చదివింది బీటెక్ అయినా.. తయారీ రంగంపై ఆమెకు ఆసక్తి . అదే ఆమెను ఐఐటీ మద్రాస్ వైపు అడుగులు వేయించింది. చదివిన కోర్సుకు భిన్నమైన రంగంలో అడుగుపెట్టి… లోతైన పరిజ్ఞానాన్ని పెంచుకునేలా ప్రోత్సహించింది. పక్షవాత రోగుల కండరాల పనితీరును అంచనా వేసే డివైజ్‌ను ఆవిష్కరించే స్థాయికి చేర్చింది. ‘స్టార్టూన్ ల్యాబ్స్’ సహ వ్యవస్థాపకురాలు మైత్రేయి కొండపి ‘స్టార్టప్ స్టోరీ’ ఆమె మాటల్లోనే..
పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. బీటెక్ కూడా ఇక్కడే చదివాను. మధ్యతరగతి కుటుంబం. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా నమూనా ఉత్పత్తులు డిజైన్ చేసిన అనుభవం ఉంది. ఆ ఆసక్తితో మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీలో ఎంఎస్ చేయాలనుకున్నాను. ఐఐటీ మద్రాస్‌లో చేరాను. అక్కడే వైద్య ఉపకరణాల తయారీలో శిక్షణ పొందాను. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే ఇన్సులిన్ డివైజ్‌పై పనిచేశాను. వ్యాపారపరంగా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్ తయారు చేయాలనే సంకల్పంతో ‘స్టార్టూన్ ల్యాబ్’ మొదలుపెట్టాం. సురేష్ ఐఐటీలో నా బ్యాచ్‌మేట్. మనసులే కాదు, బయో మెడికల్ రంగంపై ఇద్దరి అభిరుచులూ కలిశాయి. దీంతో సోల్మేట్స్గా మారాం. కంపెనీ ప్రారంభానికి ముందు.. కనీసం మూడేండ్లు ఈ రంగంపై అధ్యయనం చేశాం. వైద్యులతో సంప్రదింపులు జరిపాం. కొంత పరిశోధన తర్వాత
ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభించాం. ముడి పరికరాల సేకరణ నుంచి ప్రోటోటైప్ డిజైన్ వరకు అన్నీ కలిసే చేశాం. ఆ తర్వాత ఫిజియోథెరపీ అసెస్మెంట్ పరికరాన్ని తీసుకొచ్చాం. మార్కెట్లో ఈ తరహా డివైజ్‌లకు డిమాండ్ ఉండటంతో నగరంలోని ప్రైవేటు హాస్పిటల్స్, ఫిజియోథెరపీ సెంటర్లకు సరఫరా చేస్తున్నాం. ఇదే తరహాలో న్యూరో, కార్డియో, పోస్ట్ సిజేరియన్ ఫిజియో థెరపీ అవసరాలకు అనుగుణంగా ఓ డివైజ్ అభివృద్ధి చేశాం.
ఆలోచన అయితే ఉంది కానీ, కార్యరూపంలో తీసుకురావాలంటే ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరి. మెంటరింగ్ ఉండాల్సిందే. వీ హబ్, టీహబ్, జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సాయంతో ఇవన్నీ పొందగలిగాం. తెలంగాణ ప్రభుత్వం పటాన్ చెరులోని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేయడంతో… సర్కారు సహకారంతో విజయవంతంగా తుది ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చాం. ఆర్థో, న్యూరో, స్పైనల్ కార్డ్ అసెస్మెంట్ డివైజ్‌లకు విదేశాల్లో గిరాకీ ఉంది. మా దగ్గర అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ఎఫ్‌డీఏ అనుమతులకు లోబడి పరికరాల రూపకల్పన జరుగుతున్నది. రానున్న రోజుల్లో మహిళలు, వృద్ధులు, క్రీడాకారుల ఆరోగ్యాన్ని అంచనా వేసే పరికరాలను రూపొందిస్తాం.
వైద్య రంగంలో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తయారీతో దశ మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఆంత్రప్రెన్యూర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికీ మనం 70 శాతానికి పైగా వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. వైద్య సేవలు విస్తరిస్తున్న క్రమంలో ఆధునిక టెక్నాలజీకి ఆదరణ పెరుగుతున్నది. మరో రెండేండ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ డివైజ్‌లను అందించే స్థాయికి చేరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మహిళలు ఆంత్రప్రెన్యూర్స్‌గా రాణించడానికి అవసరమైన వాతావరణం హైదరాబాద్‌లో పుష్కలంగా ఉంది. స్టార్టప్స్ తరఫున సీఎం
కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
మేం రూపొందించిన డివైజ్‌ను శరీరానికి తగిలించుకుని ఫిజియోథెరపీ చేస్తే.. కండరాల పనితీరు, కీళ్ల్ల కదలికలు, రక్త ప్రసరణ తీరును రికార్డు చేసి.. మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ఆ వివరాల ఆధారంగా వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితిని, శారీరక కదలికలను పక్కాగా అంచనా వేసే ఆస్కారం ఉంటుంది. తదుపరి చికిత్సపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం అవుతుంది. పెరాలసిస్ రోగులు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు కూడా ఫిజియోథెరపీ పొందేలా మా పరికరాన్ని అప్‌గ్రేడ్ చేయగలిగాం.
– మైత్రేయి కొండపి startoonlabs.com
…? కడార్ల కిరణ్