జీవితంలో కోరుకున్నది దొరక్కపోతే నిరాశలో కూరుకుపోతారు చాలామంది. ఆ సమయాల్లో పట్టుదలగా నిలబడిన వాళ్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కర్ణాటకకు చెందిన రితుపర్ణ రెండో కోవకు చెందుతుంది. మెడికల్ సీటు మిస్సయిన ఈ అమ్మాయి ఇప్పుడు 72 లక్షల జీతంతో పెద్ద కొలువు చేజిక్కించుకుంది. అదీ గొప్ప కంపెనీ రోల్స్ రాయిస్‌లో..
కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకా యమరవల్లి అనే పల్లెటూరిలో పుట్టి పెరిగింది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు మంగళూరులో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి రితుపర్ణకు చదువంటే ఇష్టం. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే మెడికల్ సీటు సాధించలేకపోయింది. నిరాశ చెందకుండా మరోదారి వెతుక్కుంది. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో ఇంజినీరింగ్‌లో చేరింది. అయిష్టంగానే ఇంజినీరింగ్‌లో చేరినా.. కష్టపడి చదివింది.
ఇంజినీరింగ్ మొదటి ఏడాదిలో ఉండగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకం గెలుచుకుంది. మూడో ఏడాదిలో ఉండగానే రోల్స్ రాయిస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసింది. ఆ ప్రయత్నంతో ఆమె జీవితం మారిపోయింది.
వాహనాలకు సంబంధించిన సాంకేతిక సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర చూపింది రితు. ఎనిమిది నెలల్లో ఆమె చూపిన పరిష్కారాలు కంపెనీ అధికారులకు అబ్బురపరిచాయి. ఇంతటి టాలెంట్ మిస్సవ్వద్దని.. చదువు పూర్తయిన వెంటనే తమ దగ్గర ఉద్యోగంలో చేరాలని కోరారు. ఏడాదికి రూ.72 లక్షలు ఆఫర్ కూడా చేశారు. రోల్స్ రాయిస్‌లో జాబ్ ఆఫర్ కొట్టిన మొట్టమొదటి కర్ణాటక అమ్మాయిగా రితుపర్ణ చరిత్ర సృష్టించింది. తల్లిదండ్రుల సంతోషానికైతే అవధుల్లేవు. ప్రయత్నాలు విఫలమైనంత మాత్రాన ప్రయాణం ఆపొద్దనీ, కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుందనీ రితుపర్ణ కథ చెబుతున్నది!