HomeSuccess-storyPooja Dugar From Haryana Started The Company Yellow Naturals
సహజంగా.. సౌందర్య ఉత్పత్తులు
ఒకప్పుడు పప్పన్నం తింటే.. ఎంత భేషుగ్గా కడుక్కున్నా వేళ్లకు అంటుకున్న పసుపు ఓ పట్టాన వదిలేది కాదు. ఉల్లిపాయలు తరుగుతుంటే.. కండ్లు జలపాతాలయ్యేవి.
ఒకప్పుడు పప్పన్నం తింటే.. ఎంత భేషుగ్గా కడుక్కున్నా వేళ్లకు అంటుకున్న పసుపు ఓ పట్టాన వదిలేది కాదు. ఉల్లిపాయలు తరుగుతుంటే.. కండ్లు జలపాతాలయ్యేవి. మరిప్పుడో.. శ్రావణమాసం ముత్తయిదువల పాదాలకు దట్టించిన పసుపుబొట్టు ఆనాటి రాత్రికల్లా కనుమరుగవుతున్నది. కిలోల కొద్దీ ఉల్లిపాయలు తరిగినా కంటి నుంచి నీటిబొట్టు రాలితే ఒట్టు! కల్తీ కారణంగానే ఈ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చిటికెడు పసుపు నుంచి చారెడు ఉప్పు దాకా… ప్రతి వస్తువులో కల్తీ రాజ్యమేలుతున్నది. ఇక కాస్మెటిక్ ఉత్పత్తులు, పిల్లలకు ఉపయోగించే వస్తువులూ నకిలీ మకిలి పట్టుకొని మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా హర్యానాకు చెందిన పూజా దుగ్గర్ ‘ఎల్లో నేచురల్స్’ సంస్థ ప్రారంభించింది.
తినే ఆహారంలో కల్తీ ఉంటే.. ఆరోగ్యానికి చేటు. చర్మ సౌందర్యం కోసం పూసుకునే పైపూతలు నకిలీవైతే.. కొత్తందం సంగతి దేవుడెరుగు! ఉన్న అందం కాస్తా ఆవిరైపోతుంది. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం అధికం కావడం, వివిధ ఉత్పత్తుల్లో రసాయనాలు విచ్చలవిడిగా వినియోగిస్తుండటం వల్ల ఏం తీసుకోవాలన్నా సందేహం కలుగుతున్నది. ఇక పిల్లల విషయంలో ఉపయోగించే వస్తువుల్లో రసాయనాలు కలిస్తే అది వారి జీవితాలకు శాపంగా పరిణమిస్తుంది. పూజా దుగ్గర్కు సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఆ సమస్యను అందరిలా కొట్టిపారేయలేదామె! దీనికో పరిష్కారం కనుగొనాలని భావించింది. భావితరాల మనుగడ ఆరోగ్యకరంగా ఉండాలని ఆశించింది. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలతో సబ్బులు, క్రీములు తయారుచేసే సంస్థను ప్రారంభించింది. కాస్మెటిక్స్ మార్కెటింగ్ రంగంలో పన్నెండేండ్లు పనిచేసిన అనుభవంతో 2023లో ‘ఎల్లో నేచురల్స్’ అనే సంస్థ స్థాపించింది.
సంస్థ ప్రారంభించడానికి ముందు సహజ సౌందర్య ఉత్పత్తుల గురించి పరిశోధించింది. వాటినుంచి ఫైనల్ ప్రొడక్ట్ తీసుకురావడానికి సంప్రదాయ పద్ధతులను అన్వేషించింది. పాతకాలంలో శరీర సౌందర్యానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగించే వారో ఆరా తీసింది. తనకు ఎదురైన సందేహాలను ఆయుర్వేద నిపుణులను కలిసి నివృత్తి చేసుకుంది. టాక్సికాలజిస్ట్, డెర్మటాలజిస్ట్‌లతో తొమ్మిది మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటుచేసింది. వారితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లో పనులు ప్రారంభించింది. తొమ్మిది నెలలు ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలే ముడిసరుకుగా సౌందర్య ఉత్పత్తులను తయారుచేసింది.
బియ్యపుపిండి, అవకాడో, కుంకుమపువ్వు, సహజ నూనెలు, వెన్న లాంటి పదార్థాలను మేళవించి సౌందర్య సాధనాలు సిద్ధం చేసింది. తొలుత వీటిని తను, తన కూతురు ఉపయోగించారు. ఐదు దశల ప్రయోగాల తర్వాత మంచి గుణం ఉందని నిర్ధారించుకున్నది. ఆ తర్వాతే మార్కెట్లోకి ‘ఎల్లో నేచురల్స్’ ఎంట్రీ ఇచ్చింది. ‘తాతమ్మల కాలంలో ప్రకృతి సిద్ధమైన పదార్థాలను సౌందర్య సాధనకు ఉపయోగించేవారు. మళ్లీ అలాంటి రోజు రావాలనేదే నా కోరిక. చిన్నారుల సున్నితమైన చర్మం రసాయనాల కాటుకు గురికావొద్దని ఈ ప్రయత్నం చేశాను. నాలుగేండ్ల నుంచి పన్నెండేండ్ల మధ్యనున్న పిల్లల కోసం షాంపూ, కండీషనర్, బాడీవాష్, నెయిల్ పెయింట్ తదితర ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తెచ్చాం. ‘ఎల్లో నేచురల్స్’ ప్రస్థానం ఇప్పుడిప్పుడే మొదలైంది. రానున్న రోజుల్లో మా సంస్థ నుంచి మరిన్ని సహజమైన ఉత్పత్తులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’ అంటున్నది పూజా దుగ్గర్.