సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): జలమండలి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ట్యాంకర్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రజలు ప్రతిరోజు వేలాదిగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగున్నది. ట్యాంకర్ యజమానులు మూడు షిఫ్టులుగా పనిచేస్తున్నా 24 గంటల లోపు ట్యాంకర్లను వినియోగదారులకు చేరవేయలేకపోతున్నారు. ఒక్కో ట్యాంకర్ ఇంటికి చేరుకునేందుకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతున్నది.
కొన్ని చోట్ల ట్యాంకర్ బుక్ చేసుకున్నా అకారణంగా డెలివరీని క్యాన్సిల్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బుకింగ్‌లకు అనుగుణంగా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడమే. జలమండలి ఈ ఏడాది ట్యాంకర్ల సంఖ్య పెంచకపోవడమే వినియోగదారుల పట్ల శాపంగా మారింది. దీంతో బుకింగ్స్‌కు అనుగుణంగా సరైన సంఖ్యలో ట్యాంకర్లు లేకపోవడం వల్ల వేలాదిగా పెండింగులో ఉంటున్నాయి. గత వారం రోజులుగా ట్యాంకర్ల పెండెన్సీ మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా నమోదవుతున్నది. ఎండల తీవ్రత తగ్గుతున్నా పెండింగులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
గతేడాది ట్యాంకర్లతోనే మమా..
జలమండలి ఉన్నతాధికారులు ఈ ఏడాది సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మార్చి నెలాఖరు దాకా కనీసం ముందస్తు ఏర్పాట్లు చేయకుండా కాలయాపన చేశారు. ఏప్రిల్ మొదటి వారం వచ్చినా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. ట్యాంకర్ల డిమాండ్ ఎక్కడా లేదని ఎల్ఈడీ స్క్రీన్లపై అబూత కల్పనను సృష్టించి అంతా సాఫీగానే సాగుతున్నది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేవని జబ్బలు చరుచుకున్నారు. కానీ ఏప్రిల్ రెండో వారం నుంచి నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సమీక్షలు, సమావేశాల పేరిట ప్రజలను మభ్యపెట్టారు.
2025 సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అప్పటిదాకా 750 ఉన్న ట్యాంకర్ల సంఖ్యను 2024 డిసెంబర్ నుంచే పెంచేందుకు ప్రణాళికలు రచించారు. జలమండలి పరిధిలో కొత్త ట్యాంకర్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. 2025 ఫిబ్రవరి నాటికి మరో 200 పైగా ట్యాంకర్లకు అనుమతించి, హైర్ చేసుకున్నారు. దీంతో మొత్తం 100 పైగా ట్యాంకర్లు జలమండలి అనుమతి పొంది సేవలందించాయి. దీంతో 2025 ఎండాకాలం ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగింది. ఈ ఏడాది మాత్రం కొత్త ట్యాంకర్లకు అనుమతులు ఇవ్వకపోవడంతో పెండెన్సీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నది.