రైతు కుటుంబంలో పుట్టారు. పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు. అర్హత పెంచుకుని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయ్యారు. వ్యవసాయంపై ప్రేమ.. ఉద్యోగ విరమణ తర్వాత సేద్యం వైపు అడుగులు వేయించింది. శ్రీవరి సాగుతో శ్రీకారం చుట్టి ఆధునిక పద్ధతుల్లో అద్భుతమైన దిగుబడి సాధించారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, ఎత్‌బార్‌పల్లికి చెందిన పల్లె రమాదేవి ఏడుపదుల ప్రయాణం బడి, సాగుబడి చుట్టే తిరిగింది. ఆ అనుభవాలన్నీ ఆమె మాటల్లోనే..
నా ఉద్యోగ ప్రస్థానమంతా హైదరాబాద్‌లోనే. నేను షాబాద్ మండలంలోని బోడంపాడులో పుట్టాను. పదహారేండ్లకే పెండ్లయింది. ఆయనది ఎత్బార్పల్లి. హైదరాబాద్సిటీలో ఎక్సైజ్ శాఖలో క్లర్క్‌గా చేసేవారు. దీంతో గౌలిగూడలో ఇల్లు అద్దెకు తీసుకున్నాం. కొన్నాళ్లకు హౌసింగ్ బోర్డు ఆయనకు బహదూర్‌పూర్‌లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించింది. పొదుపు సొమ్ముకు, బంగారం అమ్మగా వచ్చిన డబ్బు జోడించి ఇచ్చాం. ఇంకా, నెలకు రెండువేలు వాయిదా కట్టాల్సి వచ్చేది. అంత మొత్తం సర్దడం కష్టమయ్యేది. దీంతో ఆ ఇంటిని అద్దెకిచ్చి.. దూద్‌బౌలిలోని ఓ చిన్న పోర్షన్లో తలదాచుకున్నాం. ఎంత కష్టం వచ్చినా ఇల్లు మాత్రం అమ్మొద్దని నిశ్చయించుకున్నాం. పరిస్థితి అంతవరకూ రాకూడదంటే.. నేనూ ఉద్యోగం చేయాల్సిందే అని అర్థమైంది. నేను పీయూసీ వరకు చదివాను. ఆ అర్హతతో బేగంపేటలో టీచర్ ట్రైనింగ్ చేశాను. వెంటనే రహీంపురాలోని ప్రబోధ్ బాలికల పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. పనిచేస్తూనే బీఎస్సీ, ఎంఏ, బీఎడ్ చేశాను.
వ్యవసాయానికే అంకితం..
మా ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే. నాకూ సేద్యం పట్ల ఆసక్తి ఉండేది. అత్తింట్లో మా మామగారే ముందు నిలబడి సేద్యం చేసేవారు. మేమిద్దరం సెలవుల్లో ఎత్బార్పల్లి వెళ్లి వ్యవసాయం చూసుకునేవాళ్లం. మా మామగారు చని పోయాక పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. రెండేళ్లపాటు ఎత్బార్పల్లి నుంచి రోజూ బడికి వెళ్లి వచ్చేదాన్ని. రెండు పడవల ప్రయాణం కష్టమనిపించి.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నాను.
వ్యవసాయానికే అంకితమయ్యాను. మా ఆయన పద్మారెడ్డి ఎక్సైజ్ శాఖలో సీఐ హోదాలో రిటైర్ అయ్యారు. ఇద్దరం కలిసి ముప్పై ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్నాం. బాబు రవికాంత్ రెడ్డి ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తుంటాడు. కూతురు వరూధిని ఇంజనీరింగ్ చదివింది. పెళ్లి చేశాం. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నది. మా వారికి కూడా వ్యవసాయం అంటే ఇష్టం. ఆ మక్కువతో ఆవులు, టర్కీ కోళ్ల్లు పెంచుతున్నారు. తెల్లవారుజామునే లేచి పూజ చేసుకుంటాను. ఇంటి పనులన్నీ ముగించుకుని పొలంబాట పడతాను.
‘శ్రీ’ వరితో శ్రీకారం
ఎత్బార్పల్లి రైతాంగానికి వ్యవసాయమే జీవనాధారం. సరైన మెలకువలు తెలియక తీవ్రంగా నష్టపోయేవారు. ఆ సమయంలో మా పొలంలో ‘శ్రీ’ వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధించి చూపాను.ఎకరాకు 58 బస్తాలు పండటంతో మిగతా రైతులు కూడా ఇదే పద్ధ్దతిని పాటించారు. ఒకప్పుడు నీళ్ల సౌకర్యం లేక పత్తి, కందులు, మక్క తదితర పంటలు పండించేవాళ్లం. తెలంగాణ వచ్చాక 24 గంటలూ ఉచిత కరెంటు ఇస్తున్నది కేసీఆర్ సర్కారు. బోర్లలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. అప్పటి నుంచి ఎక్కువగా వరే పండిస్తున్నాం. పది ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. సేద్యంలో సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇస్తున్నా. కొత్తిమీర, మెంతికూర వేస్తున్నా. రకరకాల పూలు సాగుచేస్తున్నా. ఒక్క లిల్లీతోనే ఎకరాకు వారానికి 20 వేల ఆదాయం వస్తున్నది. కొత్త వంగడాలంటే నాకు చాలా ఆసక్తి. అందుకే మెక్సికో, దక్షిణ అమెరికాలో పండించే ‘చియా’ పంటనూ ప్రయత్నించాను.
పల్లె కోసం
పద్దెనిమిదేండ్ల క్రితం.. గ్రామంలో రైతు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేశాను. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తాను. సలహాలు, సూచనలు అందిస్తాను. మండల రైతుబంధు సభ్యురాలిగానూ వ్యవహరిస్తున్నా. అప్పుడప్పుడూ మా ఊళ్లోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్ బోధిస్తాను. మద్యపానం వంటి దురలవాట్ల గురించి కూడా చైతన్యపరుస్తున్నా. మద్యం తాగిన వాళ్లు నా ముందుకు రావాలంటే భయపడతారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మహిళా రైతు అవార్డు సహా వివిధ పురస్కారాలు అందుకున్నాను. ‘రైతుకు అండగా నిలబడే ముఖ్యమంత్రి, సేద్యానికి సకల సదుపాయాలూ కల్పించే ప్రభుత్వం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం. కాబట్టే వ్యవసాయం పండుగలా మారింది. బడిలో పిల్లల్ని తీర్చి దిద్దాను, సాగుబడిలో పంటల్ని తీర్చిదిద్దాను. ఇంతకంటే ఏం కావాలి?
…? గంజి ప్రదీప్ కుమార్
– ఉప్పర శివ