ప్రకటనల రంగంలోనే తొలిసారిగా.. రెడిఫ్ ఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్స్ అనే సంస్థ వినూత్నమైన అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని ఏర్పాటుచేసింది. ఇందులో సీయీవో నుంచి కాపీ రైటర్ వరకు అందరూ మహిళలే. నిజానికి టీవీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల్లో.. చాలా వరకూ మహిళలకు సంబంధించిన ఉత్పత్తులే ఉంటాయి. ఆయా ప్రకటనల లక్ష్యం కూడా మహిళలే. కానీ ఆ మాధ్యమాన్ని పురుషులే శాసిస్తున్నారు.
ఈ ధోరణికి కాలం చెల్లినట్టే అంటున్నారు యాడ్ గురువులు. అడ్వర్టయిజింగ్ నిపుణురాలు తీస్తా సేన్ ఈ కార్పొరేట్ ప్రమీల రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నారు. ఏజెన్సీ పేరు కూడా వినూత్నంగానే పెట్టుకున్నారు.. లేడీఫింగర్! ఇప్పటికే అమెరికా, యూకేలాంటి చోట్ల ‘అందరూ మహిళలే’ కాన్సెప్ట్‌తో చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి.
ఒక కవి హృదయాన్ని మరో కవి మాత్రమే అర్థం చేసుకోగలడు అన్నట్టు, ఒక మహిళ అంతరంగం ఇంకో మహిళకే అర్థం అవుతుంది. దీంతో ప్రకటనల ఇతివృత్తాల ఎంపిక సులభం అవుతుంది. కానీ, పురుషాధిక్య ప్రపంచంలో ఈ మహిళా బృందం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.