పరభాష మోజులో మన తెలుగును మరిచిపోతున్న రోజులివి. కానీ, ఆ యువకుడు అలా కాదు. తన ఈడువారంతా ఉద్యోగాలు చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు అక్షరాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాడు. తన పాళీనే ఉలిగా మలిచి అక్షరాలను శిల్పాలుగా మలుస్తున్నాడు వనపర్తి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన నవకాంత్ కరిడె. 15 ఏండ్లుగా తెలుగు కాలిగ్రాఫర్‌గా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ యువకుడు బతుకమ్మతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే…
చిన్నప్పుడు సరదాగా గీసిన గీతలే నా తలరాతను నిర్ణయిస్తాయని అస్సలు అనుకోలేదు. నా చిన్నతనంలో మా చెలెళ్ల పుస్తకాలపై కొత్త కొత్త డిజైన్లతో వాళ్ల పేర్లు రాస్తుండేవాణ్ని. అది నాకెలా అలవాటు అయిందో తెలియదు. కానీ, మా నాన్న వాటిని పనికిరాని రాతలు అని దండించినా కూడా వాటిని వదలలేదు. ఆయన ఇంటికొస్తున్నప్పుడు స్కూటర్ సౌండ్ వినబడగానే హాయిగా రాసుకున్న ఆ డిజైన్లను మంచం కిందికి తోసేవాణ్ని. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చాక కూడా ఆర్ట్ మీద ఇష్టం అలాగే కొనసాగింది. ప్రతి ఆదివారం ఆర్ట్ పుస్తకాలు కొనేందుకు కోఠిలో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాళ్ల చుట్టూ తిరిగేవాణ్ని. అలా ఒకరోజు అచ్యుత్ పలావ్ రాసిన కాలిగ్రఫి పుస్తకం తారసపడింది. అది కొనుక్కొని పూర్తిగా చదివి, అందులోని అడ్రస్ పట్టుకొని ముంబై బాట పట్టాను. నాలుగు నెలలపాటు ఆయన దగ్గర శిక్షణ తీసుకొని కాలిగ్రఫీ నేర్చుకున్నాను.
ముంబైకి కాలిగ్రఫీ తెలిసిన కళే. చాలా చోట్ల కాలిగ్రఫీ ప్రదర్శనలు నిర్వహించేవారు. వాటికి నేను తప్పకుండా హాజరయ్యేవాణ్ని. ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఇతర భాషల్లో కాలిగ్రఫీ ఆర్ట్ కనిపించేవి! కానీ, తెలుగు భాషలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఆర్ట్ కూడా నాకు ఎదురుపడలేదు. నేను నేర్చుకున్న ఈ కాలిగ్రఫీని తెలుగు భాషకు సరైన గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగించాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. కోర్సు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి రాగానే ఇంగ్లిష్ కాలిగ్రఫీ నేర్చుకున్న నేను.. తెలుగు కాలిగ్రఫీలో రాణించడం మొదలు పెట్టాను. 2018లో దక్షిణ కొరియాలో నిర్వహించిన ప్రదర్శనతో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. దాదాపు వందమందికిపైగా పాల్గొన్న ఆ ప్రదర్శనలో నేను తెలుగులో వేసిన ఆర్ట్‌కు మంచి స్పందన వచ్చింది. అవకాశం వచ్చిన ప్రతిసారీ నా కళను ప్రదర్శిస్తున్నాను.
ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ కళకు విశేష ఆదరణ కనిపిస్తుంది. మన దగ్గర అంతగా లేదనే చెప్పాలి. కాలిగ్రఫీని జనానికి దగ్గర చేయడం కోసం వారు ఉపయోగించే వస్తువులనే క్యాన్వాస్గా ఎంచుకున్నాను. చపాతీలు చేసుకునే పీటలు, కప్పులు, సాసర్లు, పాకెట్ బుక్స్‌ను కాలిగ్రఫీతో ముస్తాబు చేస్తున్నాను. సినిమా టైటిల్స్, కంపెనీల పేర్లు కూడా కాలిగ్రఫీలో రాశాను. ఈ పని చాలా ఓపికగా చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఆర్ట్ వేయడానికి ఐదారు రోజులు కేటాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీటెక్ చదువుకున్న నాతోటి వాళ్లు ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. నేను మాత్రం నాకు ఇష్టమైన వృత్తిలో స్థిరపడ్డాను. ఇందులోకి అడుగుపెట్టినందుకు ఏ రోజు కూడా బాధపడలేదు. ప్రతిక్షణం కొత్తగా నేర్చుకుంటున్నాను. అందుకే నేను ఆర్ట్ మీద ఆసక్తితో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయలేదు.

ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిప్రదాత ఉన్నట్లు నాకు ఈ కాలిగ్రఫీలో అచ్యుత్ పలావ్ ఆదర్శం. ఈ కళ గురించి ఆయన సుమారు 30కి పైగా పుస్తకాలు రాశాడు. ఆయనలాగా కళ కోసం కష్టపడాలనుకుంటాను. తెలుగు కాలిగ్రఫీని పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతో పాఠశాలలు, కళాశాలల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాను. హైదరాబాద్‌లో తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినప్పుడల్లా కచ్చితంగా నా ఆర్ట్స్ గ్యాలరీ అక్కడ కొలువై ఉంటుంది. భవిష్యత్తులో తెలుగు కాలిగ్రఫీని మరింత విస్తరించాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలనే ఆలోచనతో ఉన్నా! నా సంకల్పం నెరవేరుతుందనే ఆశిస్తున్నాను.
ప్రదర్శనకు నోచుకుంది. ఈ సందర్భంగా ఇక్కడి విలేకరులు మా ఇంటికి వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది చూసి మా నాన్న ‘ఈ రాతలు ఎందుకూ పనికిరావని నిన్ను చాలా తిట్టాను. కానీ, అవే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి’ అని అన్నప్పుడు ఎంతో సంతోషించాను. ఆ సమయంలో ఏదో సాధించిన అనుభూతి కలిగింది. ‘నాడు మా పుస్తకాల్లో రాసే ఈ రోజు ఇంత స్థాయికి వచ్చావు అన్నయ్య’ అంటూ నా చెల్లెళ్లు ఇప్పటికీ సరదాగా ఆటపట్టిస్తుంటారు.
– రాజు పిల్లనగోయిన