ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సవ్యసాచిలా కష్టపడాల్సిందే! కాలేజ్ టైమ్ అయిపోగానే పార్ట్‌టైమ్ కొలువులు చేయాల్సిందే! విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పరిపాటి అయిన ఈ విధానాన్ని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టారు ఇద్దరు యువతులు. చదువుకుంటూనే.. ఉపాధి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం అసంఘటితంగా ఉన్న రంగాలను ఒకే వేదికపైకి తెచ్చారు. ‘స్టూడెంట్యూనియన్.ఐఎమ్’ వారధిగా విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉన్నతవిద్య కోసం భాగ్యనగరికి వస్తున్న విద్యార్థులకు భరోసా కల్పించడమే తమ లక్ష్యం అంటున్న ఫిర్దౌస్ ఉన్నీసా, బస్రా అబ్దుల్ ఖాదర్ ఈ వారం మన ఆంత్రప్రెన్యూర్లు..
హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన బస్రా, ఫిర్దౌస్ ఇద్దరూ షాదాన్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశారు. చదువు పూర్తికాగానే అందరిలా కోచింగ్‌లూ, కోర్సులు, ఉద్యోగాల వేటలో పడలేదు. తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లోని ఏసీ గదుల్లో కూలీల్లా కష్టపడటం వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ‘మీకు నచ్చింది చేయండి. కానీ, ఉద్యోగమనే చట్రంలో ఇరుక్కోవద్ద’ని సూచించారు. ఆ మాటలే ఈ ఇద్దరు మిత్రులను ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేయించాయి. సాంకేతిక పరిజ్ఞానంతో తమ మస్తిష్కంలోని ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు బస్రా, ఫిర్దౌస్. బీటెక్ పూర్తయిన సంవత్సరమే ‘https://www.studentunion.im/’ వెబ్‌సైట్‌ను నెలకొల్పి తమ ప్రయాణం
మొదలుపెట్టారు.
ఒక విద్యార్థి హైదరాబాద్‌లో చదువుకోవాలంటే.. ట్యూషన్ ఫీజు పోను నెలకు రూ.10వేల నుంచి రూ.15వేలు ఖర్చు చేయాల్సిందే! తిండీతిప్పలు, బస్సులు, మెస్సులు, సరదా ట్రిప్పులు ఇలా ఏం చేయాలన్నా క్యాష్ ఉండాల్సిందే! ఊరి నుంచి తల్లిదండ్రులు చెమటోడ్చి సంపాదించి పంపుతున్న డబ్బు ఖర్చు చేయాలంటే మనసు రాదు. ఈ క్రమంలో చిన్నచిన్న సరదాలు చంపుకొని భారంగా కాలం గడుపుతుంటారు విద్యార్థులు. కాలేజీ ట్రిప్, ఫ్రెండ్స్ బర్త్‌డే తరహా సరదాలతోపాటు ప్రాజెక్టు వర్క్, ఎడ్యుకేషనల్ టూర్ లాంటి వాటికీ ఇంట్లోవాళ్లను డబ్బు అడగలేక సతమతమవుతుంటారు. అలాంటివారికి చేయూతనిచ్చేలా, వారికి ఉపాధి కల్పించడమే తమ వ్యాపార సూత్రంగా.. స్టూడెంట్ యూనియన్ను స్థాపించారు. ప్రస్తుతం 400 మందికి పైగా యువతీయువకులు ఈ సేవలను పొందుతున్నారు.
నెలలో 20-25 రోజుల పనిదినాలు ఉండేలా ఉపాధి కల్పిస్తారు. గంటకు రూ.500 నుంచి రూ.2,500 వరకు ఆదాయం పొందే ఉద్యోగాలు వెతికి చూపుతారు. రోజుకు గంట నుంచి నాలుగు గంటలు వ్యవధి ఉన్న కొలువులే ఎక్కువగా ఉంటాయి. 18 ఏండ్లు నిండిన విద్యార్థులకే ఈ అవకాశం ఉంటుంది. కనీస విద్యార్హతలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండటం తప్పనిసరి. వారికి నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు. ఒక్కసారి స్టూడెంట్ యూనియన్ వెబ్సైట్లో పేరు, చిరునామా, చదువుతున్న కాలేజీ వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. విద్యార్థుల వివరాలు పరిశీలించిన తర్వాత వారి అర్హతలను ఉపాధి అవకాశాలను వాట్సాప్ నెట్వర్క్ ద్వారా వారికి చేరవేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, వెయిటర్లు, ఈవెంట్లలో క్రౌడ్ కంట్రోలింగ్ సభ్యులు, ఆఫీస్ మేనేజ్మెంట్ సేవకులు ఇలా రకరకాల కొలువులు ఉంటాయి. విద్యార్థి అర్హత, ఆసక్తిని బట్టి ఉపాధి పొందొచ్చు.
కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఉపాధి కోసం నగరానికి రావాలని అనుకునే వారు కూడా తమ వెబ్సైట్లో నమోదు చేసుకుంటున్నారని చెబుతున్నారు బస్రా, ఫిర్దౌస్. బెంగళూరు, చెన్నై, చండీగఢ్, ముంబయితోపాటు, చిన్న నగరాలకు చెందిన విద్యార్థులూ తమ స్టూడెంట్ యూనియన్ వెబ్సైట్ ద్వారా పార్ట్‌టైమ్ కొలువులు అభ్యర్థిస్తున్నారని తెలిపారు. ‘ఉద్యోగం కోసం ఆన్లైన్లో ఫ్రాడ్‌స్టర్ల ఉచ్చులో ఎందరో చిక్కుకుంటున్నారు. మోసగాళ్ల బారినపడకుండా.. సురక్షితంగా సంపాదించుకునేలా, వారి చదువు సక్రమంగా సాగేందుకు ఒక వేదికను సిద్ధం చేయడం గర్వంగా ఉంది. ప్రస్తుతం వందల్లో ఉన్న ఉద్యోగాలను ఏడాదిలో వేలల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. త్వరలో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తాం’ అంటున్నారు ఈ యువతులు. ఆర్థిక సహకారం లభించినట్లయితే తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామనీ, హైదరాబాద్ యువత స్వేచ్ఛగా సంపాదించుకునే వేదికగా తమ సంస్థను తీర్చిదిద్దుతామని చెబుతున్న బస్రా, ఫిర్దౌస్లకు మనమూ సలామ్ చేద్దాం!
తరచూ పాకెట్‌మనీ కోసం ఇంట్లో వాళ్లను అడగలేకపోవడమే స్టూడెంట్ యూనియన్ వేదిక ఏర్పాటుకు ప్రధాన కారణం. కాలేజీ రోజుల్లో గంటల వ్యవధితో పనిచేయడం అంత కష్టమేం కాదు. దీంతో జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది. అనుభవమూ వస్తుంది. కొందరైతే తమ సంపాదనను పొదుపుగా వాడుకుంటూ.. కాలేజీ ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. వెబ్సైట్ లాంచ్ చేయడంతోపాటు, ఎడ్యువెంచర్ పార్క్‌లో ఇంక్యుబేట్ కావడంతో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన వృత్తి, టెక్నికల్ నైపుణ్యాలు పొందగలిగాం. ఈ విషయంలో ఎడ్యువెంచర్ ఫౌండర్ మిరాజ్ ప్రోత్సహించిన తీరు… మమ్మల్ని ఉన్నత ఆశయం వైపు అడుగులు వేసేలా చేసింది.