అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ కాస్ట్యూమ్స్ మాత్రమే కనిపించే ఆ ప్రపంచ వేదికపై తొలిసారి మన తెలంగాణ హస్తకళ ముచ్చటగా నడయాడింది. అదొక ఫ్యాషన్ షో మాత్రమే కాదు మన నేతన్న కష్టాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన ఘట్టం. పోచంపల్లి ఇక్కత్‌ను గ్లోబల్ స్థాయిలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిపించింది మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్. చేనేత వస్ర్తాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ విజయం ఇక్కత్కే దక్కుతుందని చెబుతున్నది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మా తాతది ఉమ్మడి మెదక్ జిల్లాలోని శనిగరం. నిజాం నవాబ్ దగ్గర లీగల్ రైటర్‌గా 50 ఏండ్లపాటు పనిచేశారు. ఆ తరువాత ఆయన చనిపోయేంతవరకు గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా సేవలు అందించారు. మాది శనిగరం గ్రామమైనా నేను పుట్టిపెరిగింది మాత్రం అమ్మమ్మ వాళ్ల ఊరు రామగుండంలోనే. అక్కడే కొన్నిరోజులు చదువుకున్నాను కూడా. ఆ తర్వాత పై చదువులకోసమని కుటుంబంతో సహా హైదరాబాద్‌కొచ్చాం. డిగ్రీతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశాను. అనుకోకుండా ఓ రోజు దగ్గరి స్నేహితుడు ఫోన్ చేసి మిస్ సౌత్ ఇండియా ఆడిషన్స్ గురించి చెప్పి, అందులో నన్నూ పాల్గొనమని ఫోర్స్ చేశాడు.
నాకు ఇష్టంలేకున్నా తన మాట కాదనలేక ఆ ఆడిషన్స్‌కు వెళ్లాను. అప్పటికే అక్కడ 1600 మందికిపైగా అమ్మాయిలు రిజిష్టర్ చేసుకొని పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మనకు ఎలాగూ అవకాశం ఉండదని బయటికొచ్చాను. అప్పుడే ఆ ఈవెంట్ నిర్వహిస్తున్న అజిత్ కుమార్ గారి భార్య నన్ను చూసి నాతో దరఖాస్తు నింపించి మరీ పోటీలో పాల్గొనేలా చేసింది. అలా 2013లో తొలిసారి వేదికెక్కాను. టాప్ త్రీలో నిలిచిన వారిని మాత్రమే కోయంబత్తూరులో జరిగే పోటీలకు పంపిస్తామని న్యాయనిర్ణేతలు చెప్పడంతో, ఎలాగూ మనకు అవకాశం రాదని ఊపిరి పీల్చుకొని ఇంటిదారిపట్టాను.

నేను ఆడిషన్‌కు వెళ్లినట్లు ఇంట్లో తెలియడంతో పెద్ద యుద్ధమే జరిగింది. గ్లామర్ ఫీల్డ్‌లో అమ్మాయిలకు ఇబ్బందులు ఉంటాయని, ఆ వైపు వెళ్లొద్దని అమ్మ గట్టిగా చెప్పింది. అందులో నేనెలాగూ ఎంపిక కానని భావించి ఇంట్లోవారి మాటకు అడ్డు చెప్పలేదు. ఓ మూడురోజులకు పిడుగులాంటి విషయం తెలిసింది. ఆ టాప్ 3లో నేనున్నాను. ఇంట్లో వాళ్లు కోయంబత్తూరు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. మళ్లీ గొడవలయ్యాయి. కొన్నిరోజులు నాతో మాట్లాడటం మానేశారు. కానీ ఎలాగో అలా పోటీలకు వెళ్లాను. 2014లో మిస్ ఏపీగా గెలిచాను. అదే నా మొదటి విజయం. ఇక అక్కడినుంచి వెనుదిరగలేదు. ఆ తరువాత 2015లో కేరళలో జరిగిన మిస్ క్వీన్ పోటీల్లో పాల్గొని రెండు సబ్‌టైటిల్స్ గెలుచుకున్నాను. అదే ఏడాది ముంబైలో జరిగిన మిస్ ఇండియా ప్లానెట్ పోటీల్లోనూ గెలుపొందాను. 2016లో మొదటిసారి అంతర్జాతీయ వేదికపై పాల్గొన్నాను.
సుమారు 70 దేశాల నుంచి అందాలపోటీలకు హాజరయ్యారు. టర్కీలో రెండు వారాలపాటు జరిగిన శిక్షణకు భారత్ నుంచి నేను ఒక్కదాన్నే వెళ్లాను. అక్కడ నల్లజాతీయులపై తీవ్రమైన వివక్ష చూపించారు. మొదటిసారి దేశం విడిచి రావడం వల్ల తిండి పడలేదు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురయ్యాను. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మిస్ ప్లానెట్ ఇండియా క్రౌన్ గెలుచుకున్నాను. మరిచిపోలేని అనుభూతి అది. దేశస్థాయిలో పాల్గొన్నప్పుడు భయమన్నదే లేకుండా ముందుకు సాగిన నాకు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నప్పుడు మాత్రం తెలియని ఫీలింగ్ కలిగింది. తొలిసారి టఫ్‌గా అనిపించింది. దాని తరువాత 2017లో మిస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీలు మలేషియాలో నిర్వహించారు. అందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాను.
ఇలా ప్రపంచ వేదికలపై అనేక టైటిళ్లు గెలుచుకున్న నన్ను 2017లో తెలంగాణ సర్కార్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా, కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాయి. నాకు లభించిన గొప్ప అవకాశంగా భావించాను. నా వంతు కృషిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే తెలంగాణ సంస్కృతిని కాపాడే దిశగా కృషి చేశాను. విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ ఇక్కడి సంస్కృతిని పరిచయం చేయడం ప్రారంభించాను.
మరోవైపు చేనేతను రూరల్ టూ గ్లోబల్ దిశగా ప్రచారం చేయాలని.. చేనేత వస్త్రాలను ధరించి విదేశాల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేదాన్ని. మలేషియాలో బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి చేనేత వస్ర్తాలను ధరించాను. అప్పటినుంచి ఎక్కడికెళ్లినా అవే ధరిస్తున్నాను. చేనేత అంటే కేవలం చీరలు అని మాత్రమే చాలామంది అనుకుంటారు. నేను వాటితో బ్లేజర్లు, గౌన్లు ట్రెండ్‌కు తగ్గట్టుగా వినూత్నమైన దుస్తులను డిజైన్ చేయించి, ధరిస్తుంటాను.

ఫ్రాన్స్‌లో నిర్వహించిన 79వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు 39వేల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో కొంతమందికి మాత్రమే అవకాశం లభించింది. అందులో నేను ఉండటం సంతోషాన్నిచ్చింది. అయితే ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన ఫెస్టివల్. మన చేనేత వస్ర్తాలను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఈ వేదిక నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావించాను. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 కోట్ల మంది వీక్షించే ఈ కార్యక్రమంలో చేనేత గౌన్‌తో వెళ్లాలనిపించింది. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన ఇక్కత్ వస్ర్తాన్ని అందమైన గౌన్‌గా డిజైన్ చేయించాను. దానిని ధరించి.. రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే, ఇక్కత్ వైభవాన్ని ప్రపంచానికి చాటిన అనుభూతి కలిగింది. దీని ప్రత్యేకతను చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. చేతితో నేసిన వస్త్రం ఇంత బాగుంటుందా అని ప్రశంసలు కురిపించారు. నా ప్రయాణంలో చేనేత ఒక భాగంగా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్లో మన చేనేతకు ప్రత్యేక స్థానం కల్పించాలన్నదే నా లక్ష్యం.
ప్రపంచస్థాయిలో మెరిసిందని’ కేసీఆర్ గారు 2017లో అభినందించారు. దాంతోపాటు పోటీల్లో పాల్గొనడానికి తోడ్పాటును అందించారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అజిత్ సార్ దంపతులే కారణం. వాళ్లు లేకుంటే ఈరోజు ప్రపంచ వేదికల్లో నా పేరు కూడా వినిపించేది కాదు. చాలామంది ఒకటి రెండు టైటిళ్లు గెలుచుకుంటారు నేను ఇప్పటివరకు 7 టైటిళ్లు గెలుచుకున్నాను. పలుసార్లు జ్యూరీగా వ్యవహరించాను.
– రాజు పిల్లనగోయిన