అనుకున్నప్పుడు లక్ష్యాలు అందుకోవడం చాలా తేలికే అనిపిస్తుంటుంది. కానీ, దిగితే గానీ లోతు తెలియదు. వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్ అయితే ఓకే.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. నష్టాలకు వెరవకుండా సాహసం చేస్తేనే.. విజయం వరిస్తుంది. కోటి రూపాయల ఉద్యోగాన్ని వదులుకొని.. ఏదో సాధించాలనే తపనతో ఆంత్రప్రెన్యూర్‌గా అవతారమెత్తారు వినీతా సింగ్. షుగర్ కాస్మెటిక్స్ సంస్థను ప్రారంభించి వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు.
ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వినీత 2005లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి MBA పట్టా పొందారు. లండన్, న్యూయార్క్‌లోని డ్యుయిష్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. అదే సమయంలో క్యాంపస్ సెలక్షన్స్‌లో కోటి రూపాయల వేతనంతో ఆమెకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే, వ్యాపారంలో రాణించాలనే కోరికతో దాన్ని తిరస్కరించారు. చదువు పూర్తయ్యాక బ్యూటీ సబ్స్క్రిప్షన్ కంపెనీ ప్రారంభించారు. అది సక్సెస్ కాలేదు. అంతమాత్రానికి ఆమె నిరాశ చెందలేదు. 2015లో తన భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి షుగర్ కాస్మెటిక్స్ సంస్థను ప్రారంభించారు.
సీఈవో బాధ్యతలు చేపట్టారు. ‘నేరుగా వినియోగదారుల చెంతకు’ అనే కాన్సెప్ట్‌తో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేశారు. యువత టార్గెట్‌గా సోషల్ మీడియాలో కంపెనీని బాగా ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఏడాదికి రూ.500 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 2,800 మహిళలకు ఉపాధి కల్పిస్తున్న వినీత విజయవంతమైన మహిళగా నిలిచారు. ఒకవైపు వ్యాపారంలో రాణిస్తూనే ప్రముఖ బిజినెస్ రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.