బెంగళూరు మహానగరం. లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. హాజరైన వారిలో ఎనభై మంది మగవాళ్లు, ఇద్దరే మహిళలు. ఆ ఇద్దరిలో ఒకరు ఉమా కాసోజి. మరొకరు ఆమె సహోద్యోగి మహువా ముఖర్జీ. అనుభవం, నైపుణ్యం ఉన్నా.. పదోన్నతులు, కీలక బాధ్యతల విషయానికి వచ్చేసరికి మహిళలు వెనుకబడి పోవడం ఆ ఇద్దరినీ ఆలోచింపజేసింది. ఈ ఆవేదనే ‘ద స్టార్ ఇన్ మీ’ నెలకొల్పేందుకు కారణమైంది. ఆ వేదిక ద్వారా కార్పొరేట్ గురువు హోదాలో మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారు ఉమా కాసోజి. ఆ ప్రస్థానమంతా ఆమె మాటల్లోనే..
నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నాన్న బిల్డర్. అమ్మ గృహిణి. చెల్లి, తమ్ముడు ఉన్నారు. పదో తరగతి వరకు ఆబిడ్స్‌లోని రోసరీ కాన్వెంట్లో చదివాను. ఇంటర్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్‌లో. మెడిసిన్ చేయాలనే ఆసక్తి ఉండేది. అయితే పుణె, మణిపాల్ లాంటి దూర ప్రాంతాల్లో సీటు రావడంతో చేరలేకపోయాను. బీకామ్‌తో సర్దుకుపోయాను. ఆ తర్వాత ఐఐఎం- కాలికట్లో ఎంబీయే సీటు దొరికింది. బ్యాచ్‌మేట్ అయిన రవి అప్పయ్యతో పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక పెండ్లి చేసుకున్నాం.
ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్‌లో చేస్తున్నారు. నేను మొదట్లో జీయీ క్యాపిటల్‌లో చేరాను. తర్వాత ఇన్ఫోసిస్‌కు మారాను. అదే సందర్భంలో బాబు పుట్టాడు. ఇద్దరం ఉద్యోగాలు చేసేవాళ్లం కాబట్టి, బిడ్డ బాగోగులు అమ్మే చూసుకునేది. మంచి అవకాశం రావడంతో అక్కడినుంచి యూబీఎస్ బ్యాంక్‌కు మారాను. అక్కడ ఉన్నప్పుడు తరచూ విదేశాలకు ప్రయాణించాల్సి వచ్చేది.
బెంగళూరులో జరిగిన లీడర్షిప్ కాన్ఫరెన్స్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. అక్కడ నేను, నా సహోద్యోగి మహువా ముఖర్జీ తప్పించి మరో మహిళ కనిపించలేదు. ఆకాశంలో సగమైనా.. కార్పొరేట్ కారిడార్‌లో మాత్రం పావుశాతం కూడా లేమెందుకు? కాలేజీలు, యూనివర్సిటీల నుంచి ఏటా చాలామంది అమ్మాయిలు కార్పొరేట్ ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నంలో మాత్రం వెనుకబడి పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావించాను. మహువా ముఖర్జీ కూడా నా నిర్ణయానికి మద్దతు పలికింది. దీంతో, ఉద్యోగాలను వదులుకుని ‘ద స్టార్ ఇన్ మీ’ ప్రారంభించాం. నేను ఫౌండర్‌గా, మహువా కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నాం.
సమాజంలో స్టార్టప్ కంపెనీల పట్ల చులకన భావం ఎక్కువ. ఆ అనుమానాలు, సందేహాలు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాయి. లక్షణమైన ఉద్యోగాలను మానేసి స్టార్టప్ నడపడమేమిటన్న ప్రశ్న తలెత్తింది. మా ఉద్దేశాన్ని తెలుసుకుని ప్రోత్సహించినవారూ ఉన్నారు. నాన్నతోపాటు మరికొందరు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కానీ, ఎవరి సాయమూ తీసుకోకూడదని, స్టార్టప్‌కు అవసరమైన పెట్టుబడిని మేమే సమకూర్చుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఉద్యోగంలో పొదుపు చేసుకున్న సొమ్ముతో వ్యాపారం ప్రారంభించాం. మా సంస్థ నెట్వర్క్ విస్తరణకు, మార్కెటింగ్‌కు ‘వీ హబ్’ తోడ్పాటు అందించింది. అండగా నిలిచింది.
‘ద స్టార్ ఇన్ మీ’ కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. వివిధ దేశాల మహిళలు మా స్టార్టప్‌లో చేరారు. అమెరికాలోనూ సేవలు ప్రారంభించాం. ఉన్నత ఉద్యోగాల అన్వేషణలో మహిళలకు దిశానిర్దేశం చేసేలా ‘ద స్టార్ ఇన్ మీ.కామ్’ వేదికగా అనేక వీడియోలు అందుబాటులోకి తెచ్చాం. దాదాపు పాతిక కంపెనీలు మా సేవల్ని అందుకుం టున్నాయి. అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులకు మేనేజ్మెంట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాం. పదిహేను దేశాల నుంచి 90 మంది బెస్ట్ లీడర్షిప్ ఎక్స్‌పర్ట్స్‌ను అనుసంధానం చేసుకుని.. వారి ద్వారా క్లయింట్స్ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాం. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి.
రెండేండ్ల క్రితం యుఎస్‌లోని ఒక పెద్ద కంపెనీ నుంచి మా స్టార్టప్‌కు ఫండ్స్ అందాయి. దీంతో ఆర్థిక పరిమితులను అధిగమించాం. గూగుల్ లాంచ్ ప్యాడ్, షి లవ్స్ టెక్నాలజీ ప్రకటించిన టాప్ టెన్ వ్యాపారవేత్తల జాబితాలో ‘ద స్టార్ ఇన్ మీ’ స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి ‘ఉమెన్ అచీవర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 అత్యుత్తమ స్టార్టప్స్‌తో రూపొందించిన కాఫీటేబుల్ పుస్తకంలోనూ మా సంస్థ చోటు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ వేదికపై మా సంస్థ కార్యకలాపాలను ప్రశంసించడం సంతోషాన్ని కలిగించింది. నేను ఎంబీయే చదివిన ఐఐఎం..కాలికట్ గవర్నింగ్ బోర్డులో నేనిప్పుడు సభ్యురాలిని. ‘ది స్టార్ ఇన్ మీ’ ద్వారా టెక్నాలజీ, కార్పొరేట్ రంగాల్లోని మహిళల సాధికారతకు కృషి చేస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది.
…? గంజి ప్రదీప్ కుమార్