సర్కార్ నౌకరి రాలేదని దిగులు చెందలేదు..మరో ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు. తనకున్న భూమిని నమ్ముకున్నాడు. ఇప్పుడు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతనే రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏండ్ల యువరైతు మూడావత్ శక్రునాయక్. తాను గెలవడమే కాదు.. తన బాటలో నడవడానికి సిద్ధపడిన యువరైతులకు గురువయ్యాడు. పట్టు సాగులో పట్టువిడుపులు విడమరచి చెబుతున్నాడు. ఆ యువరైతు విజయగాథ ఆయన మాటల్లోనే..
మాది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండా. అమ్మానాన్నలిద్దరూ వ్యవసాయం చేస్తుంటారు. మాకున్న ఆరెకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. డిగ్రీ పూర్తయ్యాక నేను ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించాను. రెండుసార్లు విఫలమయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం నాకు రాదని భావించి ఓ ప్రైవేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాను. హైదరాబాద్ నుంచి మా ఊరు దగ్గరే! ప్రతి ఆదివారం ఊరికి వెళ్తుండేవాణ్ని. అమానాన్నలకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేవాణ్ని. చిన్నప్పటినుంచి వ్యవసాయం అంటే ఆసక్తి కూడా ఉంది.
రోజులు ఇలా సాగుతుండగా.. నా స్నేహితుడు పట్టు పురుగుల పెంపకం గురించి చెబితే విన్నాను. సాగు పద్ధతులు తెలుసుకుందామని స్థానిక సెరికల్చర్ అధికారిని సంప్రదించాను. ఆయనతో భేటీ తర్వాత నేను పట్టు పురుగుల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చేశాను. మాకున్న పొలంలో రెండు ఎకరాల్లో పట్టు సాగు చేస్తానని ఇంట్లోవాళ్లకు చెప్పాను. ‘చక్కగా ఉద్యోగం చేసుకోక, ఈ కష్టం ఎందుకు బిడ్డా!’ అన్నాడు నాన్న. నేను పట్టు వదల్లేదు. చివరికి ఒప్పుకొన్నారు.
సాగు విధానాలు చూసి మా ఇంట్లోవాళ్లే కాదు, ఊర్లో వాళ్లూ వింతగా చూశారు. ఎన్నడూ వేయని పంట, తేడా కొడితే అప్పుల పాలవుతావని హెచ్చరించారు. అప్పటికే నేను రూ.10 లక్షలతో మల్బరీ షెడ్ నిర్మాణం చేశాను. ప్రభుత్వ సబ్సిడీ వచ్చినప్పటికీ, నా పెట్టుబడి అంతా అప్పు చేసి తెచ్చిందే! చూస్తుండగానే పంట చేతికొచ్చింది. అవగాహన లేకపోవడం వల్ల మొదటి రెండు పంటల్లోనూ కొంత నష్టమే వచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. ఈ రంగంలో ఎలాగైనా కొనసాగాలని కష్టాన్ని నమ్ముకున్నా! తర్వాత మెల్లమెల్లగా లాభాలు మొదలయ్యాయి. సెరికల్చర్ అధికారుల సూచనతో సాగుబడి పట్టాలెక్కింది.
2018లో మొదలైన పట్టుసాగు కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా.. తర్వాత లాభాలవైపు మళ్లింది. మొదట్లో నన్ను చూసి నవ్విన వాళ్లంతా తర్వాత నా ఆదాయం చూసి పట్టు పురుగుల పెంపకం తాము కూడా చేస్తామని ముందుకొచ్చారు. 21 రోజులకు ఒకటి చొప్పున ఏడాదికి దాదాపు 12 పంటలు తీస్తున్నాను. తెచ్చిన అప్పులన్నీ తీర్చేశాను. ప్రస్తుతం 40మంది రైతులకు పంట గురించి చెప్పి వారితో కూడా పట్టుపురుగుల సాగు వేయించాను. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనల కోసం మా పొలానికి వస్తుంటారు.
వారందరికి సాగు పద్ధతుల గురించి వివరించడం చాలా ఆనందంగా ఉంటుంది. దానితోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం పట్టు పెంపకం పై అవగాహన కల్పించాలని మా ఊరిలోనే ఓ సెరికల్చర్ రీసోర్స్ సెంటర్‌ను నిర్మిస్తున్నది. ఇప్పటివరకు రైతులు, విద్యార్థులు, యువకులు ఎంతోమందికి పట్టు సాగుపై అవగాహన కల్పించాను. ‘నీ వల్లనే పట్టుసాగు చేస్తూ అప్పులు లేకుండా ఆనందంగా బతుకుతున్నాం’ అని వాళ్లు అన్నప్పుడల్లా ఈ జన్మకు ఇంకేం కావాలనే ఫీలింగ్ వస్తుంది. అమ్మానాన్నలు సైతం పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించేందుకు పట్టు సాగు ఉత్తమమైన మార్గం. ఉద్యోగాల కోసం ఒకరి దగ్గర చేయి చాచడం కన్నా.. మన భూమిలో మనకు నచ్చినట్టు పనిచేసుకుంటూ జీవించాలనేది నా అభిప్రాయం. సెరికల్చర్‌లో రాణిస్తున్నందుకు గాను ఇటీవలే ఉత్తమ యువ రైతు అవార్డు కూడా అందుకున్నాను. భూమిని నమ్ముకున్నందుకు ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. వ్యవసాయానికి దూరమవుతున్న ఈ తరానికి వినూత్న పద్ధతుల్లో సాగు వివరాలు అందించేందుకు నేను సదా సిద్ధం.
– రాజు పిల్లనగోయిన