Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5, 2009న విడుదలైన ఈ చిత్రం నిన్నటితో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘జోష్’ చిత్రంతో అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన చైతూ, అప్పటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 24వ సినిమాతో బిజీగా ఉన్న చైతన్య, తాజాగా మరో స్టూడెంట్ పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాలేకపోయినా, ఇప్పుడే ఈ వార్తలు ఫ్యాన్స్‌లో కొత్త జోష్ తీసుకొచ్చాయి.
జోష్ చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన నాగ చైతన్యకి ఏ మాయ చేసావే చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 100% లవ్, మనం, ప్రేమమ్, లవ్ స్టోరీ, బంగార్రాజు, తండేల్ ఇలా వరుస విజయాలతో కెరీర్‌ను నిలబెట్టుకున్నారు. ఎక్కువగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నటించిన చైతన్య, కొత్త జానర్లకు కొంత దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, నాగచైతన్య మళ్లీ పవర్ఫుల్ స్టూడెంట్ రోల్ కోసం సిద్ధమవుతున్నారట. గతంలో జోష్ లో కాలేజీ స్టూడెంట్‌గా ఆకట్టుకున్న చైతూ, ఇప్పుడు ఇంకోసారి అలాంటి పాత్రతో స్క్రీన్ పై మెరవనున్నట్లు టాక్. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి చైతన్య ఇప్పటికే కథ విని ఫైనల్ చేశారని, త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయని సమాచారం. అయితే ఈ సినిమా దర్శకత్వం వహించబోయే డైరెక్టర్ ఎవరు? బ్యానర్ ఏది? అనే విషయాలు ఇంకా వెల్లడికాలేదు.
ఇక చైతన్య నటిస్తున్న 24వ చిత్రం (NC24) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది థ్రిల్లర్ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. నాగచైతన్య మళ్లీ స్టూడెంట్ పాత్రలో నటించబోతున్నారన్న వార్తతో, అక్కినేని ఫ్యాన్స్ లో సందడి మొదలైంది. గతంలో “చెబితే వినేవాడు అసలు స్టూడెంటే కాదు”, “క్యాంపస్‌లో చదువుకోలేదు, చరిత్ర రాశాం” వంటి డైలాగులు యువతను ఎంతగా ప్రభావితం చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో చైతూ కనిపిస్తాడన్న వార్తలు ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తున్నాయి.