ఆటిస్టిక్ వ్యక్తులు తరచుగా ఆనందాన్ని అనుభవిస్తారని, ఈ ఆనందం వారి ఆటిస్టిక్ లక్షణాల కారణంగానే వస్తుందని నూతన అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా ఆటిస్టిక్ వ్యక్తుల జీవితాలు విచారంగా, ఆనందం లేకుండా ఉంటాయని, వాటికి ‘సరిదిద్దడం‘ అవసరమని చాలా మంది భావిస్తారు. ఈ అధ్యయనం ఆటిస్టిక్ వ్యక్తులు లోతైన ఆనందాన్ని పొందుతారని, అది కూడా వారి ఆటిజం కారణంగానే అని నిరూపించింది. ఎలియట్ వాసెల్ అనే పరిశోధకుడు 86 మంది ఆటిస్టిక్ పెద్దలపై ఒక సర్వే నిర్వహించారు. ఇందులో ఆటిస్టిక్ వ్యక్తులు దేనివల్ల సంతోషంగా ఉంటారు అనే దానిపై దృష్టి సారించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలు, నాన్-బైనరీ వ్యక్తులు ఉన్నారు. ఆటిస్టిక్ వ్యక్తులు ఆనందాన్ని అనుభవిస్తారని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
ఈ అధ్యయనం ఆటిస్టిక్ వ్యక్తుల ఆనందంలో నాలుగు ప్రధాన విషయాలను గుర్తించింది.
ఆటిస్టిక్ మెదడు పనిచేసే విధానానికి సంబంధించిన అనుభవాలలో చాలా మంది ఆనందాన్ని కనుగొన్నారు. కార్యకలాపాలలో పూర్తిగా లీనమైపోవడం, సమయం మర్చిపోవడం ఆనందాన్ని ఇస్తుంది. దాదాపు 95% మంది ఆనందించే కార్యకలాపాలలో లీనమవుతున్నట్లు తెలిపారు. రంగులు, అల్లికలు, కదలికలు ఇంద్రియాలు లీనమయ్యే అనుభవాలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయని వెల్లడించారు. ఇష్టమైన కార్యకలాపాలను పదే పదే చేయడంలో సంతృప్తి దొరికిందని తెలిపారు.
సర్వేలో దాదాపు 93% మంది తమ అభిరుచులను కొనసాగించడం ఆనందానికి ముఖ్యమైన మూలమని చెప్పారు. ఆటిస్టిక్ వ్యక్తులు ఆనందించే వాటిలో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆసక్తి ఉన్న విషయాలలో లోతుగా వెళ్లడం వారికి ఆనందం కలిగించింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 90% మంది కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆనందించారు. బయట ఉండటం, వన్యప్రాణులను చూడటం, పెంపుడు జంతువులతో కనెక్ట్ అవ్వడం వారికి సంతోషం కలిగించాయి. కళ, రచన, వస్తువులను తయారు చేయడం, సంగీతం వినడం, వాయించడం, దానిని అనుభూతి చెందడం లాంటి వాటిల్లో వారికి ఆనందం దక్కింది. ఆటిస్టిక్ వ్యక్తులందరూ ఒకే విషయాలను ఆనందించరు. కొందరు సంగీతాన్ని ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కొందరు తీవ్రమైన ఇంద్రియ అనుభవాలను ఆనందిస్తారు, చాలామంది ప్రశాంతమైన వాతావరణాన్ని నచ్చుతారు. సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది తమ ఒంటరి సమయాన్ని ఆనందించారు, 60% మంది సంబంధాలలో కూడా ఆనందాన్ని కనుగొన్నారు.
ఆటిస్టిక్ వ్యక్తుల ఇంద్రియాలకు అనుకూలమైన పరిసరాలు వారిలో ఆనందం కలిగిస్తాయి. నిశ్శబ్ద ప్రదేశాలు, రంగులు, నమూనాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆటిస్టిక్ జీవన విధానాలను అంగీకరించే వారితో ఉండటం వారి సంతోషాన్ని పెంచింది.
ఆటిస్టిక్ వ్యక్తుల ఆనందానికి అడ్డంకులు వారి లక్షణాలు కాదు. వారి పట్ల సమాజంలో ఉన్న దృక్పథం, సామాజిక వైఖరులు, ప్రవర్తనలు. ఈ అధ్యయనం ఆటిజంను ఒక రుగ్మత, లోపంగా చూసే రోగనిర్ధారణ నమూనాను సవాలు చేస్తున్నది. ఆటిజం నిజమైన బలం, ఆనందానికి మూలం అని తెలిపింది. ఆటిస్టిక్ వ్యక్తులు సంతృప్తికరమైన జీవితాలను గడిపే విధానాలు న్యూరో నార్మేటివ్ అంచనాల నుంచి భిన్నంగా ఉండవచ్చు. ఆటిస్టిక్ వ్యక్తులు సాధారణ మనుషుల్లా మారాలని దీని అర్థం కాదు. చాలా సందర్భాలలో ‘సరిదిద్దడానికి‘ ప్రయత్నాలు సహాయపడకపోగా హాని చేస్తాయి. ఆటిస్టిక్ వ్యక్తుల ఆనందానికి నిజంగా మద్దతు ఇవ్వడానికి ఇవి అవసరం
ఆటిస్టిక్ వ్యక్తులు చాలా విస్తృత భావోద్వేగాలను కలిగి ఉంటారు. వారిని భిన్నంగా చూడటం, ఎగతాళి చేయడం, వారి సామర్థ్యాలను అనుమానించడం తగదు. వారిని వారిగా అంగీకరించినప్పుడు, వారి ఇంద్రియ అవసరాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, న్యూరో డిగ్నిటీని గౌరవించినప్పుడు ఆటిస్టిక్ వ్యక్తులు జీవించడమే కాదు, వికసిస్తారు.