మనందరివాడు అనిపించుకోవాలి!

వెండితెరపై సౌమ్యమైన, హుందాతనం మూర్తీభవించిన పాత్రలకు పెట్టింది పేరు అప్పాజీ అంబరీష. డిజిటల్, అడ్వైర్టెజింగ్ రంగాల్లో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆయన యాదృచ్ఛికంగా సినిమాల్లోకి ప్రవేశించారు. తెలుగు ఫాంట్స్‌ను అందమైన ఆకృతుల్లో తీర్చిదిద్దే రూపశిల్పిగా గుర్తింపు పొందిన అంబరీష కళారంగంలోనూ తనదైన సంతకాన్ని లిఖించే సంకల్పంతో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ‘బతుకమ్మ’తో అప్పాజీ అంబరీష పంచుకున్న విశేషాలివి.
నాస్వస్థలం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. నటుడిగా అరంగేట్రం చేయకముందు నేను డిజిటల్ మీడియా, అడ్వైర్టెజింగ్ రంగాల్లో 28 ఏండ్లపాటు క్రియేటివ్ హెడ్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాను. యాదృచ్ఛికంగా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించడం ద్వారా కళారంగంలోకి వచ్చాను. తొలుత ‘అప్పారావుగారి అబ్బాయి’ లఘుచిత్రంలో నటించాను. మాటీవీ తొలిసారి నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఆ చిత్రం మూడో బహుమతిని గెలుచుకుంది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో తర్వాత 38 షార్ట్ఫిల్మ్స్లో విభిన్నమైన పాత్రల్ని పోషించాను. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘ఆ నిశిలో’, లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్ట్ చేసిన ‘కృష్ణమూర్తి గారింట్లో’ లఘుచిత్రాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినీరంగంలో అవకాశాలు నన్ను వరించాయి.
ఆరేండ్ల సినీ ప్రయాణంలో...
ఆరేండ్ల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు 78 సినిమాల్లో నటించాను. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘గద్దలకొండ గణేష్', ‘శుభలేఖలు’ ‘ఎన్టీఆర్ బయోపిక్' చిత్రాలు చక్కని గుర్తింపును తీసుకురావడంతో పాటు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా ‘మళ్లీరావా’ చిత్రంలో బాధ్యతారాహిత్యమైన తండ్రి పాత్రలో నటుడిగా నాలోని మరో పార్శాన్ని ఆవిష్కరించే అవకాశం లభించింది. ఈ సినిమాలో నా పాత్రకు మంచి ప్రశంసలొచ్చాయి. ‘గద్దలకొండ గణేష్' చిత్రంలో కథానాయిక పూజాహెగ్డే తండ్రిగా కీలకమైన పాత్ర చేశా. ఈ సినిమాలన్నీ నటుడిగా నాలో పరిణతిని తీసుకొచ్చాయి.
సాఫ్ట్ క్యారెక్టర్సే ఎక్కువ
కథాగమంలో ప్రాధాన్యం ఉంటూ, అభినయానికి ఆస్కారమున్న ఎలాంటి పాత్రలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ప్రతినాయక ఛాయలు, వినోదభరితమైన పాత్రల్లో కూడా మెప్పించగలననే విశ్వాసముంది. నేను ఇండస్ట్రీలోకి ప్రవేశించే సమయానికి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉండేది. అందుకే, నాకు
అవకాశాలు రావడం కాస్త సులువైంది. ప్రస్తుతం చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల సంఖ్య పెరిగింది. ఒకనాడు కథానాయకులుగా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ నటులుగా పునరాగమనం చేస్తున్నారు. అయితే వారిలో చాలా మంది నటనాపరంగా ఒకే ధోరణికి పరిమితమైన వారే. విద్యావంతుడు, హుందాతనం మూర్తీభవించిన సౌమ్యమైన పాత్రలు చేసేవారు తక్కువ మందే ఉన్నారు. ఈ తరహా క్యారెక్టర్స్‌కు నన్ను ఎంపిక చేసుకుంటున్నారు. పైగా ఆ శైలి పాత్రల విషయంలో పోటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, నాకు అవకాశాల పరంగా ఢోకా లేకుండా పోయింది.
విలనీ కూడా..
నేను ఇప్పటివరకు ఎక్కువగా డిగ్నిఫైడ్ జెంటిల్మన్ పాత్రల్లోనే కనిపించాను. అందుకే నా పేరు వినగానే సాఫ్ట్ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. వాస్తవానికి నా రూపం, శారీరక భాషను గమనిస్తే విలనీ షేడ్స్ ఉన్న రఫ్ క్యారెక్టర్స్‌కు కూడా బాగా సూట్ అవుతాను. ఓ సినిమా షూటింగ్లో కరాటే కల్యాణిగారు ‘మీరు ఎన్ని సాఫ్ట్క్యారెక్టర్స్ చేసినా పెద్దగా పేరు రాదు.. ఒక్కసారి నెగెటివ్ క్యారెక్టర్ చేయండి. అందరూ గుర్తు పడతారు’ అంది. ప్రస్తుతం నన్ను విలన్ పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం రూపొందిస్తున్న ఓ సినిమాలో పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నా. దాంతోపాటు ఓ భక్తిప్రధాన పాత్రలో కూడా నటించమని అడిగారు.
ఏ వేదిక అయినా సిద్ధమే
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ చిత్రాలు చేయాలన్న ఆసక్తితో ఉన్నా. నటుడిగా నన్ను నేను విభిన్న కోణాల్లో ఆవిష్కృతం చేసుకోవాలనే సంకల్పంతో కెరీర్‌ను కొనసాగిస్తున్నా. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో నేను నటించిన రెండు వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సినిమాల విషయానికొస్తే.. కేజీఎఫ్-2, వకీల్‌సాబ్, అక్షర, విఠల్వాడి, మ్యాడ్, విశ్వక్,కాదల్, నేడు విడుదల, సుందరి, అభిలాష, నాంది, వైల్డ్‌డాగ్ వంటి చిత్రాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. ‘కేజీఎఫ్-2’లో చిన్న పాత్ర అయినా కథలో కీలకంగా ఉంటుంది. ఇక ‘వకీల్‌సాబ్' చిత్రంలో శృతిహాసన్ తండ్రి పాత్ర చేశాను. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న చాలా సినిమాల్లో నేను పూర్తి నిడివి ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నా.
ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్స్ కోసం..
నేను చిన్నతనం నుంచీ సినిమాల్లో హీరోలకంటే క్యారెక్టర్ ఆర్టిస్టులనే ఎక్కువగా అభిమానించేవాణ్ణి. ఎస్వీ రంగారావు, గుమ్మడి, రావు గోపాల్‌రావు, పి.ఎల్.నారాయణ, ప్రకాష్‌రాజ్ వంటి ఆర్టిస్టుల నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందాను. నా నటన విషయంలో కూడా పాత్రలకు అనుగుణంగా వారిని ఫాలో అవుతుంటాను. ప్రస్తుతం తెలుగు సినిమా కథ హీరో కేంద్రంగానే నడుస్తున్నది. ఒకప్పటిలా సంపూర్ణ కుటుంబ కథా చిత్రాలు రావడం లేదు. గొల్లపూడి మారుతీరావు, విసు వంటి నటులు సినిమా కథను మొత్తం తమ భుజాలమీద వేసుకొని నడిపించిన సందర్భాలు చూశాం. ప్రస్తుతం తెలుగులో అలాంటి కథలు రావడం లేదు. ఆ తరహా పూర్తి నిడివి కలిగిన పాత్రలు చేయాలనుకుంటున్నా.
‘శుభలేఖలు’ అనే సినిమాలో నేను పోషించిన చాదస్తపు పెదనాన్న పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. యూఎస్ నుంచి తెలుగువాళ్లు ఫోన్‌చేసి ‘మా ఇంట్లో మా పెదనాన్నను చూసినట్టుంది’ అని అభినందించారు. నా సినిమాలు చూసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ‘మీ నటనలో సహజత్వం కనిపిస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది’ అంటూ మెచ్చుకునేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’లో నా నటన చూసి ఇండస్ట్రీలోని ప్రముఖులు ప్రశంసించారు. నా సినిమాలు చూసేవారు నన్ను తమ కుటుంబాల్లోని ఒక వ్యక్తిగా.. ‘ఈయన మనవాడు’ అని ఫీలైతే చాలనుకుంటున్నా.
‘నమస్తే తెలంగాణ’కు ఫాంట్స్!
అనేక సంస్థలకు ఫాంట్స్ సమకూర్చాను. ‘సూర్య’, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక టెక్ట్స్ ఫాంట్స్‌కు రూపకల్పన చేయడంతో పాటు ‘సాక్షి’ ఫాంట్స్ మాడిఫికేషన్‌లో పాలుపంచుకున్నా. నేను రూపొందించిన 12 ఫాంట్స్ వరకు ప్రస్తుతం ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో నటనతో పాటు ఫాంట్స్ రూపకర్తగా కూడా కొనసాగుతాను. మరో 20 ఫాంట్స్ తయారుచేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నా.
ప్రింటింగ్ నేపథ్యం నుంచి..
మా నాన్నగారు రాంషా రంగస్థల నటుడు. ఒకప్పటి ప్రముఖ మాస పత్రిక ‘అభిసారిక’కు ఎడిటర్, పబ్లిషర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నా చిన్నతనం నుంచే మా కుటుంబానికి ప్రింటింగ్ ఇండస్ట్రీ ఉంది. స్కూల్ రోజుల్లోనే ప్రింటింగ్ వ్యవహారాలపై మంచి అవగాహన ఉండేది. తరువాతి కాలంలో ప్రచురణకు సంబంధించిన అన్ని విభాగాల్లో నిష్ణాతుడినయ్యాను. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో కేవలం ఇంగ్లీష్ ఫాంట్స్ అందుబాటులో ఉండేవి. మేము ప్రింటింగ్, అడ్వైర్టెజింగ్ రంగంలో ఉన్నాం కాబట్టి, తెలుగులో కూడా ఎందుకు ఫాంట్స్ ఉండకూడదనే కోణంలో ఫాంట్ వర్క్ మీద దృష్టిపెట్టాను. తొలిసారిగా ‘రమణీయ’ పేరుతో ఫాంట్స్‌కు రూపకల్పన చేశాను. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం కోసం ‘అష్ట దిగ్గజాలు’ పేరుతో కొన్ని ఫాంట్స్ తయారుచేశాను.
-కళాధర్ రావు
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా