శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 00:57:14

ఆ ఆపరేషన్‌..ఆమె కాపురాన్ని నిలబెట్టింది!

ఆ ఆపరేషన్‌..ఆమె కాపురాన్ని నిలబెట్టింది!

ఒక చేత వైద్యం.. మరో చేత తెలంగాణ ఉద్యమం 

నడిపిన సవ్యసాచి ఆయన. లాపరోస్కోపిక్‌ సర్జన్‌గానే కాదు.. తెలంగాణ ప్రజా ప్రతినిధిగా పార్లమెంటులో తన వాణి వినిపించిన యోధుడు. ఆయనే భువనగిరి నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యులైన  డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌. గ్రామీణ వైద్యుడిగా ‘రూరల్‌ టూ రోబోటిక్‌' డాక్టర్‌గా పేరొందారాయన. డాక్టర్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని ఆమన్‌గల్‌ ప్రాథమిక వైద్య కేంద్రంలో అడుగుపెట్టిన ఆయన ఏ సదుపాయాలూ, వైద్య పరికరాలూ లేని ఆ చిన్న పీహెచ్‌సీ తనకు శిక్షణ ఇచ్చిన వైద్య విద్యాలయం అని చెప్తారాయన. అక్కడి తన అనుభవాల చిట్టా నుంచి ఓ ఇద్దరు పేషెంట్లు...

80వ దశకం.. బహుశా 1988 కావచ్చు.ఎటువంటి వైద్య సదుపాయాలూ లేని ఆమన్‌గల్‌ ప్రాథమిక వైద్య కేంద్రం.. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పని చేస్తున్న రోజులు. ముందురోజు రాత్రంతా నాకు నిద్ర లేకుండె. ఉదయం నేను వచ్చేసరికే నాకోసం ఒకామె ఎదురుచూస్తూ కూర్చుంది. కల్వకుర్తి నుంచి వచ్చిందని చెప్పారు అక్కడున్న మావాళ్లు. ఆమెకు 30 ఏండ్ల పైనే ఉంటాయేమో. ఆమె ముఖం చూస్తే బాగా ఏడ్చినట్టు కనిపిస్తున్నది. అంత కష్టం ఏమి వచ్చిందా అని భయపడ్డాను. ఆమె చెప్పింది విన్నాక బాధపడ్డాను. మన సమాజంలో ఇంకా బాగుపడని మహిళల దుస్థితికి జాలిపడ్డాను. మొదట ఆమె ‘నేనెలాగైనా తల్లిని కావాలి సారూ..’ అన్నప్పుడు అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్‌ కావాలని ఎందుకనుకుంటోందో అర్థం కాలేదు. కానీ ఆమె కొడుకు చనిపోయాడట. కూతురు ఉంది కదా.. ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ ఆపరేషన్‌ చేయించుకుని గర్భం దాల్చడం అవసరమా.. అని అనిపించింది. 

కానీ ఆమెది తప్పని దుస్థితి. ఒకవైపు కొడుకు పోయిన దుఃఖం. ఆ గాయం మానకముందే మరోవైపు భర్త ఆమె మనసుపై కొట్టిన దెబ్బ. ‘ఉన్న కొడుకు ఎటూ పోయాడు. ఇప్పుడు నాకు మళ్లా కొడుకు కావాలె. నువ్వేం జేస్తవో నాకు తెల్వద్‌. కొడుకును కనకపోతే ఇగ నీతో ఉండను. నిన్నొదిలేసి ఇంకో పెండ్లి జేసుకుంట’ అంటూ బెదిరించే భర్త. కాపురం నిలబెట్టుకోవడానికి మళ్లీ కొడుకు కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితి ఆమెది. ఇంతకు ముందు కొడుకు తర్వాత బిడ్డ పుట్టినాక ఆమె ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంది. ఇప్పుడు రీకానలైజేషన్‌ ఆపరేషన్‌ ద్వారా తిరిగి ఆమె తల్లి అయ్యేట్టుగా ఆపరేషన్‌ చేయాలి. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్‌ చేయించుకుంటే కొడుకును కనొచ్చని ఎవరో చెప్పారట. అందుకే ఎంతో ఆశతో పీహెచ్‌సీకి వచ్చింది. 

కానీ.. ఆపరేషన్‌.. అదీ రీకానలైజేషన్‌ అంటే మాట లా.. అప్పుడు వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందలేదు. కేవలం 30 నుంచి 40 శాతం మాత్ర మే సక్సెస్‌ రేటు ఉండేది. దీనికి చాలా నైపుణ్యం కావాలి. పైగా ఆ చిన్న ఆసుపత్రిలో ఎటువంటి సదుపాయాలూ లేవు. మత్తుమందు ఇచ్చే స్పెషలిస్టు (అనెస్తటిస్టు) లేరు. అవసరమైతే పెట్టడానికి ఆక్సిజన్‌ లేదు. గైనకాలజిస్టు లేరు. మైక్రో పరికరా లూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఓపెన్‌ సర్జ రీ చేశాను. వెన్నుపాముకు మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేశాను. ఆ తరువాత ఆమెకు విజయవంతంగా కొడుకు పుట్టాడు. ఆమె కాపురం నిలబడింది. 

హైదరాబాద్‌లో మత కల్లోలాల సీజన్‌ అది. అచ్చంపేట దగ్గరి హైవే మీద ఒక యువకుడికి యాక్సిడెంట్‌ అయింది. అప్పటికప్పుడు పట్నం పోవాలంటే కుదరని పని. అంతేగాక అల్లర్లతో అట్టుడికిపోతున్న హైదరాబాద్‌కు పోలేని పరిస్థితి. ఈ చిన్న పీహెచ్‌సీలో సదుపాయాలు లేవని తెలిసినా ఏదో ఆశతో వచ్చాడు. డాక్టర్‌ని (నన్ను) చూడగానే అతని కళ్లలో మెరుపు నాకిప్పటికీ గుర్తే. పేషెంటు పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. పేగుల వంటి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. తీవ్రంగా అంతర్గత రక్తస్రావం అవుతున్నది. అదృష్టవశాత్తు ఎముకలు బాగానే ఉన్నాయి. పీహెచ్‌సీలో స్పెషలిస్టులెవరూ లేరు. అనెస్తీషియా ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అవసరమైతే రక్తం ఎక్కించడానికి అనువైన సదుపాయాలు అసలే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే పేషెంటు చనిపోవాలి.. లేకుంటే నాలాంటోడు రిస్కు చేయాలి. ఈ రెండింటిలో నేను రిస్కునే ఎంచుకున్నా. సాధారణంగా ఇలాంటి సాహసోపేతమైన చికిత్సలు యుద్ధ సమయాల్లో చేస్తారు. పాతకాలంలో యుద్ధరంగంలోనే కూడా ఆపరేషన్లు నిర్వహించేవాళ్లు. ఇప్పుడు అతని కళ్లలోని ఆశ నాకు ఎనర్జీనిచ్చింది. అందుకే చకచకా కదనరంగంలోకి దూకాను. అవసరమైన సర్జరీ చేశాను. అదృష్టవశాత్తు నా సాహసం ఫలించింది. అతను బతికాడు. ఎన్ని లక్షలు సంపాదించినా అప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడు కలుగదు. 

నా ఎంఎస్‌ పూర్తయిన తరువాత ఆమన్‌గల్‌ ప్రాథమిక వైద్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నాలుగేండ్లు సేవలందించాను. అక్కడ 24 గంటలు నిరంతరం పనిచేసేవాడిని. అక్కడ అవసరమైన వైద్య పరికరాలు ఏవీ ఉండేవి కావు. పేరుకు 30 పడకల ఆసుపత్రి. కానీ పడకలు ఎక్కడా లేవు. 30 మందినీ కిందనే పడుకోబెట్టేవాళ్లు. అక్కడ ఉన్నప్పుడు చేసిన ఆపరేషన్లే ఇవి. అప్పుడు లయన్స్‌ క్లబ్‌తో కలిసి విరాళాలు సేకరించి అన్నీ సమకూర్చాను. అలా మామూలు పీహెచ్‌సీ మంచి ఆసుపత్రి అయింది. ప్రసవాలు, గైనిక్‌ ఆపరేషన్లు, ట్యూబెక్టమీలు, ఇతర పెద్ద పెద్ద ఆపరేషన్లు ఎన్నో చేశాను. ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేసినవే. అన్ని ఆపరేషన్లకూ లాప్రోస్కోపీని ఉపయోగించడం నాకు నేనుగా నేర్చుకున్నాను. దాంతో లాప్రోస్కోపీ డాక్టర్‌గా పేరు వచ్చింది. కృత్రిమ ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోయినా, అనెస్తీషియా టెక్నీషియన్లు లేకపోయినా ఏ టూ జెడ్‌ నేనే అయి ఆపరేషన్లు చేశాను. అప్పటి నా ఉడుకు రక్తం, ఎనర్జీస్‌, సాహస స్వభావం, దుడుకుతనం, ఏం చేసైనా జబ్బు తగ్గించాలన్న తాపత్రయం... బహుశా.. ఇవే నాకు అప్పుడు బలాన్ని ఇచ్చి ఉంటాయి. 

డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌

మాజీ ఎం.పి., భువనగిరి

సీనియర్‌ జనరల్‌ సర్జన్‌ ,స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo