కథ చెబుతూ నిద్రపుచ్చాల్సిన నాన్న.. ల్యాపీతో బిజీ! కథలు చెబుతూ బువ్వ తినిపించాల్సిన అమ్మ.. ఆఫీస్ వర్క్‌లో బిజీబిజీ!తాతయ్య, బామ్మ ఊళ్లో! చిన్న కుటుంబాల్లో పెరుగుతున్న చిన్నారులు ఎదుర్కొంటున్న పెద్ద చిక్కు ఇది. కథలు చెప్పే తీరిక లేక స్మార్ట్ ఫోన్ చేతికిస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో చందమామ కథలా సాగిపోవాల్సిన వారి బాల్యం.. రీల్స్‌లో చిక్కుకుపోతున్నది. ఫలితం.. ఉన్నతమైన పౌరులుగా ఎదగాల్సిన చిన్నారులు చిన్న వయసులోనే తీవ్ర ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితికి విరుగుడు కథ చెబుతున్నది ‘కథాతీతం’ గ్రంథాలయం. కాంక్రీట్ వనంలో పల్లెటూరి ఇంటిని తలపించే లోగిలిలో ఈ లైబ్రరీని నెలకొల్పారు శిల్పా కిరణ్వీర్.

పిల్లలకు నీతికథా సుధను పంచుతున్న శిల్పా ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. పండుగ వేళల్లో.. ఆ పర్వం ప్రాముఖ్యాన్ని తెలిపేలా కథ రూపంలో, డ్రామా రూపంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. పిల్లల్లో వచ్చిన మార్పు గురించి తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ ఏడాది ‘రచన’ పేరుతో ఏప్రిల్ 13 నుంచి మే 30 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానంగా కథలు చెప్పడం, వ్యాసరచన పోటీలు, నాటికలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నాం.
నా చిన్నతనంలో నేర్చుకున్న నీతి కథలే నా జీవితానికి ఒక మార్గాన్ని చూపించాయని నమ్ముతాను. నేను పుట్టింది మైసూర్, మెట్టినిల్లు తెలంగాణ. మా నాన్న థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉండేవారు. కుటుంబ విలువలు తెలిపే నాటికలు ప్రదర్శిస్తుండేవారు. నాటికల మీద ఆసక్తితో నేను బాలనటిగా ఎన్నో నాటికల్లో పాల్గొన్నాను. నాటికల ద్వారా ప్రజలకు ఎంతోకొంత నీతి నేర్పించవచ్చని తర్వాతి కాలంలో తెలిసొచ్చింది. వివాహం అయిన తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాను. తల్లిగా నా పిల్లలకు నీతి కథలు చెబుతూ ఉండేదాన్ని. వాళ్లను విద్యారణ్య పాఠశాలలో చేర్పించినప్పుడు ఆ వాతావరణం నన్ను ఎంతగానో ఆకర్షించింది. వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేసి అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరాను. అందుకోసం ప్రత్యేక కోర్స్ కూడా చేశాను.
నిజానికి చిన్నప్పటినుంచి టీచర్ కావాలనే కోరిక కూడా ఉండేది. కానీ, పరిస్థితుల ప్రభావం ఐదేండ్లపాటు సాఫ్ట్వేర్ కొలువు చేయాల్సి వచ్చింది. కానీ, నా పిల్లల వల్ల నాకు నచ్చిన వృత్తిలో చేరడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అక్కడ విద్యార్థులకు కథలు చెప్పడమే నా పని. హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని.
కరోనా సమయంలో స్టోరీ టెల్లింగ్‌తో ఇతర సబ్జెక్టులు కూడా నేర్పించాలని చెప్పారు. దాంతో ఈ సబ్జెక్టులను కూడా కథల రూపంలోనే చెప్పడం మొదలుపెట్టాను. అలా బోధించడం నాకు ఆనందాన్ని ఇచ్చినా పిల్లలు మాత్రం తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సమయం సరిపోయేది కాదు. నాకున్న నలభై నిమిషాల్లో కథ చెప్పి ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుపడేది కాదు. పిల్లలు ఎంతో ఆశతో ‘మేడం! మేం చెబుతాం’ అని చేతులు పైకెత్తి అడిగినా.. వారికి అవకాశం ఇవ్వడం కుదరలేదు.
పిల్లల కోసం చెప్పే కథల్లో.. వాళ్ల భాగస్వామ్యం లేదనే బాధతో 2023లో అక్కణ్నుంచి బయటికి వచ్చేశా. నేను కథలు చెబుతానని చాలా మందికి తెలుసు. ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉంటున్నానని తెలిసి మా చుట్టు పక్కల పిల్లలు ‘కథలు చెప్పండి ఆంటీ!’ అంటూ రావడం మొదలు పెట్టారు. నేనూ పిల్లలకు కథలు చెప్పడానికి సిద్ధమయ్యా! అందరు పిల్లలకు ఒకేసారి కాకుండా, ఒక్కో చిన్నారికీ గంట సమయం కేటాయిస్తూ కథ చెప్పేదాన్ని. తర్వాత వారికి ఏం అర్థమైందో, ఏమైనా సందేహాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకునేదాన్ని.

విద్యారణ్యలో, చుట్టుపక్కల ఉండే పిల్లల్లో కథలు వినడం వల్ల కలిగే మార్పును దగ్గరనుంచి గమనించాను. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌తో పుట్టి పెరుగుతున్న ఈ తరం చిన్నారులకు కథల అవసరం చాలా ఉంది. వారికి మార్గనిర్దేశనం చాలా అవసరం. ఈ మేరకు ఏడు నెలల కిందట గచ్చిబౌలిలో ‘కథాతీతం’ పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేశాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు కథల పుస్తకాలు అందుబాటులో ఉంచాను. ఇక్కడ దాదాపు ఐదువేల పుస్తకాలు ఉన్నాయి.
ఒక్క సోమవారం మినహాయించి వారంలో మిగతా రోజులన్నీ మా కథాతీతం తెరిచే ఉంటుంది. చిన్నారులు తమ తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో కలిసి వచ్చి తమకు నచ్చిన పుస్తకం తీసుకొని చదువుతుంటారు. ఏవైనా సందేహాలు ఉంటే కూడా నన్ను అడిగి నివృత్తి చేసుకుంటారు. ఆ తరువాత నేను వాళ్లకు కథలు చెబుతూ వారి అభిప్రాయాలు అడుగుతుంటాను. కథల పుస్తకాల్లో ఉన్న బొమ్మలు వేసేందుకు కావాల్సిన పేపర్, పెన్సిల్ కూడా సిద్ధం చేసి ఇస్తుంటాం. పజిల్స్ కూడా పెడతాం. పుస్తకాలు చదివించడంతో పాటు ఇతర కెరీర్ గైడెన్స్ క్లాస్‌లు కూడా నిర్వహిస్తున్నాం.

చాలామంది లైబ్రరీ అంటే టేబుళ్లు, కుర్చీలు ఉండే గదిలా ఊహించుకుంటారు. కానీ, కథాతీతం అలా ఉండదు. మనం పుట్టిపెరిగిన పల్లెటూరిలో ఉండే పెంకుటిళ్లు లాగా అందంగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్లో ఉన్నామనే అనుభూతి చెందాలనే ఆలోచనతోనే దీనిని ఇలా తీర్చిదిద్దాం. ఒక్కసారి కథాతీతంలోకి వచ్చిన పిల్లలు పక్కన ఫోనున్నా.. దాన్ని పట్టించుకోకుండా, తమకు నచ్చిన పుస్తకంలో నిమగ్నమై చదువుకుంటూ ఉంటారు. మేం కూడా పిల్లల ముందు ఫోన్ వినియోగించం.
పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు కూడా ఫోన్ వాడొద్దని చెబుతాం. ఈ గ్రంథాలయంలో రెండో తరగతి పిల్లల నుంచి మొదలు పదోతరగతి చదివే విద్యార్థుల వరకు వస్తుంటారు. 40మంది చిన్నారులు రెగ్యులర్‌గా వస్తున్నారు. తమ పిల్లలు నిజాయతీగా జీవించాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. మా కథలతో అలాంటి తరాన్ని తయారు చేయాలన్నదే ఈ కథాతీతం లక్ష్యం. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన మా జర్నీ.. వందల, వేల మంది పిల్లలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దే సంకల్పతో ముందుకుసాగుతున్నాం.
– రాజు పిల్లనగోయిన