బుధవారం 27 జనవరి 2021
Sunday - Dec 13, 2020 , 00:08:08

ఆరేండ్లకే అదిరే రికార్డ్‌

ఆరేండ్లకే అదిరే రికార్డ్‌

ఆరేండ్లంటే.. ఆడీపాడే వయసు! కానీ ఆ చిన్నారి ప్రతిభ మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించింది. అంత చిన్న వయసులోనే  కంప్యూటర్‌ కీబోర్డుపై ఆంగ్ల అక్షరాలను ఎ నుంచి జెడ్‌ వరకు, జెడ్‌ నుంచి ఎ వరకు అతి తక్కువ టైమ్‌లో టైప్‌ చేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో చోటు దక్కించుకుంది. ఏడునెలల కాలంలోనే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో 16 అవార్డులు పొంది ‘ఔరా’ అనిపించుకుంటున్నది వినూత్న.  రెండో తరగతిలోనే గిన్నిస్‌ రికార్డు సాధించిన వినూత్నది ఉయ్యూరు. వినూత్న తండ్రి రామ్‌ప్రసాద్‌ వ్యాపారం చేస్తుంటారు. తల్లి నవ్య ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌. తల్లిదండ్రులు కంప్యూటర్‌పై ఆఫీసు పనులు చేసుకుంటుంటే గమనించిన వినూత్న.. తానూ ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కీబోర్డుపై అక్షరాలను గమనిస్తున్న వినూత్నను చూసి తండ్రి టైప్‌ చేయడం నేర్పించాడు. అలా సరదాగా మొదలుపెట్టిన టైపింగ్‌ వినూత్నలోని ప్రతిభను బయటపెట్టింది. మొదట ఎ నుంచి జెడ్‌ వరకు టైప్‌ చేయడం నేర్చుకున్న వినూత్న, ఆ తర్వాత ఫాస్ట్‌గా టైప్‌ చేయడంపై దృష్టిపెట్టింది. రోజూ నాలుగైదు గంటలపాటు సాధనచేసి 26  ఆంగ్ల అక్షరాలను 44 సెకన్లలో టైప్‌ చేసేది. ఆ తర్వాత మరింతగా సాధన చేసి కేవలం 3.50 సెకన్లలోనే టైప్‌ చేస్తున్నది వినూత్న. ఆ వయసులో, అంత వేగం అనితరసాధ్యం!

కండ్లకు గంతలతో..

గంతలు కట్టుకుని కీబోర్డులోని ఆల్ఫాబెట్స్‌ని ఎ నుంచి జెడ్‌ వరకు 3.36 సెకన్లలో, జెడ్‌ నుంచి ఎ వరకు 3.76 సెకన్లలో కంపోజ్‌ చేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి మూడు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి మూడు అవార్డులు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ అవార్డ్స్‌ నుంచి రెండు, రాష్ట్రస్థాయిలో మరిన్ని అవార్డులు సాధించింది వినూత్న. గ్రాండ్‌ మాస్టర్‌ అవార్డుకు ఎంపికైన వినూత్న.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో చోటు దక్కించుకోవడమే ఇప్పుడు తన లక్ష్యం అని చెప్తున్నది. ఆ విజయమూ త్వరలోనే వరిస్తుందేమో!


logo