సవర వద్ద ఉన్న పోటిసుణ్ని మియంకుడు అనుకొని అతణ్ని తన వెంటబెట్టుకొని పోవడానికి సిద్ధపడతాడు ఈసాణుడు. తనను కమలసత్తి కొడుకులా ఆదరించడం చూసి చలించి పోతాడు ప్రణాలుడు. అప్పుడే అక్కడికి సచ్చసామి వస్తాడు. ఆ తర్వాత..
లోపలికి వెళ్లిన ప్రణాలుని రాకకోసం బయటి నుండే నిరీక్షిస్తూ సోకులను సవరించుకుంటున్న భాణుసత్తి మనసు మనసులో లేదు. కనుల నిండా ప్రణాలుడే ఉన్నాడు. ఎన్నడూ సరిగ్గా చూడనైనా లేని మగని కన్నా, కనుల నిండుగా చూసుకోగలిగిన ఈ కోడెకాడే ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. పైగా తమ అవసరాలను కాదనకుండా, అయాచితంగా నెరవేరుస్తున్నాడు. అతనికీ తనకు ఏదో బంధం ఉన్నట్లు మనసు గట్టిగా నమ్ముతున్నది.. అట్లా ఆలోచిస్తున్న భాణు తనలో తాను నవ్వుకుంటున్నది; శూన్యంలోకి చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నది. సరిగ్గా అదే సమయానికి సచ్చసామి అక్కడికి వచ్చినాడు. రెట్టించిన అందంతో మనసును రెచ్చగొడుతున్న భాణును చూసినాడు. ‘ఇటువంటి అందం కనిపిస్తే దారి దోపిడిగాళ్లు ఎత్తుకొని పోరా? ఈమె కోసం నేనే ఒక దోపిడీదారుగా మారాలనిపిస్తున్నది’ అనుకుంటూ తనను తాను అదుపులో పెట్టుకునే తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఆమెను పలకరించినాడు.. “అపరంజి బొమ్మా! నీ నిరీక్షణ ఎవరికోసం?” సచ్చసామి. “ఎదురుచూసిన క్షణాలు అంతరించినాయి” భాణుసత్తి. “ఎవరికై ఎదురుచూసినావు?” అతను.
“నా ప్రాణం నాకు దక్కింది!” ఆమె నవ్వుతున్నది. “నన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావు?” అతను. “ఎవరిది వాళ్లే గ్రహించాలి! నేను అతని గురించే ఆలోచిస్తున్నా..” ఆమె. పొంతనలేని ఆమె మాటలు వింటూ సచ్చసామి ఇట్లా తలపోసినాడు.. చూపులెటనొ నిలిపి శూన్యంబునను జూచె నవ్వుచుండె కారణంబు లేక పొంతనమ్మె లేదు పొలతి మాటల యందు దాని మనసు వలపు వాన గాదె! (ఆమె చూపులు శూన్యంలో ఉన్నాయి; ఏ కారణం లేకనే నవ్వుతున్నది; మాటకూ మాటకు పొంతనలేదు. నిజంగా ఆమె మనసు నిండా ప్రేమ వర్షిస్తున్నది కదా!)’ అంతలో.. లోపలి నుండి ముగ్గురూ బయటికి వచ్చినారు. ముందుగా బయటికి వచ్చిన ఆహవసత్తికి సచ్చసామిని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ‘వీడేమీ! ఎదనావు (ఎద కొచ్చిన ఆవు) వెంట పడ్డ ఆంబోతులాగా తిట్టినా కొట్టబోయినా విడువకుండా భాణు వెంట తిరుగుతున్నాడు’ అనుకున్నది. ఆమె వెనుకనే గుమ్మంలో కనిపించిన గుడ్డి ముసలమ్మని చూడగానే.. ‘ఆమే ఈ ఆడపిల్లల అత్త’ అని గ్రహించినాడు సచ్చసామి. ‘ఆ ముసలమ్మను లోబరుచుకుంటే ఈ ఇద్దరు ఆడవాళ్లతో ఆడుకోవచ్చు’ అనుకున్నాడు. “అమ్మా! నమస్కారం! నా పేరు సచ్చసామి. ఈ ఊళ్లో పెద్ద రైతును. ఎందరికో పనులు కల్పించడమే గాక, ఆపదలో ఉన్నవారికి ఆశ్రయం ఇస్తాను. మీరు ముగ్గురూ ఇక్కడ తోడు లేకుండా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు.
కాదు.. కాదు.. కష్టంగా ఉంది. మీరు మా ఇంటికి రండి! లంకంత కొంప. స్వేచ్ఛగా సంతోషంగా ఉండవచ్చు..” ‘మేం వస్తే నీకు స్వేచ్ఛ, సంతోషం! మాకు ప్రాణ సంకటమే కదా సచ్చసామీ!’ అనుకున్నది మనసులో ఆహవ. సచ్చసామి ఈ విధంగా కొనసాగించినాడు.. “మా ఇంట ఉండటం మీకు నచ్చకపోతే, అప్పుడప్పుడూ నేనే వస్తుంటాను. మీ బాగోగులు చూసుకుంటాను!” అంటూ ఓరకంట భాణుసత్తిని చూసినాడు. ఆమె వెంటనే స్పందించింది.. “ఏం అవసరం లేదు! మా యోగక్షేమాలు మేం చూసుకోగలం!” అన్నది కట్టె విరిచినట్లు. అప్పుడు వెంటనే కమలసత్తి కల్పించుకొని.. “ఏమే కోడలు పిల్లా! ఈ ఇంటి పెద్దను నేను ఇంకా బతికే సచ్చినాను కదా!” అని భాణును మందలించి, సచ్చసామితో.. “చూడు నాయనా! నేను ఈ ఇంటి పెద్దను. ఇక్కడ నా మాట మాత్రమే సాగాలి. పిల్లల మాటలు పట్టించుకోకండి!” అన్నది. సచ్చసామి ఆశ అంబరాన్ని అంటింది కమల సత్తి మాటలతో. సంతోషంతో ఏదో అనబోయేంతలో ఆ అంధవృద్ధ ఇట్లా కొనసాగించింది.. “మేం ఎవరి ఇంటిలోనూ ఉండలేము నాయనా! నీవు చాలా ఉత్తముడిలా ఉన్నావు” అనగానే అంతవరకూ ఉబ్బిపోయిన సచ్చసామి, గాలి తీసిన తిత్తిలాగా అయిపోయినాడు. “మా వ్యవహారం నీకు ఈ పాటికే అర్థమయి ఉంటుంది. మేము ఎవరిమీదా ఆధారపడి ఉండలేము. అయినా దూరదేశం పోయిన నా కొడుకు వచ్చేసినాడు కదా!” అన్నది. ఆ మాట విన్న నలుగురూ ఉలిక్కిపడ్డారు! ఆహావ, భాణు, సచ్చసామితోపాటు ప్రణాలానందుడు కూడా.
భటులిద్దరూ కుసుమ శ్రేష్ఠిని బరబరా ఈడ్చుకుంటూ పోయి, చీకటి గదిలోకి తోసేసినారు. భటుని వేషంలోని జయసేనుడు సాటివానితో.. “ఒరేయ్! నీవు వెళ్లిపో! నేనీ ముసలోడిని లోపల కట్టిపడేసి వస్తా!” అన్నాడు. “అట్లనే! కొంచెం భద్రం! వీడు ముసలోడే గానీ బలవంతుడు. ఏమన్నా అవసరమైతే నన్ను పిలువు! ఈ పక్కనే ఉంటాను!” అన్నాడు. వాడు వ్యక్తిగత అవసరం నెరవేర్చుకునే మిషతో. లోపలికి వెళ్లిన జయసేనుడు తండ్రితో.. “నాయనా! మీరేం చింతించకండి! మనకు మంచి రోజులు వచ్చినాయి. పడిపోయిన మీ గొంతు మీకు వచ్చింది. వామదేవుడు కూడా ఇప్పుడు రాజసౌధంలోనే మారువేషంలో ఉన్నాడు. మాకు ఇంకా కొంతమంది సాయం చేస్తున్నారు. మనం తొందర్లోనే బయటపడతాం!” అన్నాడు. అంత సంతోష సమయంలోనూ శ్రేష్ఠికి దుఃఖం ఆగలేదు. ఆ దుఖం తన భార్య సిరిసత్తి గురించి; తన కోడలు రోహాదేవి గురించి. చీకటిలో అదంతా గమనించని జయసేనుడు ఎక్కువసేపు లోపల ఉండటం మంచిది కాదని, గబుక్కున బయటికి వెళ్లి గడియ వేసి, తాళం వేసినాడు. ఆపై సరాసరి వామదేవుడు చెప్పిన ఆనవాళ్లను అనుసరించి అవణాయరు మందిరం పక్కన గల గది వద్దకు చేరుకొని, గుమ్మానికి రెండవ పక్కన నిలబడ్డాడు. అంతకుముందే మరో పక్కన ఉన్న భటుడు జయసేనుణ్ని గుర్రుగా చూసినాడు. వాడు అట్లా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు అతనికి.
‘చీకటి కొట్టులో నా స్థానంలో ఇంకొక భటుణ్ని బంధించినాం.. కొంపదీసి ఇది వాని స్థానం కాదు కదా! వానికీ వీనికీ తగని చెలిమి ఉందేమో.. తన ఉనికిని భరించలేక పోతున్నట్లున్నాడు’ అనుకొని మొహం పక్కకు తిప్పుకొన్నాడు. అవతలివాడు తగ్గేట్టు కనిపించలేదు. కొంచెంసేపు ఇద్దరూ సేవక ధర్మాన్ని అనుసరించి మౌనంగానే ఉన్నారు. తర్వాత అవతలి వానికి అనుమానం వచ్చినట్లున్నది. “ఒరేయ్! నీకు ఇక్కడ ఏం పని రా?” అన్నాడు వాడు. ఏం మాట్లాడాలో వెంటనే తోచక.. “నీకు ఇక్కడ ఏం పని రా?” అన్నాడు జయసేనుడు. జవాబు చెప్పలేనప్పుడు ప్రశ్నకు ప్రశ్నే గతి! అన్నట్లు. “నన్ను ప్రభువుల వారు నియమించినారు! నా విధి ఇదే!” అన్నాడు వాడు దృఢంగా. “నా విధీ ఇదే! నన్ను వామ.. నియమించినారు” అన్నాడు. వామదేవుని పేరు చెప్పబోయి, అంతలోనే అసలు సంగతి గుర్తుపడతారని.. సగంలో ఆపేసినాడు. అయినా ఆ రెండక్షరాలనే విని అనుమానంతో అడిగినాడు వాడు.. “వామ ఎవరు?” “వామ.. కాదు.. మామ!” అన్నాడు ఏమనాలో తోచక అప్పటికప్పుడు అనాలోచితంగా జయదేవుడు. “మామనా? ఎవరు నీ మామ?” అవతలి వానిలో అనుమానం మరింత బలపడింది. కంగారును కప్పిపుచ్చుకుంటూ వెంటనే.. “దొరవారే!” అనేసినాడు జయ దేవుడు. సరిగ్గా అప్పుడే అవణాయరు అటుగా వచ్చినాడు. “ఏందిరా అల్లడూ! ఈ లొల్లి ఏంది?” అన్నాడు. ‘అల్లడు’ అనే మాట అల్లుడిలా వినిపించి ఉలిక్కిపడ్డాడు జయసేనుడు. “మన్నించండి మహాప్రభూ! వీడు తమరి అల్లుడనని బీరాలు పోతున్నాడు!” అన్నాడు అల్లడు తలవంచుకొని. జయసేనుని గుండెలో రాయి పడింది. “ఎవడవు నీవు? నిజం చెప్పు!” నకశిఖ పర్యంతం చూస్తూ గద్దించినాడు అవణాయరు.
చిలుక వాడలోని భూ గృహంలో.. కొత్తగా వచ్చిన కుర్రవాణ్ని లోపలికి చేర్చి, వాడెప్పుడు లేస్తాడా.. వివరాలు తెలుసుకోవచ్చని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కాపలాగా ఉన్న ఇద్దరు మహిళలు. వాళ్ల పేర్లు వోహా, ససిప్పహా. సాయంత్రం రాత్రిగా మారి, తెల్లవారినా ఆ కుర్రవాడు మాత్రం నిద్ర లేవలేదు. “ఏందే! ఇంతకూ వీడు బతికున్నాడా? పైలోకానికి చేరుకున్నాడా?” పరిశీలనగా చూస్తూ అన్నది వోహా. “వాడు బతికితే మనకేంది? చస్తే మనకేంది? బతికుంటే తిండీ, నీళ్లు పెట్టి.. వాని సంగతంతా తెలుసుకుందాం. చస్తే పాడుపడ్డ బావిలోకి పడదొబ్బుదాం” నిర్లక్ష్యంగా అన్నది ససిప్పహా. “పాపం.. కదనే..” జాలిగా ఆ పడుచువాని ముఖం చూసింది వోహా. వోహాను బాగా పరిశీలించి చూసింది ససిప్పహా. “ఏందే! చూస్తుంటే వాని మీదపడి ఏదో చేసేటట్లున్నావ్..” అన్నది అనుమానం వ్యక్తం చేస్తూ. ఆ మాటలకు వోహా కంగారు పడలేదు. వాని పైనుంచి చూపు తిప్పకుండానే.. “కుర్రకుంక! కొబ్బరి ముక్కలా ఉన్నాడు. నేను వాని మీద పడినా, వాడు నా మీద పడినా నాకేం అభ్యంతరం లేదు. వీడిక్కడి నుంచి వెళ్లేలోపు ఒకరి మీద ఒకరం పడటం మాత్రం తప్పదు. అది ఎట్లా అనేదే ఆలోచిస్తున్నా!” అన్నది తదేక ధ్యానమగ్నంగా. “ఆఁ..” నోరు తెరిచింది ససిప్పహా. అంతలో ఆ కుర్రవాడు కదిలినాడు.
“ఆఁ.. అబ్బా.. అమ్మా.. దాహం..” అన్నాడు. “అయ్యో.. అయ్యో.. దాహం వేస్తున్నదటనే నా బంగారు కొండకు!” అని కంగారుపడుతూ లేచి, మూలనున్న కుండలో ముంతతో నీళ్లు ముంచుకొని వేగంగా తీసుకొని వస్తూ దభేల్న పడిపోయింది వోహా. అట్లా పడటం పడటం ఆ యువకుని మీద పడిపోయింది. అసలే భారీ కాయం! ఆపై నిలువునా పొట్టపై పడటంతో ఆ కుర్రవాడు ఠక్కున లేచి మళ్లీ పడ్డాడు. అట్లా లేచి పడే క్రమంలో గట్టిగా కేక పెట్టినాడు. ఆ కేక విని వోహా, ససిప్పహా నోళ్లు వెళ్లబెట్టినారు! ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు! “ఇప్పుడు అరిచింది నీవే కదనే?” అన్నది చూపుడువేలుతో బెదిరిస్తూ వోహాతో ససిప్పహా. “అయినా.. నీవే పడి, నీవే అరవడం ఏమిటే పిరికి దయ్యం!” అన్నది మందలిస్తున్నట్లు. “ఏయ్! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు!” బెదిరించింది వోహా. “ఇక్కడ మనల్ని చూస్తే దయ్యాలు, పిశాచాలే భయపడి ఒక్కటి పోసుకోవాలె! నీవే అరిచి అది నా మీదకి నెట్టి తప్పించుకోవాలని అనుకోకు!” అన్నది.
అని ఇద్దరూ దెబ్బలాడుకుంటుండగా ఆ యువకుడు కదిలినాడు! ఇద్దరూ ఒకేసారి అటు తిరిగి చూసినారు. నోటికి తాళం పడ్డట్లు అయిపోయినారు! వోహా పడ్డప్పుడు ముంతలోని నీళ్లు ఆ యువకుని ఎద మీద ఒలికిపోయినాయి పూర్తిగా. తడిసిన బట్టల నుండి పొడుచుకొని వచ్చిన ఆడతనం వాళ్లిద్దరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు! ఎగిరి పడ్డప్పుడు తలపాగా జారిపోయి, అందమైన నల్లని వంకీల కురులు బయటపడ్డాయి. “నిజమే! వీడు మగాడు కాదు.. ఆడదే!” ఇద్దరూ కూడబలుక్కున్నట్లు అన్నారు. ఆ శబ్దంతో ఉలిక్కిపడి లేచినాడు.. కాదు! లేచింది చంద్రహత్థి.