వంట అంటే ఈ తరానికి పెద్ద తంట. వర్కింగ్ ఉమెన్స్కైతే మోయలేని భారం. పిల్లలను స్కూల్‌కు సిద్ధం చేస్తూ, వారి బొజ్జ నింపే ఉపాయాల కోసం ఈ తరం తల్లులు పడే తండ్లాట అంతా ఇంతా కాదు. అలాంటి ఇబ్బందుల నుంచి వచ్చిందే గ్రేవీస్టోరీస్ ఆలోచన. ఎలాంటి కూరల్లో అయినా వాడుకునేలా ఉండే గ్రేవీలను అందించడంతో మొదలుపెట్టి… ఆరు నెలల వరకు నిల్వ ఉండే రెడీ మిక్స్ వంటకాలను అందించే స్థాయికి తన వ్యాపారాన్ని తీసుకెళ్లారు ‘గ్రేవీస్టోరీస్’ స్టార్టప్ నిర్వాహకురాలు శైలజ. విదేశాల్లో నివాసం ఉండేవారికి ఇంటి రుచులను గుర్తుచేసేలా తన వ్యాపారం సాగిస్తున్నారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంటి వంటలను అందిస్తున్న శైలజ ఈ వారం మన స్టార్టప్ స్టార్..
ఐటీ రంగంలో స్థిరపడిన శైలజకు వర్కింగ్ ఉమెన్స్ కష్టాలు బాగా పరిచయం. ముఖ్యంగా పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు సిద్ధం చేసి, టిఫిన్ బాక్సుల కోసం తల్లులు పడే ఇబ్బందులను ఎన్నో ఏళ్లు అనుభవించింది. అయితే ఇన్స్టాంట్ ఫుడ్ మార్కెట్లో దొరుకుతున్నా… శరీరానికి సరిపడవు. పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు రసాయనాలు వాడతారు. ఎంత ఖర్చు పెట్టినా.. ఇంటి వంటంత రుచిగా కుదురుతాయన్న నమ్మకమూ లేదు. అందుకే, వాటి జోలికి వెళ్లలేదని చెబుతారు శైలజ. కానీ, తాను పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చిన ఒక చిన్న అవకాశం ఆమె జీవితాన్ని మార్చేసింది. అది తనలాంటి మహిళలకు ఉపాధినిచ్చే వేదిక అవుతుందని, ఆ వ్యాపారానికి తానే వ్యవస్థాపకురాలు అవుతారని అప్పుడు ఆమె ఊహించలేదు.
అకాల వర్షాలతో నేలరాలిన మామిడి కాయలతో శైలజ వ్యాపారానికి అడుగుపడింది. సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మ్‌లో నేలరాలిన వందలాది కిలోల మామిడి కాయలను వినియోగంలోకి తీసుకువచ్చి, వాటి విలువ ఎలా పెంచితే నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరుతుందనే అంశంపై హార్టికల్చర్, ఫుడ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఓ సదస్సులో శైలజకు పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ సదస్సులో నేలరాలిన పండ్లు, కూరగాయలను సద్వినియోగం చేసుకునే అవకాశాలు, శాస్త్రీయ విధానంలో పంట నిర్వహణ, అంశాలపై నిపుణులు అందించిన సూచనలే గ్రేవీ స్టోరీస్‌కి బీజం వేశాయంటారు శైలజ. అలా రైతుల నుంచి టమాటాలను సేకరించి, వాటిని సరైన విధానంలో వండితే నోరూరించే రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలు సాధ్యమేనని గ్రహించి గ్రేవీస్టోరీస్ స్థాపనకు కసరత్తు మొదలుపెట్టారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఫుడ్ టెక్నాలజీలో ప్రయోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకున్నారు. అనేక పరిశోధనలు చేసి ఆహారంపై ప్రయోగాలు చేపట్టి విజయం సాధించారు.
కాలం ఏదైనా టమాటాకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శాకాహారం, మాంసాహారం ఏది వండినా నాలుగు టమాటా ముక్కలు పడితేనే అదనపు రుచి. ముఖ్యంగా ఒకసారి అతి చౌకగా దొరికి, కొన్ని సందర్భాల్లో కొనలేని స్థాయికి చేరే టమాటాలతో అన్ని వంటకాలకు అనువుగా ఉండే గ్రేవీ (పులుసు) తయారీలో ప్రయోగాలు చేశారు శైలజ. తాను చేసిన టమాటా గ్రేవీ ఇంట్లో వాళ్లతోపాటు, ఇరుగుపొరుగు, స్నేహితులు, బంధువుల నాలుకలకు జీవం పోయడంతో రంగంలోకి దిగారు. టమాటా, ఉల్లిగడ్డ, ఇతర మసాలా దినుసులను కలిపి టమాటా గ్రేవీ ప్రీమిక్స్ తయారుచేశారు. దీనితో ఏకంగా 50 రకాల వంటకాలు వండుకోవచ్చు. కూరలు, చట్నీలు చేసుకోవచ్చు. అరగంట సమయం పట్టే పనీర్ మసాలా కర్రీ కూడా ఈ గ్రేవీతో పది నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఆమె ప్రయోగం కేవలం టమాటాతో ఆగిపోకుండా, వైట్ గ్రేవీ ప్రీమిక్స్, గ్రీన్ గ్రేవీ ప్రీమిక్స్, ఎల్లో గ్రేవీ ప్రీమిక్స్ ఇలా రకరకాల రుచికరమైన పులుసుల వరకు సాగింది.
రుచికి సరిపోయేలా, లోకల్ ఫ్లేవర్ ఏమాత్రం కోల్పోకుండా, ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉండేలా రెడీ టూ కుక్ పదార్థాలను ఆవిష్కరించారు శైలజ. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండానే వీటిని ఉత్పత్తి చేశారు. వంటింట్లో ఆమె చేసిన ప్రయోగాలతో గంటల తరబడి కుస్తీ పడితేగానీ నోటికి అందని పలావ్, బిర్యానీ, పులిహోర లాంటి పదార్థాలు కూడా సునాయాసంగా చేసుకునే వీలు ఏర్పడింది. పలావ్, బిర్యానీ, ఉప్మా, ఇడ్లీ, పులిహోర, కిచిడీ, పొంగల్, సాంబార్ పొడి, రసం పొడి ఇలా అన్నిరకాల రెడీ మిక్స్ గ్రేవీలను తయారుచేశారు. ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలతో మిల్లెట్ పొంగల్, మిల్లెట్ పాయసం, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ దోస తదితర వంటకాలను సులభంగా చేసుకుని ఆరగించేలా ఉత్పత్తులు తీసుకొచ్చి సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టార్ అనిపించుకున్నారు.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా, అన్ని అనుమతులతో, ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ లేకుండా సహజసిద్ధంగా దొరికే సామగ్రిని వినియోగించి శైలజ తయారుచేసిన ఉత్పత్తులకు విదేశాల్లోనూ ఆదరణ ఉంది. ఇన్‌స్టాలో @gravy_stories హ్యాండిల్‌తో, వాట్సాప్‌లో 8885422645 ఫోన్నంబర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గ్రేవీస్టోరీస్’ ఉత్పత్తులకు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆన్లైన్ వేదికగా ఆర్డర్లు పెడుతున్నారు. వైవిధ్యంగా, రుచికరమైన వంటకాలను అందించే వేదికగా గ్రేవీస్టోరీస్ను తీర్చుదిద్దుతానని అంటున్నారామె. ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్యాపార విస్తరణతోపాటు పదిమందికి ఉపాధి కల్పిస్తానని పేర్కొంటున్న శైలజకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో చేతికి రాకుండా పోయిన కూరగాయలను సద్వినియోగం చేసుకోవచ్చంటారు శైలజా. ఆమె ఆలోచనను గుర్తించిన కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ ‘ఉమెన్ చేంజ్‌మేకర్ అవార్డ్- దుర్గాప్రెన్యూర్’గా శైలజను సత్కరించింది. అంతేకాదు నీతీ ఆయోగ్ నిర్వహించిన మహిళ పారిశ్రామికవేత్తల వేదికపై ప్రసంగించే అవకాశం దక్కించుకున్నారు. అమెరికా కాన్సులేట్ నుంచి గ్రీన్ అకాడమీ సర్టిఫికెట్, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి డ్రీమ్ బిల్డర్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఏడాదిపాటు పాడవకుండా ఉండే మిల్లెట్ నాన్ రెసిపీ కోసం పేటెంట్ హక్కులను పొందే స్థాయికి శైలజ ఎదిగారు. వీహబ్‌తో 2023లో మొదలైన ప్రయాణం తనను మంచి ఆంత్రప్రెన్యూర్‌గా మలిచిందని చెబుతారు శైలజ.