అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం విజయాన్ని అందిస్తుంది. గెలుపు ఆర్థిక ప్రగతికి సోపానం అవుతుంది. కాబట్టే, సౌందర్య వ్యాపారం మునుపెన్నడూ లేనంతగా కళకళలాడుతున్నది. ఆంత్రప్రెన్యూర్స్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. శుచీ చటోపాధ్యాయ అందులో ఒకరు. ‘మేకప్ అండ్ హెయిర్ బై శుచీ’ ఆమె కలల స్టార్టప్. ఆ మిరుమిట్లు గొలిపే ప్రయాణం ఆమె మాటల్లోనే..
వైవిధ్యమైన వాతావరణానికి, విభిన్నమైన సంప్రదాయాలకు హైదరాబాద్ వేదిక. ఈ వారసత్వ నగరంలో అందానికి, అలంకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దీనికితోడు శరవేగంతో విస్తరిస్తున్న కార్పొరేట్ కల్చర్ బ్యూటీప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్నది. రానున్న రెండేండ్లలో బ్యూటీ కేర్ స్టూడియోలు రెట్టింపు కావడం ఖాయమని నిపుణుల అంచనా. వందల మందికి ఉపాధినిచ్చే స్థాయికి సౌందర్య పరిశ్రమ ఎదుగుతున్నది.
అందానికి నగిషీ అద్దుకునేందుకు సంపన్న వర్గాలతో సమానంగా సాధారణ మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. చిన్నప్పటి నుంచీ తోబుట్టువుల ఫ్యాషన్ వస్ర్తాలు, ముఖాలంకరణలు చూస్తూ పెరిగాన్నేను. అదే బ్యూటీ కేర్ పట్ల ఆసక్తిని పెంచింది. వైజాగ్‌లో పుట్టినా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. పదకొండేండ్ల పాటు ఆతిథ్య రంగంలో కొనసాగాను. తర్వాత ఫ్రీ లాన్స్ మేకప్ ఆర్టిస్టుగా ‘మేకప్ అండ్ హెయిర్ బై శుచీ’ని స్థాపించాను..
చాలామంది సహజత్వంతో కళకళలాడే ముఖారవిందాన్ని కోరుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్ వాతావరణం చాలా భిన్నమైంది. ఓ వైపు ముచ్చెమటలు పట్టించే ఎండలు, మరోవైపు విపరీతమైన చలి. కాలంకాని కాలంలో వర్షాలు. ఇవన్నీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపేవే. కాబట్టే ‘హైదరాబాద్ వాతావరణానికి అనువైన మేకప్ కావాలి మేడమ్’ అని అడుగుతారు చాలామంది. అందులోనూ కాలేజీ అమ్మాయిలు సరికొత్త మేకప్ ట్రెండ్స్ కోరుకుంటారు.
సాధారణ టచప్‌తో పాటు సన్‌స్క్రీన్ లోషన్, బాడీ, లిప్ కేర్, హెయిర్ కేర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. నా అభిప్రాయం ప్రకారం.. సరికొత్త ట్రెండ్స్ కోసం అర్రులు చాచడం ఆపేసి.. మన చర్మ లక్షణాల్ని బట్టి మేకప్ చేసుకోవడం ఉత్తమం. ఎవరికైనా మేకప్ చేసే ముందు ఆ వ్యక్తి శరీరతత్వం, చర్మ సౌందర్యం, అప్పటికే వాడుతున్న ఉత్పత్తులు, ఆరోగ్య సమస్యలు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఆ తర్వాతే మేకప్ మొదలుపెడతాను. ఏ బ్యుటీషియన్ అయినా అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రం ఇది.
తొలిదశలో కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితులకు మాత్రమే మేకప్ చేసేదాన్ని. సోషల్ మీడియా అకౌంట్ ప్రారంభించిన తర్వాత వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. కొత్తకొత్త క్లయింట్స్ పరిచయం అయ్యారు. మేకప్ అండ్ హెయిర్ బై శుచీ @makeupandhairbyshuchi ఇన్‌స్టా పేజ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాను. ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఇది సరైన వేదిక కూడా. క్లయింట్స్‌కు అందించిన సేవలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యాపారంపై దృష్టి సారించాను.
మేకప్ ఆర్టిస్ట్ట్గానే కాకుండా కార్పొరేట్ సంస్థలకు మేకప్ అడ్వైజర్‌గా, బ్యూటీ ట్రైనర్‌గా ఉపాధి పొందుతున్నాను. నాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. ఇన్‌స్టా పేజీ ద్వారా వచ్చేవారి సంఖ్య కూడా చాలానే ఉంటుంది. రానున్న రోజుల్లో ఓ మేకప్ స్టూడియో ప్రారంభించే యోచన ఉంది. వ్యాపార విస్తరణపైనా దృష్టి పెట్టాను. ‘శుచీ మేడ్ మై డే స్పెషల్. షి ఈజ్ వెల్ స్పోకెన్. యూజ్డ్ బెస్ట్ ప్రాజెక్ట్స్.. టు మేక్ మి లుక్ గార్జియస్ ఆన్ మై స్పెషల్ డే’ అంటూ ఓ క్లయింట్ నాకిచ్చిన కితాబు నూటికి నూరుపాళ్లు నిజం. కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు. నేను మాత్రం కస్టమర్ ఈజ్ ఏంజెల్ అంటాను. తనను మనవైన సేవలతో మురిపించాలి.
హైదరాబాద్ బ్యూటీప్రెన్యూర్స్కు ఎంతో అనుకూలమైంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కావడంతో నిత్యం ఏదో ఓ వేడుక జరుగుతూనే ఉంటుంది. దీంతో బ్యూటీప్రెన్యూర్స్కు డిమాండ్ పెరుగుతున్నది. కాకపోతే, ఈ రంగంలో నిలబడాలంటే కచ్చితంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. పర్సనల్ బ్యూటీ కేర్‌లో శిక్షణ పొందేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేట్, హాస్పిటాలిటీ సంస్థల ప్రవేశంతో మేకప్ ఆర్టిస్టులకు డిమాండ్ అధికమైంది.సౌందర్య శిల్పులకు ఇది స్వర్ణ యుగం.
ఏ వ్యాపారంలో అయినా నిజాయతీ ముఖ్యం. కస్టమర్ మనసును అర్థం చేసుకోవాలి. ఎదుటి మనిషి అంతరంగాన్ని చదవగలగాలి. విమర్శల్ని స్వీకరించే గుణం ఉండాలి. సామాజిక మాధ్యమాల్ని సద్వినియోగం చేసుకోవాలి. స్తోమతకు మించిన ఆర్భాటాలు మంచివి కాదు. అతి తక్కువ కాలంలో అనూహ్యంగా ఎదిగిపోవాలని అనుకోవడమూ సరికాదు. విస్తరణ విషయంలోనూ అచితూచి అడుగు వేయాలి. అదే సమయంలో పోటీ సంస్థలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వ్యాపార వ్యూహాలకు పదునుపెట్టుకుంటూ ముందుకెళ్లాలి.
…? కడార్ల కిరణ్