కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 7 :అర్ధరాత్రి వేళ… మ్యూజిక్ హోరు.. యువతీ యువకుల కేరింతలు.. పీక్‌లో ఉన్న మస్తి.. అంతలోనే ఒక్కసారిగా సైరన్లు మోగాయి. నిబంధనలు తుంగలో తొక్కి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పబ్ భాగోతానికి పోలీసులు చెక్ పెట్టారు. కేబీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంజీరా మాల్లో ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని పోలీసులు మెరుపు దాడి చేశారు. ప్రాథమిక విచారణలో ఈ పబ్ నిర్వాహకులు కేవలం మద్యం వ్యాపారమే కాకుండా తెరవెనుక అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. పబ్ వేదికగా విటులను ఆకర్షించడం, వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, కస్టమర్లకు అమ్మాయిలను సరఫరా చేయడం వంటి అనైతిక కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న అక్రమాలను గుర్తించి, పబ్ మేనేజర్‌తో పాటు నలుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్‌సిటీ రోడ్డులోని మంజీరామాల్లో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ కొనసాగుతుండగా.. పోలీసులు జరిపిన మెరుపు దాడిలో తెరవెనుక అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. పబ్‌కు వచ్చే మగ కస్టమర్లను ఆకర్షించేందుకు, వారిని ప్రలోభ పెట్టేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా యువతులను మోహరించారు. మద్యం సరఫరా చేసే ప్రాంతాల్లో మైనర్ల ఎంట్రీపై ఎలాంటి ఆంక్షలు లేవు. కనీస తనిఖీలు లేకుండానే మైనర్లను లోపలికి అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు.. కనీసం స్థానిక పోలీస్ ఎన్వోసీ లేకుండానే ఈ పబ్ నడుస్తున్నది.
ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి మించి అర్ధరాత్రి వేళల్లో కూడా మద్యం, ఫుడ్ సరఫరా చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధానంగా కొంతమంతి యువతులతో అన్లైన్ చాటింగ్ చేయించి యువకులను పబ్‌కు రప్పిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచారానికి విటులను ఆకర్షించేలా అనుకులమైన వాతావరణం కల్పించడం, పబ్‌లో ఆర్డర్ చేసే సాదాసీదా ఆహారం, పానీయాలకు రూ.వేల బిల్లులు వేసి మోసగిస్తున్నట్లు విచారణలో తేల్చారు. అబ్బాయిల పక్కన అమ్మాయిలు కూర్చొని మందు తాగించడం, వారంతా కలిసి మద్యం మత్తులో ఆటపాటలతో చిందులేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ పబ్‌కు వివాదాలు, అక్రమాలు కొత్తేమీ కాదు.. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ నిర్వాహకులు గతంలో కూడా ఇదే తరహాలో గలీజ్ దందా నడిపారు. పోలీసుల కళ్ల్లుగప్పి మళ్లీ దందా కొనసాగిస్తుంచడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పబ్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. తాజా రైడ్‌లో పబ్ యాజమాన్యంపై కేపీహెచ్‌బీ పోలీసులు 716/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 223, 292, 318(4)తో పాటు పీఐటీ యాక్ట్ సెక్షన్ 5, 8 కింద కేసులు నమోదు చేశారు.
పబ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘిస్తే కఠిన చర్యలుంటాయని డీసీపీ హెచ్చరించారు. ఐతే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న డీసీపీ కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్తోపాటు పోలీసులను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సమీర్, కేపీహెచ్‌బీ కాలనీ డీఐ కేవీ.రవి తదితరులు ఉన్నారు.