రోడ్డుమీద ఏ ప్రమాదమో జరిగి, తోటి మనుషులకు రక్తమోడుతున్నా తమదారిన తాము వెళ్లే రోజులివి. ఇక, జంతువులకు దిక్కెవరు? మహ్మద్ సుమ మాత్రం.. ఎక్కడ ఏ మూగ జీవికి ఇబ్బంది కలిగినా వెంటనే బయల్దేరి వచ్చేస్తారు. ఎక్కడ ఏ వన్యప్రాణిని అంగడి సరుకులా విక్రయిస్తున్నారని సమాచారం అందినా.. క్షణాల్లో వాలిపోతారు. నోరులేని జీవాలకు బాసటగా నిలుస్తారు. అధికారుల సహకారంతో అక్రమారుల ఆట కట్టిస్తారు.
మహబూబాబాద్‌లోని జగన్ కాలనీ సుమ చిరునామా. కన్నవారు మహ్మద్ సుభాని, సలీమ. ఇద్దరూ సమాజ సేవకులే. ‘సృష్టిలోని ప్రతి ప్రాణికి మనిషితో సమానంగా జీవించే హకు ఉందని, వాటి స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిదని నా తల్లిదండ్రులు తరచూ చెప్పేవారు. ఆ మాటలే నన్ను ఇటువైపు నడిపించాయి’ అంటారామె. దిక్కులేని పిల్లికూనలు, గాలిపటం మాంజా తగిలి రెకలు విరిగిన రామ చిలుకలు, కుకల బారినపడిన గుడ్ల గూబలు, విద్యుదాఘాతానికి గురైన పావురాలు, రోడ్డు ప్రమాదంలో నడుము విరిగిన ఆవులు.. ఇలా ప్రమాదంలో ఉన్న ప్రతి జీవీ ఆమెకు ఆత్మబంధువే. పశు వైద్యుల సాయంతో చికిత్స అందించడంతో పాటు అవి పూర్తిగా కోలుకునే వరకూ ఆశ్రయం ఇస్తారు.
వన్యప్రాణుల విక్రయాలను నిలువరించి అక్రమారులను అటవీశాఖ అధికారులకు అప్పజెప్పిన సందర్భాలూ అనేకం. విదేశీ వలస పక్షులను, జల్మా జాతి పక్షులను, నక్షత్ర తాబేళ్లను కాపాడి వరంగల్ నగరంలోని వన విజ్ఞాన కేంద్రానికి తరలించిన ఘటనలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంచార పశు వైద్యశాల(1962) గురించీ విసృ్తతంగా ప్రచారం చేస్తారు సుమ. ఆ చొరవలో భాగంగా మండల పరిధిలోని 21 గ్రామాలలో పాదయాత్ర చేపట్టారు. సుమ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు ఘనంగా సన్మానించింది.