జీ ఆ రహే హై! ఉటోఉటో”.. మెట్లపై అడ్డంగా కూర్చుని గ్రిల్స్‌కి వెల్డింగ్ పనిని తదేకంగా చేస్తున్న వాడిని హెచ్చరిస్తూ అన్నాడు, అతని పక్కతను.సన్నని తెల్లని దుమ్ము, ధూళితో నిండి ఉన్న ఆ తెల్లని పాలరాతి మెట్లపై, ఒంటిపై స్పృహ లేనట్లు, ఒంటికి-దుస్తులకు అంటిన తెల్లని సున్నంలాంటి పొడితో, ఏ రంగో గుర్తించడానికి వీలులేని విధంగా ఉన్న షార్ట్, చొక్కా, మెడలో పాముల్లా వేసుకున్న పనిముట్లతో, పరికరాలతో.. అతన్ని చూస్తే నిలువెల్లా భస్మం పూసుకున్న పరమ శివుడిలా కనిపించాడు నాకు. నా రాకతో తపోభంగం కలిగిన రుషిలా.. చేస్తున్న పని ఆపి, అతడు పక్కకు జరిగాడు.. నాకు దారిస్తూ. ఒక్కక్షణం వారికలా భంగం కలిగించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అతనొక్కడే నన్ను అంతగా ఆకర్షించడానికి ముఖ్య కారణం.. అతనిలో మాట పట్టింపుతో దూరమైన, నా ఒక్కగానొక్క ప్రియమైన తమ్ముని పోలికలు ఉండటమే!
నేను ఒక ప్రభుత్వరంగ సంస్థ హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాను. మూడు ఫ్లోర్లలో ఉన్న మా ఆఫీస్‌ను ఆధునీకరణ (మాడ్రనైజ్) చేయడం కోసం.. దశలవారీగా పనులు చేస్తున్నారు. పై రెండో ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్ల వారినీ, కింది, మొదటి అంతస్తులలో, క్యాంటిన్, క్లబ్ రూమ్, గెస్ట్ హౌస్లతోసహా అన్నిటినీ వాడుకుని సర్దుబాటు చేసారు. ఇప్పుడు రెండో ఫ్లోర్లో పని అయిపోవడంతో.. అందరితో కలిసి పైకి వెళ్లిపోయాను. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్‌లోని వారిని, పైన కింద సర్దుబాటు చేసాక.. మొదటి అంతస్తు పని జరుగుతున్నది.
మెట్టు మెట్టుకు చిన్నచిన్న రాళ్లు, రప్పలు, ఇటుక ముక్కలు, దుమ్ము ఉండటం వల్ల.. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా కింది నుండి కేవలం లిఫ్ట్‌లోనే పైకి వెళతారు. కానీ, నాకు మొదటి నుండి దిగడం-ఎక్కడం మెట్ల మీదుగానే బాగా అలవాటు. అంతేకాకుండా ఉన్నది ఒకే లిఫ్ట్ కావడంతో నలుగురే పడతారు. బయోమెట్రిక్ హాజరు కావడంతో ఆ సమయానికి ఎప్పుడూ అది చాలా బిజీగా ఉంటుంది. ఆ సమయంలో మెట్ల ద్వారా పైకి వెళితే.. స్వామికార్యం, స్వకార్యం లాగా ఆరోగ్యం, సమయానికి అటెండెన్స్ రెండూ త్వరగా ఒకేసారి జరుగుతాయని.. లిఫ్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. అందువల్ల నాకు ఎప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడో ఒకచోట తారస పడుతూనే ఉంటాడు.
ఒక్కో అంతస్తును అతి తొందరగా మూడు నెలల్లో పూర్తిచేసి ఇచ్చేట్లుగా అతి పెద్దదైన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది మా మేనేజ్మెంట్. దానితో శరవేగంగా రాత్రి, పగలు పనులు జరుగుతూనే ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వారంతా బిహార్, ఒరిస్సా లాంటి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారే! హైదరాబాద్ భవన నిర్మాణాలలో చాలామంది వీరే కనిపిస్తారు.
వాళ్లంతా వాళ్ల మాతృభాష కాకుండా, మాట్లాడే హిందీ కూడా ఒక రకమైన యాసతో ఉంటుంది. మన భాష వారికి అర్థం కాదు. సిమెంటుతో పని చేసేవారు, కార్పెంటర్స్, ఎలక్ట్రిసిటీ పనివాళ్లు, వెల్డింగ్ చేసేవాళ్లు, సానిటరీ వాళ్లు, ఫ్లోరింగ్ వాళ్లు.. ఇలా రకరకాల పనులు చేసే అందరూ అందులో ఉన్నారు.
వాళ్లంతా దాదాపు ఇరవై నుండి ముప్ఫైఐదు వయసు లోపుగా ఉన్నవాళ్లే! వాళ్లు ఎప్పుడు తింటారు? ఎప్పుడు, ఎక్కడ పడుకుంటారు? ఏ వివరాలు తెలియవు. కానీ నిశ్శబ్ద యజ్ఞంలా పనిమాత్రం జరిగిపోయేది. ఆ దుమ్ము ధూళిలోనే ఉన్న చిన్నగదిని ఉపయోగించుకోవడం చూసాను. ఆరోజు.. కింది డిపార్ట్మెంట్ నుండి ఫైల్ పట్టుకుని నా ఛాంబర్‌కి వెళుతూ.. పై ఆఫీసు నుండి చాలా ముఖ్యమైన ఫోన్ రావడంతో మెట్లపై ఒక చోట ఆగి సీరియస్‌గా మాట్లాడుతున్నాను. దాదాపు ఒక రెండు, మూడు నిమిషాలు మాట్లాడి ఉంటాను. అయిపోయాక ఎందుకో, ఎవరో వెనక నిలబడ్డట్టుగా అనిపించి చూస్తే.. ఒళ్లంతా దుమ్ము, తలమీద చుట్టబట్టపై ఇటుకల తట్ట, ఎడమ చేయిలో, భుజంపై పనిముట్లు, కుడిచేయితో మరొక చిన్న ఇసుక బస్తా మోస్తున్న అతను.. శంఖు చక్రాలు ధరించిన విష్ణుమూర్తిలా గోచరించాడు. అలా ఉన్నా అతని ముఖంలో ఏదో కళ తొంగి చూసేది. ఎప్పుడు చూసినా వారెవరికీ ఒంటిమీద, బట్టల మీద సోయి ఉండేది కాదు. మార్బుల్ ఫ్లోర్‌లోని తెల్లని దుమ్మంతా ఒళ్లంతా పూసుకుని, చేతుల్లో పనిముట్లతో డమరుకం పట్టిన బుడబుడకల వాళ్లలా కనిపించేవారు. వాళ్లెవరితో మాట్లాడేవారు కాదు. మేము కనిపించగానే పక్కకు తప్పుకొని పోయేవారు తప్ప.. ఒక్కమాట కూడా వారి నోటినుండి వచ్చేది కాదు. ఆఫీసులో ఎప్పుడైనా, ఎవరివైనా రిటైర్మెంట్స్, కాన్ఫరెన్స్, ట్రాన్స్ఫర్ లాంటి ఫంక్షన్స్‌లలో అందరికీ భోజనాలు ఆఫర్ చేసినప్పుడు మాత్రం.. అందరూ తిన్న తర్వాత వాళ్లు ప్లేట్స్ పట్టుకొని కిందికి వచ్చి.. మిగిలిన ఆహార పదార్థాలను వేసుకుని తినేవారు.
సాధారణంగా వాళ్ల కాంట్రాక్టర్ సమయం వృథా అవకుండా.. అందరికీ ఒకేసారి భోజనాలు రెండు మూడు క్యాన్లలో తెస్తాడని విన్నాను. అందులో ఎన్ని పోషకపదార్థాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే!ఓరోజు ఫస్ట్ ఫ్లోర్లో పని పూర్తి అయ్యిందని సహోద్యోగులతో కలిసి చూడటానికి వెళ్లినప్పుడు.. అక్కడే అద్దాలకున్న దుమ్మంతా దులుపుతూ బట్టతో, డస్ట్ రిమూవర్‌తో తుడుస్తూ కనిపించాడు.“ఆప్ కా నామ్ క్యా హై?” అన్నాను.“హరే!” అన్నాడు తుడుస్తూనే.యాదృచ్చికంగా తమ్ముని పేరు శ్రీహరి కావడంతో.. ఆనందంగా మాటలు పొడిగించాను. మా సంభాషణ అంతా హిందీలోనే జరిగింది. “అమ్మకి శ్రీహరి అంటే బాగా ఇష్టం. అందుకే ఆపేరే నాకు పెట్టింది” అన్నాడు.“చాలా బాగుంది నీ పేరు. అమ్మ ఏం చేస్తుంది?”“అమ్మకు కళ్లు లేవు. కాబట్టి ఏమీ చేయదు. చెల్లి తోడుగా ఉంటుంది. నాన్న చనిపోతే.. మా అమ్మ చిన్నప్పటి నుండి కూలి పనిచేసి చాలా కష్టాలుపడి మమ్మల్ని పెంచింది. పని దగ్గర జరిగిన ప్రమాదంలో కళ్లు పోయాయి” అన్నాడు. “కానీ, నీకు ఇక్కడ చాలా కష్టం కదా!”“అమ్మ బీమారిన పడ్డది. అక్కడ ఏ పని దొరకదు. అమ్మకు ఆరోగ్యం బాగు చేయించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను”
“రోజూ దాదాపుగా 12 గంటలకు పైగా పనిచేస్తారు కదా.. ఎంత ఇస్తారు?”ఆ మాట అనగానే కంగారుగా అటూఇటూ చూసాడు. పూర్తి అయిపోయిన ఫ్లోర్‌లోని అన్ని అద్దాలూ అతన్నే తుడవమన్నట్లున్నారు, దానితో చుట్టూ ఎవరూ లేరు. “నెలకు ముప్ఫై నుండి నలభై వరకిస్తారు. ప్రతినెలా ఇక్కడ వచ్చిన జీతం దాదాపుగా అమ్మకే పంపించేస్తూ ఉంటాను. అవి అక్కడ చేసిన అప్పులు తీరడానికి, అమ్మ మందులకు సరిపోతాయి. కొంతకాలం వరకు ఇలా చేస్తే అప్పు తీరిపోయిన తర్వాత మంచిగా చూసుకోవచ్చు” అన్నాడు.చాలా బాధనిపించింది. శ్రమ దోపిడి! ఇలాంటి ఎన్నో వందల, వేల మంది ప్రతినిత్యం మన కళ్లముందే కనిపిస్తున్నా.. ఏమీ చేయలేము. ఏదైనా అంటే, వారికి అక్కడ పని దొరకడం లేదు. అందుకని ఇక్కడ వీళ్లు దోచుకుంటున్నారు. నాకప్పుడు శ్రీశ్రీ రాసిన గీతాలు గుర్తొచ్చాయి.
‘కార్ఖానాలో…’, ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం..’, ‘ఏటి కేతం బట్టి ఏయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా!. కాకి తన్నిపోయరన్న, కాకిపిల్ల తన్ని..’ పాటలోని విషాదం కూడా చెవుల్లో ధ్వనించింది. వారు పడుకోవడానికి సరైన వసతులు కూడా లేవు. కేవలం ఒక్కటే బాత్రూమ్ ఇచ్చారు. ఎక్కడ, ఎవరూ మారు మాట్లాడకూడదు. ఎవరు ఏ పని, ఎంతవరకు చేయాలో అంతా ముందే నిర్దేశిస్తారు. అందరూ సరిగ్గా పని చేస్తేనే.. వాళ్ల డబ్బులు వాళ్లకు ముడతాయి. ఆరోజు నా ఛాంబర్లో నేను సీరియస్‌గా పని చేస్తుంటే.. నా పక్కన ఉన్న కిటికీని తడుతూ.. “మేం సాబ్!” అని పిలుస్తున్నారు.కిటికీ తెరిచి చూసేసరికి ఈ అబ్బాయి, వాళ్ల ఫ్రెండ్ కనిపిచారు. రెండో అంతస్తు వరకు వారు అటువైపు తడకలపై నిలబడి ఉన్నారని అర్థమయ్యింది.
“మాఫ్ కర్ నా! బయట కిటికీవైపు పని చేస్తున్నాము. ఒక్క అరగంట దుమ్ము వస్తుంది కాబట్టి ఛాంబర్ వదిలివెళ్లండి.. ప్లీజ్!” అంటున్నారు.
నాకు చాలాపని ఉండటంతో..“ఇలాంటి పనులు ఏవైనా ఉంటే ఆదివారం, శనివారం చేసుకోవాలి కానీ, ఇలా మా వర్క్ డిస్టర్బ్ చేస్తే ఎలా?” అని అడిగాను.“మేం సాబ్! జరా మాఫ్ కర్ నా! ప్లీజ్” అంటూ బతిమాలుతుంటే, నాకర్థం కాలేదు. వేరే వాళ్లు చెప్పారు.. వారికి ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్ ఆపేసాడట. ఈ పని పూర్తయితేనే ఇస్తానని అన్నాడట. దానితో వాళ్లు వారి జీతాన్ని పంపించలేక పోయారట. మరి మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాను. ఒకసారి ఆఫీసుకు సెలవులైనా.. అర్జెంటుగా పంపించాల్సిన స్టేట్మెంట్లు వేయడానికి వచ్చాను. ఈ అబ్బాయి వాళ్లు వర్క్ చేస్తూ కనిపించారు. నా పని అయిపోయేసరికి చీకటి పడింది. అప్పుడు పైఫ్లోర్ నుండి దిగుతుంటే వీరున్న ఫస్ట్ ఫ్లోర్‌లోని వీరి గది దగ్గర..ఈ అబ్బాయి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ‘అతనిలో అంత కళ ఉందా?’ అనిపించింది.
చుట్టూ ఉన్నవాళ్లంతా ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారు. నిజంగా వాళ్లందరిదీ ఒక లోకంలా అనిపించింది. అందరి ముఖాలలో కల్మషం లేని చిరునవ్వు. వారి బట్టలేవీ అంత చక్కగా లేవు. కానీ అందరు కూడా సంతోషంగా ఉన్నారు. తల్లి, తండ్రి, వారి కుటుంబాన్ని మొత్తం వదిలేసి వచ్చి నెలల తరబడి ఒకచోట ఉండటం అంటే మామూలు విషయం కాదు.మన ప్రయాణం రెండు రోజులైనా ఇంట్లోవారిని వదిలిపెట్టి జరిగితే.. మొదలైన దగ్గరినుంచి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు ఇంటికి చెబుతూనే ఉంటాం. అలాంటిది వారు కుటుంబాన్ని వదిలి.. ఏదో గడ్డి గాదం తింటూ, వారి ఇంటి వాళ్ల కోసం శ్రమ పడటం.. నిజంగా ప్రేమంటే, అక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటుంది? అనిపించింది. తెల్లవారి డ్యాన్స్ గురించి అతని ఫ్రెండ్‌ను అడిగితే.. వాడికొక మరదలుందని, త్వరలో పెళ్లి అని, అందుకే ఆ డ్యాన్స్ అని చెప్పాడు. సంతోషం అనిపించింది. ఆ తర్వాత అప్పుడు, ఇప్పుడు కనిపించే హరి కనిపించక వారం రోజులయ్యాయి. హఠాత్తుగా అతను లేకుండా, కేవలం అతని ఫ్రెండ్ మాత్రమే కనిపించడం మొదలు పెట్టాడు.
అతన్ని అడిగాను..“మీ ఫ్రెండ్ ఏడీ?” అని.అతను అటు ఇటు చూసి మౌనంగా వెళ్లిపోయాడు. అలా రెండు, మూడుసార్లు జరిగాక.. అతనికి నా భాష అర్థం కావడం లేదా? అనిపించింది.రెట్టించి అడిగినాకొద్దీ.. అతను భయభయంగా తలవంచుకొని పోవడం చూసి.. నాలో ఆందోళన, కుతూహలం ఇంకా పెరిగాయి.ఒకసారి ఒంటరిగా దొరికినపుడు, చూసి నెమ్మదిగా దగ్గరికి వెళ్లి.. “చెప్పు హరికి ఏమైంది? ఎక్కడికి వెళ్లాడు?” అంటూ అడిగాను.దానికి అతను బాధగా.. “ఇక్కడ పైన పనిచేస్తుండగా.. తడకల మీద నుండి కింద పడ్డాడు. దానితో అతనికి చాలా దెబ్బలు తగిలాయి. అతన్ని వెంటనే వాళ్ల ఊరు పంపించేశారు. మరో మనిషికి తెలియకుండా. పొరపాటున వేరే వారికి తెలిసినా గొడవైపోతుంది. ఒకవేళ ఎవరి ద్వారా తెలిసినా.. మా అందరి ఉద్యోగాలకి నీళ్లు వదిలేసినట్లే! అందుకనే మేమెవరం ఎవరికీ చెప్పం. అతనికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు. పాపం ఎలా ఉంటాడో? అసలే తల్లికి బాగా లేదంటే, చూడడానికి వెళ్లడానికీ చాలా తపనపడ్డాడు. వెళితే ఇక్కడ జీతం కట్ చేస్తామని అన్నారని.. తల్లి మందులకు తక్కువ అవుతుందని వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. కానీ, ఇప్పుడు వాడి తల్లిని చూడటానికి వాడికి ఒంటిమీద స్పృహ అనేది లేదు”.. అని చెబుతూ, ‘నన్ను వదిలిపెట్టు!’ అన్నట్లు చేతులు జోడించి వెళ్లిపోయాడు కళ్లు తుడుచుకుంటూ.
నాకు ఏడుపొచ్చింది. అతన్ని ఇబ్బంది పెట్టదల్చు కోలేదు. తర్వాత అన్ని ఫ్లోర్లు అయిపోయి.. ఇనాగరేషన్ మొదలైంది. మా పై ఆఫీస్ నుండి మా వింగ్ మేనేజింగ్ డైరెక్టర్ నామినల్‌గా ఇనాగరేట్ చేయడానికొచ్చారు. ఆఫీసంతా పూల దండలతో అలంకరించారు. పై అధికారులు వచ్చినప్పుడు అంత త్వరగా పని పూర్తిచేసినందుకు ఆ కాంట్రాక్టర్‌కు, ఇంజినీర్‌కు పూలమాల, శాలువాలు, బొకేలు, సన్మానాలు చేస్తుంటే.. నాకు వారిలో ఆ అబ్బాయి కనిపించి..‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?’ అన్న శ్రీశ్రీ గీతం గుర్తొచ్చింది.ఈ అందమైన బిల్డింగ్ వెనక వారి శ్రమ అడుగడుగునా నాకు కనిపించింది. కానీ, ఆ వెనక ఉన్న శ్రమ ఎవరికీ తెలియదు. నిజానికి వారందరినీ ఒక్కచోట చేర్చి వారందరికీ సన్మానం చేస్తే ఎంత బాగుండేదో? వాళ్ల మొహాల్లో ఆ నవ్వులు, నింగిలోని చంద్రునితో పోటీలు పడుతూ ఎంత తళతళలాడేవో అనిపించింది. కానీ మన చేతిలో ఏమీ లేదు.
ఎందరో అలాంటి కూలీ జీవితాల్లా వారి జీవితం కూడా అలా గడిచి పోవాల్సిందే! ఇది జరిగాక ఆ రోజు ఇక వారందరూ వెళ్లిపోతున్నారని తెలిసింది. నెమ్మదిగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లాను. కింద అందరూ వెళ్లిపోయే హడావుడిలో ఉన్నారు. ఈ అబ్బాయి కూడా అతని బ్యాగు వేసుకుని దూరంలో ఉన్నాడు. దగ్గరగా వెళ్లి.. “నా తరఫున.. అక్క ఇచ్చిందని అనుకో! అతనికివ్వు”అంటూ అతని చేతిలో డబ్బుల కట్టను ఉంచాను. ఆ డబ్బు మీద కన్నీటి చుక్కలు పడ్డాయి. ఆశ్చర్యంగా చూశాను.“నేను వాడి దగ్గరికి ఇప్పుడు వెళ్లలేను అక్కా!” అన్నాడు. “ఎందుకు వెళ్లవు. అయితే, నీ దగ్గరే ఉంచుకో! నువ్వు ఎప్పుడు వెళ్తే.. అప్పుడే ఇవ్వు”.“వాడు పైకెళ్లిపోయాడు! ఇక నేను వాళ్లింటికి వెళ్లలేను. వాడి కళ్లను వాళ్ల అమ్మకు ఇచ్చాడు. ఇంతకాలం అమ్మని చూడాలని తపనపడ్డ వాడు.. ఇప్పుడు అమ్మకే కళ్లయి కళ్లారా చూస్తున్నాడు” అంటూ తల తిప్పుకొని వెళ్లిపోతున్నాడు.అతని గాజుకన్నుల నుండి బొట్లుబొట్లుగా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. వాడి మోము, రూపం నా కళ్లల్లో అలా ముద్రించుకొని పోయింది. ‘వాడికి పెళ్లని ఎంత సంబర పడ్డాడు? ఇప్పుడు ఎవరూ లేని వాడి అమ్మకి, వాడి చెల్లికి దిక్కెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు?’.. ఇవన్నీ తరతరాల నుండి వెంటాడుతున్నా, ఇప్పుడు వచ్చే కాలానికి కూడా సమాధానం లేని ప్రశ్నల కింద మిగిలిపోతాయి.
నాకు వెంటనే.. ‘నేనే ఎందుకు పలకరించాలి?’ అంటూ వదిలిన తమ్ముడు గుర్తొచ్చాడు. ఇప్పటివరకు వాడికి నాపై ప్రేమ ఉందని తెలిసినా, దూరంగా ఉండిపోయాను.. నాన్న చనిపోయినప్పుడు వచ్చిన మాట పట్టింపులతో.ఇంకా ఎంతకాలం ఉందో ఈ జీవితం తెలియదు. లేనిపోని అనవసరపు బాధల్లో కోల్పోకుండా ఇకనైనా అమ్మ, తమ్ముడు ఇష్టపడేలా కలిసి గడపాలి అనుకున్నాను. తమ్ముడికి ఫోన్ చేసాను. ‘ఆనాటి ప్రేమలు ఏమాయేరో.. తల్లి చెల్లి దూరమయ్యేనురో…’ వాడి సెల్ నుండి డయలర్ టోన్ పాట.. నా మనసును మెలిదిప్పి కన్నీరై బుగ్గలను తడుపుతున్నాయి.“అక్కా!” అన్న వాడి పిలుపుతోపాటు, దూరంగా గుడిగంటలు సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా మంగళకరంగా మోగాయి.
ఈ అందమైన బిల్డింగ్ వెనక వారి శ్రమ అడుగడుగునా నాకు కనిపించింది. కానీ, ఆ వెనక ఉన్న శ్రమ ఎవరికీ తెలియదు. నిజానికి వారందరినీ ఒక్కచోట చేర్చి వారందరికీ సన్మానం చేస్తే ఎంత బాగుండేదో? వాళ్ల మొహాల్లో ఆ నవ్వులు, నింగిలోని చంద్రునితో పోటీలు పడుతూ ఎంత తళతళలాడేవో అనిపించింది. కానీ మన చేతిలో ఏమీ లేదు.
నామని సుజనాదేవి
భవననిర్మాణ కూలీల బాధలే.. ‘క(ఖ)ర్మ యోగి’ కథకు ప్రేరణ. రచయిత్రి నామని సుజనాదేవి. కరీంనగర్లో.. భారతీయ జీవితబీమా సంస్థలో లీగల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 250 పైగా కథలు, కవితలు, నాలుగు నవలలు రాశారు. పది పుస్తకాలు వెలువరించారు. వీరి రచనలు అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో, సాహిత్య వెబ్సైట్లలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఇంగ్లిష్, కన్నడలోకి అనువాదమయ్యాయి. సాహిత్య సేవలో భాగంగా.. తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ రచయిత్రి కీర్తి పురస్కారం, స్వాతి అనిల్ అవార్డ్, ఎక్స్‌రే ప్రధాన అవార్డ్ అందుకున్నారు. ప్రధానమంత్రి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిర్వహించిన జిల్లా లోరీ పోటీలో ప్రథమ బహుమతి పొందారు. వీరి రచనలపై కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ‘భవన నిర్మాణ కూలీలు ఎక్కడ కనిపించినా.. శ్రీశ్రీ రాసిన ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? కవితే గుర్తొచ్చి మనస్సు కలుక్కుమనేది. మా ఆఫీస్ ఆధునికీకరణ సందర్భంగా వారినింకా దగ్గర నుంచి పరిశీలించా. శ్రమ వారిదైతే.. వారిని కాంట్రాక్ట్ కూలీలుగా పెట్టుకున్న కంపెనీవాళ్లే అన్నిరకాల సన్మానాలు పొందారు. ఆ నేపథ్యంలో పుట్టుకొచ్చినదే.. క(ఖ)ర్మ యోగి కథ’ అంటూ కథ వెనక కథను చెబుతున్నారు రచయిత్రి.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో తృతీయ బహుమతి
రూ.10 వేలు పొందిన కథ.
-నామని సుజనాదేవి
77993 05575