సాగర మథనం జరిగినప్పుడు.. ముందు విషమే పుట్టింది. ఈమె వ్యాపారం మొదలుపెట్టినప్పుడూ.. ముందుగా నష్టమే పలకరించింది. రూ.10వేలతో ప్రారంభించిన ప్రయాణంలో.. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఒక్క దారి తప్పితే.. మరో దారిని ఎంచుకున్నది. ఎదురైన రాళ్లనూ – ముళ్లనూ దాటుకుంటూ.. ధైర్యంగా ముందుకు సాగింది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని రూ.4,100 కోట్ల సామ్రాజ్యంగా మలిచింది. ఒంటి చేత్తోనే వేలకోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆ మహిళా వ్యాపారవేత్తే.. శశి సోని! ఇదీ.. ఆమె సక్సెస్ స్టోరి!
ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్త శశీ సోని జీవితం.. అసాధారణం. సామాన్యురాలిగా మొదలై, అసామాన్యురాలిగా ఎదిగిన ఆమె విజయగాథ.. ఎంతోమందికి మార్గదర్శకం. పాకిస్థాన్‌లోని లాహోర్ పట్టణంలో.. 1941, ఏప్రిల్ 4న జన్మించారు శశీ సోని. దేశ విభజన తర్వాత వారి కుటుంబం దిల్లీ నగరంలో స్థిరపడింది. అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు శశి. అయితే, తోటివాళ్లలా పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడాలని అనుకోలేదామె. వ్యాపారవేత్తగా ఎదగాలనీ, తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. కేవలం రూ.10 వేల పెట్టుబడితో.. తన వ్యాపారానికి పునాది వేశారు. ప్రస్తుతం రూ.4,100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అయితే, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. మొదట్లో నష్టాలు పలకరించినా వెనకడుగు వేయలేదు. ఎక్కడెక్కడ లాభాలు వస్తున్నాయో నిశితంగా గమనించారు. ఆయా చోట్ల పెట్టుబడులు పెట్టి విజయం సాధించారు.
1971లో తొలిసారిగా రూ.10వేల పెట్టుబడితో ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు శశి సోని. ‘దీప్ ట్రాన్స్పోర్ట్’ నష్టాలవైపు నడవడంతో.. నాలుగేళ్ల తర్వాత సినిమా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. 1975లో ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో ఏసీ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ రంగం కూడా కలిసి రాకపోవడంతో మరోదారిని ఎంచుకున్నారు. 1980లో మైసూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’.. శశి వ్యాపారానికి కొత్త ఊపిరిలూదింది. గ్యాస్ ఉత్పత్తి ప్రాజెక్ట్‌తో ఆమె దశ మారింది. వ్యాపారం.. లాభాల దిశకు మల్లింది.
ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన లాభాలతో శశి ఇక వెనుతిరిగి చూడలేదు. అదే ఉత్సాహంతో సాంకేతిక రంగంలోకీ అడుగుపెట్టారు. 2005లో ‘ఇజ్మో లిమిటెడ్’ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ.. అమెరికా, ఆసియా, యూరప్ ఖండాలకూ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా హైటెక్ ఆటోమోటివ్, ఇ రిటైలింగ్ సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం శశి సోని.. ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వ్యాపారంతోపాటు సామాజిక సంక్షేమ రంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శశి సోని. ‘దీప్ జనసేవా సమితి’ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. మహిళలకు ఉపాధి, విద్య, పింఛన్ అందిచడంలో ముందుంటున్నారు. దివ్యాంగుల కోసం నిధులు సేకరిస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా.. 2024లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ అందుకున్నారు. భారతీయ పరిశ్రమకు చేసిన కృషికి.. 1990లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు.
– పాసికంటి శంకర్, భీవండి