సృష్టిలో అమ్మను మించిన యోధులు లేరంటారు. ఆ అమ్మే ప్రకృతికి తల్లిగా మారితే? ఎడారిలో సైతం ఆకుపచ్చని ఆశలు చిగురిస్తాయి. కాంక్రీట్ జంగిల్ కూడా హరిత వనంగా మారిపోతుంది. ఈ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తుంది కేరళకు చెందిన 92 ఏండ్ల దేవకీ అమ్మ పెంచిన అడవిని చూస్తే. ఒకటో రెండో కాదు… ఏకంగా ఐదు ఎకరాల్లో ఆమె పెంచిన తపోవనం ప్రకృతికి ఓ వరం. పట్టుదల ఉంటే ప్రకృతిని సైతం మన ఇంటి చుట్టూ బంధించవచ్చని నిరూపించిన ఆమె కృషికి భారతావని ఇటీవల అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారంతో సలక్షణంగా ప్రణమిల్లింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ సాగిన ఆమె ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తిదాయకం!
పచ్చదనాన్ని ఇష్టపడటం వేరు దాన్నే జీవితంగా మలచుకోవడం వేరు. రెండో దారిలో నడిచారు కొల్ల కాయిల్ దేవకీ అమ్మ. ఒకరకంగా చెప్పాలంటే విధి విసిరిన సవాలులో ఆమె ఆ దారిని ఎన్నుకున్నారు. కేరళంలోని అలెప్పీ జిల్లా ముత్తుకుళం అనే గ్రామంలో పుట్టారు దేవకి. తాత నుంచి మొక్కల పెంపకం మీద ఆసక్తిని పుణికి పుచ్చుకున్నారు. తర్వాత గోపాలకృష్ణ పిళ్లయ్ని పెళ్లి చేసుకున్నా వాళ్ల వృత్తి వ్యవసాయమే అవడంతో పచ్చని పొలాల్లో పనిచేస్తూ గడిపేవారు. 1980వ సంవత్సరం ఆమె జీవితంలో ఒక పెద్ద చీకటిని మిగిల్చింది. ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. వెన్నెముక, కాళ్లకు గాయాలు కావడంతో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆమె మంచానికే పరిమితమైంది. నడవడం కష్టమైంది. మానసిక వేదనతో నరకాన్ని చూశారు. వైద్యులు ఆమెను శారీరక శ్రమ చేయవద్దని, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ, ఖాళీగా కూర్చుంటే మనసు మరింత కుంగిపోతుందని భావించారామె. మంచం దిగి అడుగులు వేయడం మొదలుపెట్టారు. పచ్చదనం వైపు తన ప్రాణం గుంజడం గమనించారు. అందుకే చేతికి దొరికిన ఒక మొక్కను ఇంటి వెనుక నాటారు. ఆ మొక్క ఎదుగుతుంటే ఆమెలోని నొప్పులు మాయమవడం ప్రారంభించాయి. అలా ఒక విపత్తు, ఒక అద్భుతమైన హరిత యాత్రకు నాంది పలికింది.
సొంతంగా నడవడమే కష్టమైన స్థితిలో ఆమె మొక్కలు నాటడం ప్రారంభించినప్పుడు సమాజం ఆమెను వింతగా చూసింది. ఎందుకొచ్చిన కష్టం ఇది, దీనివల్ల లాభం ఏముంది అనుకున్నారు. సొంత స్థలంలో వ్యవసాయం కాకుండా, లాభం లేని అడవిని పెంచడం చుట్టుపక్కల వాళ్లకు పెద్దగా రుచించలేదు. కానీ దేవకీ అమ్మ వెనకడుగు వేయలేదు. ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్యులు వారించినా, చిన్న చిన్న బిందెలతో దగ్గరలోని చెలిమెల్లోంచి నెమ్మదిగా నీరు తెచ్చి మొక్కలకు పోసేవారు. భర్త గోపాలకృష్ణ పిల్లనగ్రోవి వాయిస్తూ ఉంటే, ఆ సంగీతాన్ని వింటూ మొక్కలు మరింత వేగంగా పెరిగాయని ఆమె నమ్ముతారు. క్రమంగా పిచ్చి పని అనుకున్న నోళ్లే ఆశ్చర్యపోయేంత అందంగా పచ్చదనం విచ్చుకుందక్కడ. మూడువేలకు పైగా చెట్లను ఇక్కడ పెంచారామె.
దాదాపు నాలుగున్నర దశాబ్దాల నిరంతర శ్రమ ఫలితం… నేడు ఆమెకున్న ఐదు ఎకరాల భూమి ఒక దట్టమైన అడవిగా మారింది. ఇందులో కేవలం చెట్లు మాత్రమే లేవు, ప్రకృతి సమతుల్యత ఉంది. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కంపోస్ట్ వాడటం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం ద్వారా ప్రకృతిలో మమేకమై చెట్లు పెంచడం అలవాటు చేసుకున్నారు దేవకి. ఎలాంటి ప్రత్యేక చదువులు, అగ్రికల్చర్ డిగ్రీలు లేకుండానే సుస్థిర అటవీ సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పనిచేస్తూనే అక్కడ జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పట్టు సాధించారు. ప్రస్తుతం అక్కడ కృష్ణనాల్ (కృష్ణ వటవృక్షం), చందనం, మహోగని, టేకు వంటి విలువైన వృక్షాలు సహా ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు, అంతరించిపోతున్న మొక్కల జాతులు ఉన్నాయి. సుమారు 200 జాతుల విభిన్న మొక్కలను సంరక్షిస్తున్నారామె. లెక్కకు మిక్కిలి ఔషధ మొక్కలు ఉన్నాయి. క్రమంగా అక్కడ ఏర్పాటు చేసిన సహజసిద్ధమైన కొలనులో వివిధ రకాల చేపలు జీవిస్తున్నాయి. ఉడుతలు, కోతులు, విభిన్న రకాల పాములతో పాటు నెమళ్లు, గుడ్లగూబలు సహా ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు నివసిస్తున్నాయి. దీనికి ఆమె కొల్లకాయిల్ తపోవనం అనే పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం అది ఒక జీవవైవిద్య వేదిక. ఈ అడవిని చూసేందుకు ఎవరైనా వెళ్లొచ్చు. దానికి ఆమె ప్రత్యేకంగా డబ్బులు కూడా తీసుకోరు. ఎందుకంటే పర్యావరణం అందరిదీ అని ఆమె నమ్ముతారు. ఎండకాలంలో చుట్టుపక్కల గ్రామాల్లోని బావులన్నీ ఎండిపోయినా, దేవకీ అమ్మ వనం వల్ల పరిసరాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడం విశేషం. శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఈ వనాన్ని సందర్శించి పరిశోధనలు చేస్తుంటారు.
దేవకీ అమ్మ నిశ్శబ్ద విప్లవం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఆమె సాధించిన విజయాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. ఎన్నో అవార్డులు ఆమె కృషికి ఫలితంగా లభించాయి. అందులో భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘నారీ శక్తి పురస్కారం’, కేరళ ప్రభుత్వం అందించిన ఇందిరా ప్రియదర్శిని ‘వృక్షమిత్ర’ అవార్డుతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా ఉంది. గ్లోబల్ వార్మింగ్ లాంటి వాతావరణ మార్పులతో తల్లడిల్లుతున్న ఇప్పటి తరాలకు ఆమె ఒక సజీవ దిక్సూచి. ‘మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు… కానీ స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలను ఇవ్వండి. ప్రకృతిని ప్రేమిస్తే, అది మనల్ని ప్రాణం కన్నా మిన్నగా కాపాడుతుంది’ అని చెప్పే ఆమె తన తర్వాతి నాలుగు తరాలను కూడా మొక్కల పెంపకంలో నిమగ్నం అయ్యేలా ప్రభావితం చేశారు. ఇప్పుడు ఆమె ముని మనవళ్లు, మనవరాళ్లు కూడా తపోవనంలో విత్తనాలను మొక్కలుగా చేసే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. మరి ఆమె స్ఫూర్తితో మనమూ ఒక మొక్కను నాటుదాం… రేపటి ఆకుపచ్చని భవిష్యత్తుకు బాటలు వేద్దాం!
నాకు మొక్కలు నాటడం అనేది ఒక వ్యాపకం కాదు, అది నా పునర్జన్మ. మొక్కలకు ప్రాణం పోస్తుంటే నాలో కొత్త రక్తం ప్రవహించినట్లు అనిపించింది.