ఆమె రోటి పచ్చడి నూరుతుంటే.. ఇంటిల్లిపాదీ నోరూరాల్సిందే. వంకాయ బడితం చేస్తే.. వాడకట్టంతా ఇంటి ముందు వాలిపోతుంది. పులిహోర కలుపుతున్నదని తెలిస్తే.. ఉపవాస దీక్ష మధ్యాహ్నానికే ముగుస్తుంది. ఆ పెద్దావిడ అమృత హస్తం గురించి చుట్టాలు, పక్కాలకే కాదు ఊరంతా తెలుసు! ఏడాది క్రితం నుంచి ఆమె తిరగమోత పెట్టినా ఇన్స్టాలో లైకుల మోత మోగుతున్నది. 89 ఏండ్ల పెద్దావిడ రోజుకో వెరైటీతో ఈ తరాన్ని పలకరిస్తున్నది. ‘ద అయ్యర్ పాతి’ (@theiyerpaati) పేరుతో పాకయాగం చేస్తూ ఇన్స్టా అన్నపూర్ణగా పేరొందిన సరస్వతి నారాయణస్వామి ఇప్పుడు ఓ సెలెబ్రిటీ. ఏడాదిలోనే 84 వేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకొని.. సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్న బామ్మ జర్నీ ఇది..
అవే కూరగాయలు.. అదే వంట పద్ధతి. కానీ, కొందరు ఆడంబరంగా వంట చేసినా ముద్ద నోటికి దిగదు. మరికొందరు పైపైన వంట కానిచ్చినా.. ‘అద్భుతః’ అన్నట్టుగా ఉంటుంది పదార్థం. సరస్వతి బామ్మ రెండో రకం. వంటింటి రాజ్యాన్ని ఆమె 78 ఏండ్లుగా పరిపాలిస్తున్నది మరి. పదకొండేండ్ల వయసులో గరిటె తిప్పడం అలవాటు చేసుకున్న ఆమె.. సంప్రదాయ రుచులను చేయడంలో సిద్ధహస్తురాలు. సరస్వతి తల్లిదండ్రులకు పదకొండు మంది సంతానం. ఆరో కాన్పులో ఈమె జన్మించింది. ఆమెకు పదేండ్లు ఉండగా తల్లి కన్నుమూసింది. అప్పట్లో వీళ్ల కుటుంబం కాలికట్లో ఉంటుండేది. ఇల్లాలు లేని ఇల్లు. పైగా పెద్ద కుటుంబం. సరస్వతి మేనత్త వారింట్లోనే ఉండేది. వంట బాధ్యత నిర్వర్తిస్తున్న మేనత్తకు చేదోడువాదోడుగా ఉండటం అలవాటు చేసుకుంది సరస్వతి. ఆమె వంట ఎలా చేస్తుందో దీక్షగా గమనించేది. అడపాదడపా తనూ చేతులు కాల్చుకునేది. ఒకట్రెండేండ్లు గడిచే సరికి మేనత్తకే పాఠాలు చెప్పేంతగా పాకశాస్త్రంపై పట్టు సాధించింది.
1959లో సరస్వతి వివాహం అయింది. భర్త బ్యాంకు ఉద్యోగి. బెంగళూరులో కొత్త కాపురం పెట్టారు. ఆమె వంటకాలకు ఆయన దాసోహం అయ్యాడు. పూటకో వెరైటీ చేయమని పురమాయించి మరీ రుచులు ఆస్వాదించేవాడు. అత్తారిల్లూ పెద్దదే! ఆరుగురు తోడికోడళ్లు. అత్తగారి పెత్తనం షరామామూలే! పైగా సనాతన వైదిక కుటుంబం. మడి, ఆచారాలు కామన్. ఆ కాలం ఇల్లాళ్లు వీటన్నిటినీ గౌరవంగా, బాధ్యతగా భావించేవారు.
సరస్వతిదీ అదే మనస్తత్వం. ఆ వైఖరే అత్తగారితో ముద్దుల కోడలు అనిపించుకునేలా చేసిందని ఇప్పటికీ సిగ్గుపడుతూ చెబుతారు సరస్వతి. ‘అందరూ బాగానే వండుతారు. నువ్వు చేస్తే ఏదో మంత్రం వేసినట్టుగా ఉంటుందే కోడలా! వంట చేయడాన్ని ఏదో పనిలా కాకుండా.. క్రతువుగా భావిస్తావు’ అని అత్తగారు సరస్వతికి తరచూ కితాబిచ్చేవారట. దక్షిణాది వంటకాల్లోని వెరైటీలన్నీ చిటికెలో చేసేస్తారామె. పాలక్కడ్ పాలకూర మొలకలు, మద్రాస్ రసం, బెంగళూరు సాంబారు ఇలా శాకాహార వంటకాలు వందల రకాలు చేయడంలో ఆమెది అందెవేసిన చేయి.
దశాబ్దాలు గడిచిపోయాయి. సరస్వతి దంపతులకు పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలూ కలిగారు. 80వ పడిలోనూ మూడో తరానికి వండి వడ్డిస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారామె. ఆ వంటకాలు తింటూ ‘నువ్వు సూపర్ బామ్మ’ అని పిల్లలు తెగ పొగిడేవారు. ఈ ప్రశంసలు విని ఆమె నవ్వి ఊరుకునేదంతే! ఇదిలా ఉండగా.. ఓసారి తన మనవరాలికి కూతురు పుట్టినప్పుడు దిష్టి దారం పేని కట్టింది సరస్వతి. ఆ వైనాన్నంతా మరో మనవరాలు వీడియో తీసి ఇన్స్టాలో పోస్టు చేసింది. దిష్టి దారం ప్రత్యేకతను కూడా ఆమెతోనే చెప్పించింది. ఆ వీడియోకు విపరీతంగా లైకులు వచ్చాయి. ఇదేదో బాగానే ఉందనిపించింది. ‘బామ్మా! నీకెన్నో ఫుడ్ వెరైటీలు వచ్చుకదా! వాటన్నిటినీ వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్టు చేద్దాం’ అన్నదట. ‘ఈ వయసులో ఇవన్నీ ఎందుకే?’ అని అభ్యంతరం చెప్పారు సరస్వతి. మనవరాలు వినలేదు. చివరికి బామ్మకు ఒప్పుకోక తప్పలేదు. అలా 2024 జనవరిలో ‘ద అయ్యర్ పాతి’ పాకశాల మొదలైంది.
రకరకాల వంటకాలు ఆమె వండే విధానం చూసి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏడాదిలో ఏకంగా 300 రకాల వంటల తయారీ వీడియోలు పోస్టు చేశారు సరస్వతి. అవన్నీ సూపర్ హిట్టే! పప్పు, పచ్చిపులుసు లాంటి సాదాసీదా వంటలు కావవి. తరాల కిందట వాళ్లు రుచిగా, శుచిగా వండుకున్న సంప్రదాయ పాకాలు. వాటిని ఈ తరానికి పరిచయం చేస్తూ.. పాత రుచులనే కొత్తగా అందిస్తున్నారు సరస్వతి. మజ్జిగ పులుసులో వెరైటీలు, వంకాయ పచ్చళ్లలో రకాలు, ముద్దపప్పు మతలబులు, మిర్చీబజ్జీ ఘుమఘుమలు, అరటికాయ మసాలా, పెరుగుతో వండే పప్పుకూరలు ఇలా వివిధ రకాల వంటలు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారామె. మనవరాలి సాయంతోనే కావొచ్చు! కానీ, ఆమె మాటతీరు, వంటకాలు చేసే నైపుణ్యానికి ఈ తరం ఫిదా అయింది.
ఏడాదిలోనే దాదాపు 84 వేల మంది ఆమెకు ఫాలోవర్లుగా మారారు. అంతేకాదు, ‘ద అయ్యర్ పాతి’ పేరుతో యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తున్నారు సరస్వతి. ఇందులో పాకశాస్త్ర పాఠాలు పంచుకోవడంతో పాటు వాగ్గేయకారుల కృతులనూ రసరమ్యంగా ఆలపిస్తారు కూడా! ‘నాకు పదిహేనేండ్లు వచ్చినప్పటి నుంచి వంటలు చేస్తూనే ఉన్నాను. నేను వండిన పదార్థాల్ని ఇంట్లోవాళ్లు తృప్తిగా ఆరగిస్తుంటే నా కడుపు నిండేది. కానీ, ఈ వంటకాలే నాకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని ఎన్నడూ ఊహించలేదు. ఇన్నాళ్లకు నా ప్రతిభకు ఇలా గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంద’ని చెబుతున్న సరస్వతి నారాయణస్వామి అచ్చంగా ఇన్స్టా అన్నపూర్ణే!