జరిగిన కథ
అలసుద్ది రోహను సమాధాన పరుస్తుంది. వామదేవుణ్ని తోడు తీసుకొని మల్లసు పర్వతం చేరుకుంటాడు జయసేనుడు. కుసుమ శ్రేష్ఠి మాట పడిపోతుంది. అతణ్ని ఈసాణుడి వద్దకు తీసుకొని పోతారు భటులు. మునిపల్లెలో సమరణుడి ప్రశ్నలకు మాధవుడు చెప్పబోయే జవాబు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. తర్వాత..
“శత్రువులు ఎందుకు ఏర్పడతారు? రాజ్య నిర్మాణం చేయుమని, ప్రజలను పాలించుమని, శిక్షించుమని, ఇతరులను హింసించుమని ఏ వేదం చెప్పింది? స్త్రీలను నీచంగా చూడుమని, పేదలను బానిసలుగా పరిగణించుమని ఏ దైవం బోధించినాడు?” ప్రశాంత గంభీర స్వరంతో ప్రశ్నించినాడు సమరణుడిని.. అతను అడిగిన ప్రశ్నలకు అతణ్నే మూలాలను చెప్పమన్నాడు మాధవుడు. మాధవుడు అట్లా అడుగుతాడని ఊహించలేని సమరణుడు నిరుత్తరుడైనాడు. జనంలో కలకలం మొదలైంది. “నిజమే.. నిజమే.. దేవుడు చెప్పిండా?” అంటూ గుసగుసలాడుకో సాగినారు. “అవును! దేవుడే బోధించినాడు!” మరింత బిగ్గరగా అంటూ ముందుకు వచ్చినాడు బ్రాహ్మణ యువకుడు కలసగంధుడు. “ఏమని చెప్పినాడు? ఎప్పుడు చెప్పినాడు? ఎవరికి చెప్పినాడు?” అడిగినాడు సాధనానందుడు. “ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునునితో చెప్పినాడు!” అన్నాడు నిశ్చయంగా కలసగంధుడు. “అంటే.. అంతకుముందు త్రేతాయుగంలో శ్రీరాముని కాలం నాటికి ఈ విషయం ప్రస్తావన లేదు. శ్రీకృష్ణుడు దైవమా? మానవుడా? శ్రీరాముడు మానవుడని, మానవోత్తముడని, కారణజన్ముడని, సకల సద్గుణోపేతుడని, దైవాంశ సంభూతుడని రామాయణంలో వాల్మీకి ప్రకటించినాడు. వ్యాసుడు భారత గాథను రచించినాడు. అందులో భగవద్గీతను శ్రీకృష్ణుని ముఖతా అందించినాడు. అంతే కదా!” అన్నాడు మాధవుడు. దానికి వెంటనే సమాధానం చెప్పలేకపోయినాడు కలసగంధుడు.
అతని అయోమయాన్ని అర్థం చేసుకుంటూ.. “సరే! శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పినాడు?” అన్నాడు మాధవుడు, అతన్ని కొనసాగించడానికి అనుమతి ఇస్తున్నట్లు. కలసగంధునిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయినా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో.. “చాతుర్ వర్ణ్యం మయాసృష్టం-గుణకర్మ విభాగశః అంటే, లోకంలోని ఈ నాలుగు వర్ణాలు తానే సృష్టించినాను అన్నాడు. కర్మలను అనుసరించి, గుణాలను అనుసరించి విభజన చేశానన్నాడు. ఆ నాలుగు వర్ణాలే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణుడు దైవ స్వరూపుడు, మార్గదర్శనం చేయాలి; క్షత్రియుడు పౌరుష స్వరూపుడు, సమస్తాన్ని రక్షించాలి; వైశ్యుడు న్యాయ స్వరూపుడు, అందరికీ అన్నీ సమకూర్చాలి; శూద్రుడు కర్మస్వరూపుడు, అన్ని పనులు చేయాలి. అప్పుడే ఈ లోకం సుభిక్షంగా, శాంతియుతంగా ఉంటుంది. సుఖసంతోషాలతో కళకళ లాడుతుంది” సభలో చాలామంది చప్పట్లతో కలసగంధుని అభినందించినారు. అతను ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడానికి అది దోహదం చేసింది. “అవును! భగవంతుని సృష్టిలోనే ఈ భేదం ఉందనుకుందాం. ఇది అంతకుముందు లేదా? అసలు ఎందుకు ఈ వర్ణభేదం? ఇందులో స్త్రీల ప్రస్తావన ఎందుకు లేదు?” అని అడిగినాడు పోటిసుడు. “ఎందుకంటే భగవంతుని మొహం నుంచి బ్రాహ్మణులు; భుజాల నుంచి క్షత్రియులు; రొమ్ము నుంచి వైశ్యులు; పాదాల నుంచి శూద్రులు జన్మించినారు” అన్నాడు రెచ్చిపోయినట్లు కలసగంధుడు. ఒక్క నవ్వు నవ్వినాడు మాధవుడు. “ఇది హేతువాదం ముందు నిలబడదు. ఇది కూడా భగవద్గీతలోనిదేనా?” అని అడిగినాడు.
“…….”
సమాధానం చెప్పలేక పోయినాడు కలసగంధుడు.
“నేను చెప్తాను!” అంటూ మళ్లీ మాధవుడే అన్నాడు.
“ఇది పురుష సూక్తంలో ఉన్నది.
బ్రాహ్మణస్య ముఖమాసీత్
బాహవే రాజన్య కృతః
ఉరోర్తదస్య యద్వైశ్యిః
పద్జ్యోగం శూద్రోజాయతః ॥
.. అంటే, ఈ నాలుగు వర్ణాలు ఇట్లా జన్మించినారని కాదు! అజాయతే అంటే ఆయెను, ఉండెను అనే అర్థంలో అన్వయించుకోవాలి. అప్పుడు ఆ విరాట్ స్వరూపుని ముఖం బ్రాహ్మణుడు; బాహువులు క్షత్రియులు; పొట్ట వైశ్యులు; పాదాలు శూద్రులతో సమానమని భావం. అంతేగానీ ఆయా అంగాల నుంచి జన్మించినారని కాదు! పైగా గుణాన్ని, కర్మలను అనుసరించే మానవ విభజన చేయుమన్నాడు కానీ, పుట్టుకను అనుసరించి కాదన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి!”
ఒక క్షణం విరామం తీసుకొని మళ్లీ కొనసాగించినాడు మాధవుడు.. “నిజానికి రూపరసగంధములు లేని నిరాకారుడు, నిరంజనుడు, అనంతుడు, అవ్యయుడు భగవంతుడు. అతనికి ఆకారాలు ఏర్పరిచి, అలంకారాలు కల్పించి, ఆరాధనా విధానాలు సృష్టించి మనుషుల మధ్య వైరాలు నెలకొల్పుతున్నది మీవంటి మందమతులు” ఆ మాటలకు సమరణుడు కత్తి తీయబోయి, అంతలోనే ఆగిపోయినాడు. అదేమీ పట్టించుకోకుండా మాధవుడు ఇంకా ఇట్లా అన్నాడు.. “అమాయకులను మభ్యపెట్టి, అధిక సుఖాన్ని, అధికారాన్ని, వైభవాన్ని పొందాలనుకోవడం సరికాదు! అట్లాగని ఇప్పటికే ఏర్పడ్డ ఈ రాచరిక వ్యవస్థను కూలదోసి, అందరినీ సమానంగా బతుకుమనడం కూడా తిరోగమనమే! అందుకే మీరు మీమీ పనులు చేసుకుంటూనే సత్యాన్వేషణ చేయండి! అధికులు – అల్పులు అనే భావనను విడనాడండి! కొంతమంది సుఖం కోసం, సంతోషం కోసం ఇతరులను కష్టపెట్టకండి! కోరికలను త్యజించడానికి ప్రయత్నించండి! కామ్య దృష్టి లేకుండా కర్మలను నిర్వహించండి!” సిరి రాయడు కల్పించుకొని.. “కాదు! ఎక్కడ ఉండవలసిన వాళ్లు అక్కడ ఉంటేనే ఈ లోకం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. శూద్రులు పాదాల నుంచి ఉత్పన్నమైనారు. వాళ్ల స్థానం అదే!” అన్నాడు. “నిజమే! నీవు భగవంతుని శిరస్సుకు పూజ చేస్తావా? కాళ్లకు పూజ చేస్తావా?” అని అడిగినాడు పోటిసుడు. “పాదాలకే!” వెంటనే అన్నాడు సిరి రాయడు. “అంటే.. ఆ పాదాల నుంచి పుట్టిన శూద్రులకే నీవు పూజ చేస్తున్నట్లు కదా! ఇప్పటికైనా శూద్రులు పూజ్యులు అని అర్థం చేసుకో! శ్రమను గౌరవించే సంస్కారం పెంచుకో!” అన్నాడు పోటిసుడు. అందరూ చప్పట్లు చరుస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేసినారు.
చిలుకవాడలో నెట్టయిన ఇల్లు సవరసత్తిది. వాడలోని జాడలన్నీ పూర్తిగా తెలిసిన ప్రౌఢ ఆమె. నిజం చెప్పాలంటే సవరసత్తి ముందు తరంలో.. వాళ్ల తల్లితోనే ఇక్కడ వాడ ఏర్పడ్డది. ఆమె అసలు పేరు ఎవరికీ తెలవదు. ఆమెను ‘చిలుక’ అనే సంబోధించేవారు. ఆమె పేరుతోనే ఆ గ్రామం ‘చిలుకవాడ’ అయ్యింది. ఆమె ద్వారానే ఒక్కరొక్కరూ అక్కడ చేరి, అది గ్రామమయ్యింది. ఆనాటి నుంచీ ఆ వాడ మీద వాళ్ల కుటుంబానిదే ఆధిపత్యం. సవరసత్తి కూడా తల్లిని మించిన నెరజాణ. వాడలో అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, చిలుకల కోసం వచ్చే సంపన్నులకు; సంపన్నుల కోసం ఎదురుచూసే చిలుకలకు తాను ఒక వారధి అయ్యింది. పారితోషికాన్ని బట్టి పడతులను సమకూర్చడంలో ఆమెది అందెవేసిన చేయి. మహామాత్యుడు ఈసాణుడు తరచూ ఆమె ఇంటికి రావడం; వలసినంత సేపు అక్కడ ఉండటం; తనకు కావలసిన అంగనామణులను ఏర్పాటు చేయించుకోవడం బహిరంగ రహస్యమే! అతనికి ఇష్టమైనవన్నీ సకాలంలో ఏర్పాటు చేస్తూ, అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో బహుమతిని అందుకోవడం సవరసత్తికి అలవాటే! విదేశాల నుంచి తెప్పించిన ద్రాక్షారస మద్యం అంటే అతనికి తగని ప్రీతి. అనుపానాలు సమకూర్చి, చశకం నిండా ద్రాక్షారసం నింపి ఇచ్చింది సవరసత్తి ఈసాణుడికి. మూడు పాత్రలు ఖాళీ చేసినాడు. అతను. రాత్రి మూడవ జాము పూర్తయ్యింది. మత్తు బాగా తలకెక్కింది మంత్రి గారికి,
“సత్తీ.. సవరా.. వరా..” అన్నాడు ముద్దముద్దగా, ముద్దు ముద్దుగా, ఆమెను దగ్గరికి రమ్మని సైగ చేస్తూ. నవ్వుతూ అతని సరసన కూర్చున్నది సవర. కమ్మని మల్లెపూల వాసన గుమ్మని అతని ముక్కుపుటాలను అదరగొట్టింది. “కొంచెం దూరం.. ఇంత భరించలేను!” అన్నాడు ద్వంద్వార్థంలో. “మరి ఎంత కావలెనో..” వెటకారం జోడిస్తూ కొంచెం దూరం జరిగింది. “ఎంత కాదు! ఎవరు కావాలని అడుగు, చెప్తా..” ఆమె ఏం మాట్లాడలేదు. అయినా అతను చెప్తాడని ఆమెకు తెలుసు. చివరికి అదే జరిగింది.. “నీ వాడలోని ఒక పిల్లను ఇంతవరకూ నా సన్నిధికి చేర్చలేదు. ఆ పిల్లను నీవు ఈరోజు ఎట్లాగైనా నా మంచం మీదికి రప్పించ వలసిందే!” అన్నాడు పట్టుదలగా ఈసాణుడు. ‘అయ్యో! ఈ ముసలి మొగుడు అమాయకురాలైన ఆ సౌగంధికను అడుగడు కదా! పాపం ఇంకా దాని కన్నెరికం కూడా తీరలేదు. నచ్చినవాడు లభిస్తేనే ఆ పనికి పూనుకుంటానని నెలలు దాటేస్తున్నది ఆ అమాయకురాలు. చివరికి ఇటువంటి వృద్ధ జంబుకాల బారినపడదు కదా!’ అనుకున్నది. సవర ఏది జరగకూడదని కోరుకున్నదో, అదే జరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఈసాణుడు అదే పిల్ల కావాలన్నాడు. వెంటనే పిలిపించమన్నాడు కూడా. “సరే!” అనక తప్పలేదు సవరకు.
అయినా, సౌగంధిక ఈ సాయంత్రమే ఎవరినో ఇంటికి ఆహ్వానించిందని తెలిసింది. కానీ వాళ్లు అత్యవసర కార్యార్థులై మళ్లీ వస్తామని చెప్పి వెళ్లినారని సమాచారం. వాళ్లు వచ్చినారా? వస్తే ఆ పిల్ల ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యం ఏలుకుంటూ ఉంటుంది. రాకుంటే.. వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా ఈసాణుని వంటి అల్పబుద్ధుల కోసం సౌగంధిక వంటి అమాయకురాలిని బలిపెట్టడం తగదు!
‘అయినా, సౌగంధిక ఈ సాయంత్రమే ఎవరినో ఇంటికి ఆహ్వానించిందని తెలిసింది కానీ వాళ్లు అత్యవసర కార్యార్థులై మళ్లీ వస్తామని చెప్పి వెళ్లినారని సమాచారం. వాళ్లు వచ్చినారా? వస్తే ఆ పిల్ల ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యం ఏలుకుంటూ ఉంటుంది. రాకుంటే.. వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా ఈసాణుని వంటి అల్పబుద్ధుల కోసం సౌగంధిక వంటి అమాయకురాలిని బలిపెట్టడం తగదు!’ అని తనలో తాను చర్చించుకుని.. సౌగంధికకు బదులుగా ఇంచుమించుగా ఆమెలాగే ఉండే నిరుపమను పిలుచుకొని రమ్మని దాసిని పంపింది. నిరుపమకు చెప్పవలసింది అంతా చెప్పి తోడుకొని వచ్చింది దాసి. నిండుగా అలంకరించుకొని వచ్చిన ఆ చిన్నదాన్ని చూసి ముఖం చిట్లించుకున్నాడు ఈసాణుడు. ఆ పిల్ల చేయి పట్టుకొని కాగడా వద్దకు తీసుకొనిపోయి ఎగాదిగా చూసినాడు. ఎవరో గుర్తొచ్చినట్లున్నది. “సవరా!” అని గట్టిగా అరచినట్లు అన్నాడు ఈసాణుడు. ఉలిక్కిపడ్డది సవర. లేని గాంభీర్యాన్ని మొహానికి పులుముకొని అతని వద్దకు వెళ్లి నిలబడ్డది. “ఆనతినియ్యండి దేవర వారూ..” అన్నది వినయం ఉట్టిపడుతుండగా. మరుక్షణం చెంప చెళ్లు మనిపించినాడు ఈసాణుడు. అతను అట్లా కొడతాడని అనుకోలేదు సవరసత్తి. దెబ్బ తగిలిన చెంప మీద చేతిని ఆనించుకొని, కన్నీరు ఒలుకుతుండగా అతనివైపు చూసింది. “ప్రాలు కడిగిన నీటిని పాలటంచు నీవు పిల్లిని ఏ మార్చలేవు ; అట్లె అనుభవము కల్గు నావంటి ధనపతులను మాయ సేయంగ గలవే అమాయిక విను.. (బియ్యం కడిగిన నీళ్లను పాలు అంటూ పిల్లిని మభ్యపెట్టలేనట్లే, నాలాంటి అనుభవజ్ఞులైన సంపన్నులను మోసం చేయడం నీ వంటి అమాయకులకు సాధ్యం కాదు)” అన్నాడు ఈసాణుడు.