రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ స్ఫూర్తితో ఓ బెంగాలీ యువకుడు చెట్టు కిందనే ఓ బడిని ప్రారంభించాడు. స్కూలు మానేసిన పిల్లలకు చదువు చెప్పాలన్నది అతని లక్ష్యం. పిల్లల చెంతకే బడిని చేర్చడం అతని ఆచరణ. చదువు కోసం కిలోమీటర్ల ప్రయాణం తప్పించి బడినే ఆదివాసీ గూడేనికి తెచ్చాడు. ప్రకృతి, పరిసరాలు, అనుభవాలే పాఠ్యాంశాలుగా ఆదివాసీ గూడెంలో ‘అనిర్వాణ విద్యాశ్రమం’ నిర్వహిస్తున్నాడు.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సమీపంలో బాగ్దబ్రా అటవీ ప్రాంతం ఉంది. ఆ వనసీమ పల్లెలో ఉంటాడు బిప్లవ్. తను ఎనిమిదో తరగతి విద్యార్థి. వాళ్ల కుటుంబంలో తనే పలకా బలపం పట్టిన మొదటివాడు. వాళ్ల ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కరోనా విజృంభణతో అతని చదువుకు, జీవితానికి దారి లేకుండా పోయింది. బిప్లవ్ స్నేహితులదీ అదే దయనీయ స్థితి. మూతపడిన బడులు రెండేళ్ల వరకు తెరుచుకోలేదు. ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకునే అవకాశాలు వాళ్లకు లేవు. నోట్లోకి అయిదు వేళ్లు పోని దరిద్రం. ఆ రోజుల్లో కూటికోసం తల్లిదండ్రులతో కలిసి కూలికి వెళ్లడం మొదలుపెట్టాడు. బిప్లవ్లాగే మిగతా ఆదివాసీల పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి కూలినాలికి వెళ్లసాగారు. కరోనా కలకలం ముగిసేసరికి.. ఆ పిల్లలకు చదువుపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది.
ఫరక్కాలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు అంశుమన్. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన ఆయన విశ్వకవి రవీంద్రుని ఆలోచనలు ఒంటబట్టించుకున్నాడు. వాటినే ఆచరణగా ఎంచుకున్నాడు. ప్రకృతితో స్నేహం చేయడం అతనికి ఇష్టమైన వ్యాపకం. ప్రకృతి ఆరాధకుడైన అంశుమన్ ‘పచ్చని చెట్లను పెంచుదాం. మొక్కలు నాటుదాం’ రమ్మని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఎంతోమందిని ఆకర్షించింది. ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. అందరూ కలిసి ఓ యాభై మొక్కలు నాటారు. ఆ సందర్భంలో కొంతమంది స్థానికులు, విద్యార్థులతో కలిసి ‘గచ్ గ్రీన్ హ్యాండ్స్ సోషల్ వెల్పేర్ ట్రస్ట్’ను ఏర్పాటుచేశాడు అంశుమన్. ఆ సమయంలో అంశుమన్ పూర్వ విద్యార్థి అక్కడే ఉన్నాడు. అతను తన ఊరు సమ్లాపూర్కి రావాలని అంశుమన్ని కోరాడు. మొదటి లాక్డౌన్ విధించినప్పుడు అంశుమన్ ఆ ఊరిని సందర్శించాడు. పచ్చదనంతో ఆ ఊరు శాంతినికేతన్లా అందంగా ఉంది. కానీ, అక్కడి పిల్లలు శాంతినికేతన్ విద్యార్థుల్లా లేరు. అంశుమన్ దృష్టి బడి మానేసిన పిల్లలపై పడింది. ఆదివాసీ తొలితరం విద్యార్థుల్ని మళ్లీ బడిబాట పట్టిస్తే ఆ కుటుంబాల్లో మార్పు వస్తుందని భావించాడు. వాళ్లకోసం సమ్లాపూర్లో బడి ప్రారంభించాలనుకున్నాడు. కానీ, తన దగ్గర డబ్బు లేదు. ఆ పిల్లల తల్లిదండ్రుల సహకారంతో చేయాలన్నా వాళ్లూ నిరుపేదలు. వాళ్ల కోసం చెట్టు కింద వీధి బడిని ప్రారంభించాడు అంశుమన్. ప్రారంభంలో అయిదుగురు పిల్లలతో ఈ బడి మొదలైంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్లో అంశుమన్ చదువుకున్నాడు. విద్యార్థి సమగ్ర వికాసాన్ని పెంపొందించేలా అక్కడ బోధన జరిగేది. శాంతినికేతన్లో ప్రకృతి, పరిసరాలు, అనుభవాల నుంచి కొత్త విషయాలు నేర్పించినట్లుగానే అయిదుగురు విద్యార్థులకు చుట్టూ ఉన్న ప్రకృతి, పరిసరాలతో పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. పుస్తకాలతో కుస్తీ లేకుండానే ఆటపాటలతో పాఠ్యాంశాల్లోని సారాన్ని పిల్లలకు అందించేవాడు. ‘అనిర్వాణ’ వీధి బడిలో పిల్లలకు ఆటపాటలతోపాటు ప్రకృతి, పరిసరాలు, సంస్కృతి, జీవిక కోసం చేయాల్సిన వృత్తుల గురించి అవగాహన కల్పిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలను అనుసరిస్తూ శాంతినికేతన్లో వేపచెట్లు, మామిడి చెట్ల కింద పాఠాలు చెబుతుంటారు. కేవలం పుస్తకాలు, పాఠ్యాంశాలే కాకుండా ప్రకృతి, పరిసరాలతో విద్యార్థి అనుభవాల ఆధారంగా విధ్యాబోధన ఉంటుంది. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం కూడా నేర్పిస్తారు. ఆయా కళలను కళాకారులు వచ్చి బోధిస్తారు.
అనిర్వాణ ప్రారంభానికి ముందు ఉదయం ఆరున్నర గంటలకు విద్యార్థులకు అల్పాహారం వడ్డిస్తారు. ఆదివాసీ పిల్లల కోసం అంశుమన్ చేపట్టిన విద్యా కార్యక్రమం ఆ ఊరి పంచాయితీ పెద్దకు నచ్చింది. స్థానిక కమ్యూనిటీ సెంటర్ని వాడుకోవాలని సూచించాడు. ప్రకృతే పాఠశాల అయినప్పటికీ వానలు, ఎండల్లో విద్యా బోధనకు ఆటంకం లేకుండా దానిని వాడుకుంటున్నారు. అయిదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రకృతి బడిలో వారం తిరిగే సరికి 20 మంది విద్యార్థులు ఉన్నారు. మూడేండ్లలో ఆ సంఖ్య 105కు పెరిగింది. వీళ్లలో ఓనమాలు దిద్దే వాళ్ల నుంచి ఇంటర్మీడియెట్ చదివే వాళ్ల వరకు ఉన్నారు. ఈ పాఠశాలకు సొంత భవనాలు నిర్మించి, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నది అంశుమన్ కోరిక. ప్రతి విద్యార్థికి నెలకు 300 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు. తన సంపాదనతోపాటు మరికొంతమంది దాతల సాయంతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. పట్టణాల్లోనే కాదు విద్యార్థి ఉన్న ప్రతిచోటా విద్యా వసతులు ఉండాలన్న అంశుమన్ ఆశకు ప్రతిరూపం ఈ అనిర్వాణ విద్యాలయం. దేశంలో ఉన్న అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి బడులు వెలిస్తే వాగులు దాటి, అడవులు దాటి విద్యార్థులు ప్రయాణించాల్సిన కష్టాలన్నీ తప్పిపోతాయి. అది జరగాలంటే ఆంశుమన్ లాంటివాళ్లు ప్రతి ఆదివాసీ గూడేనికి రావాలి.
అయిదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రకృతి బడిలో వారం తిరిగే సరికి 20 మంది విద్యార్థులు ఉన్నారు. మూడేండ్లలో ఆ సంఖ్య 105కు పెరిగింది. వీళ్లలో ఓనమాలు దిద్దే వాళ్ల నుంచి ఇంటర్మీడియెట్ చదివే వాళ్ల వరకు ఉన్నారు. ఈ పాఠశాలకు సొంత భవనాలు నిర్మించి, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నది అంశుమన్ కోరిక. ప్రతి విద్యార్థికి నెలకు 300 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు.