పొలాలనన్నీ హలాలు దున్ని.. ఇలా తలంలో హేమం పిండగ.. జగానికంతా సౌఖ్యం నిండగ… విరామ మెరుగక పరిశ్రమించే… బలం ధరిత్రికి బలికావించే.. కర్షక వీరుల కాయం నిండా..కాలువ కట్టే ఘర్మ జలానికి… ధర్మ జలానికి ఖరీదు లేదోయ్’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయినా నిత్యం అన్నదాతల బలవన్మరణాలతో మన భారతావని కునారిల్లుతున్నది. ‘రైతే దేశానికి వెన్నెముక. మనది వ్యవసాయ దేశం’ అని ప్రగల్భాలెన్ని పలికినా రైతు బతుకు నానాటికి నరకప్రాయమనే సత్యం చెప్పిన నాటకం అన్నదాత.
రాఘవయ్య నిఖార్సయిన సగటు రైతు. కాలం కలిసి రాక, పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర లేక, అప్పులపాలై రోడ్డున పడతాడు. కూతురి కాన్పు కష్టమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె నగలు తాకట్టుపెడతాడు. వాటిని విడిపించలేకపోతాడు. ఆ నగలు లేకుండా మెట్టినింట అడుగుపెట్టలేక పుట్టింట్లోనే బిడ్డ ఉండిపోతుంది. కాలేజీ ఫీజు కట్టి కొడుకు కష్టాన్ని గట్టెక్కించలేని దయనీయ స్థితిలో ఉంటాడు రైతు రాఘవయ్య. అడకత్త్తెరలో పోకచెక్కలా… ‘చావే శరణ్యం’ అన్న స్థితిలో ఉన్న రాఘవయ్యకు మోసాలతో తిమ్మిని బమ్మిని చేసే ఒక మనిషి తారసపడతాడు. ఔషధ మొక్కలని నమ్మబలికి రాఘవయ్యతో గంజాయి పంట వేయిస్తాడు. ఆ ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు. అసలు విషయం తెలిసే సరికి రాఘవయ్య చేతికి బేడీలు పడతాయి.
అప్పుడు రాఘవయ్య కోర్టులో…‘పదేళ్ల వయసునే పార చేతబట్టి పొలంలోకి దిగినోడ్ని. ఇంతకాలం సాగునే నమ్మా. సాగే బతుకనుకున్నా. చివరికి బతుకిట్టా చితికిపోయింది’ అని బాధపడతాడు రాఘవయ్య. ‘సారూ! మాకు ఇత్తనాలమ్మే వాడు బాగుపడుతున్నాడు. ఎరవులమ్మేవాడూ బాగుపడుతున్నాడు. నూలు మిల్లులోళ్లు, రైసు మిల్లులోళ్లు, నూనె మిల్లులోళ్లు బాగుపడుతున్నారు. చివరకు పళ్లు, కాయలు అమ్ముకునేవాళ్లూ బాగుపడుతున్నారు. కానీ, ఈ పంటలు పండించే రైతు ఎందుకు బతకలేక పోతున్నాడో మీరే చెప్పాలి? అని ప్రశ్నిస్తాడు. అసహనం, క్రోధం, నిస్సహాయతలో ఉన్న రాఘవయ్య మనసులోపలి నుంచి వచ్చిన మాటలివి.
రాఘవయ్య సంధించిన ప్రశ్నకు పాలకులు, రాజకీయ నాయకులే కాదు. యావత్ దేశం బదులివ్వాలి. ఎందుకంటే? మనది రైతు భారతం కాబట్టి. దేశంలో నేటికీ మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనాధారం. రైతు నిజాయతీగా వ్యవసాయం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో గంజాయి సాగు చేసిన పాపానికి అదే రైతుకు జైలు శిక్ష విధిస్తుంది.
‘రైతుని అన్నదాత అంటారు. అలాంటి నువ్వు స్వలాభం కోసం గంజాయి వంటి విషపు పంట పండించడం తప్పనిపించ లేదా?’ అని జడ్జి ప్రశ్నిస్తే.. ‘సారూ… ప్రభుత్వమంటే ప్రజల బాగోగులు చూడాలి. కదా! సర్కారే వ్యాపారులతోటి వీధికో మద్యం దుకాణం పెట్టించి, ప్రజలను తాగించడం తప్పు కాదా? మరి, ఆ మద్యం విషం కాదా? చుట్టా, బీడీ, సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కారకాలని చెబుతూనే పొగాకు లైసెన్స్ ఇవ్వడం తప్పు కాదా?’ అని న్యాయ మూర్తినే కాదు, న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తాడు.
‘పేదోడు తప్పు చేస్తే నేరం. అదే నేరం పెద్దోళ్లు చేస్తే… మసిపూసి మారేడుకాయ చేస్తారు. వేల కోట్లతో బ్యాంకుల్ని లూఠీ చేసినా పట్టించుకోరు. పైగా వారికి రుణమాఫీ!’ అని రాఘవయ్య కోర్టు హాలులో అన్న మాటలు పాలకుల ద్వంద్వనీతిని నగ్నంగా ఎండగడతాయి. మత్తు మాదక ద్రవ్యాల వ్యాప్తికి, గంజాయి సాగు, విక్రయం, వాడకానికి అసలు కారకులెవ్వరు? ఈ ప్రశ్నలను సూటిగా, సహేతుకంగా సంధిస్తుంది ‘అన్నదాత’ నాటకం. పాలకులు కార్పొరేట్లకు దేశాన్ని అప్పజెప్తూ, రైతును నిర్దయగా గాలికి వదిలేస్తున్న సత్యాన్ని రాఘవయ్య మాటలు తేట తెల్లం చేస్తాయి.
రచయిత వల్లూరి శివప్రసాద్ ‘ఊబి’ పేరుతో తానే రాసిన కథను ‘అన్నదాత’గా నాటకీకరణ చేశారు. చేయి తిరిగిన రచయిత గనుక నాటక రచనలో సంభాషణలు సహజ మాండలికంలో పదునెక్కాయి. నాలుగు పేజీల చిన్న కథ నాటకంగా ప్రాణం పోసుకుని సగటు రైతు సంక్షుభిత జీవితానికి అద్దం పట్టింది. రసరంజని ఆధ్వర్యంలో జూలై 23న హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘అన్నదాత’ నాటకం ప్రదర్శించారు.
నాటకం పేరు: అన్నదాత
రచన: వల్లూరి శివప్రసాద్
దర్శకత్వం: కొల్లా రాధాకృష్ణ
సమర్పణ: కళాంజలి, హైదరాబాద్
పాత్రధారులు: భుజంగరావు, శోభారాణి, సురభి ప్రియాంక, చెంచు పున్నయ్య,తిరుమల, శివరామకృష్ణ, సురేంద్ర, ప్రశాంత్ …?
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు