటూన్తో పాటు చిన్నారిని తమ వెంట స్టేషన్‌కి తీసుకువచ్చి విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులతో పసికందును కన్న తల్లే అమ్మేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. లాల్మోన్ కాటూన్కి పోలీసులు నోటీసు జారీ చేసి.. తల్లితో పాటు ఎనిమిది రోజుల చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. తల్లితో పాటు చిన్నారి ప్రస్తుతం సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నారు.