Aqsa Fulara | పుట్టిన ఊరే ప్రపంచంగా పెరిగిందామె. పుస్తకాల్లోనే బయట ప్రపంచాన్ని చదివింది. సుదూరాల్లోని అవకాశాలు అందుకోవాలని కలలు కన్నది. కట్టుబాట్లు వద్దన్నా, ఆడపిల్ల అని ఎందరు వెనక్కి లాగినా వినలేదు. అమెరికా చేరింది. ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. గూగుల్ గూటిలో అడుగుపెట్టింది. ఎన్నెన్నో అద్భుతాలు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో సత్తా చాటింది. తన మేధస్సే పెట్టుబడిగా ‘ప్రొడక్ట్ మేనేజర్ అవార్డ్ 2024’ గెలిచింది అక్సా ఫులారా!
మహారాష్ట్రలో సాంగ్లీ అనే పట్టణంలో పుట్టింది అక్సా ఫులారా. దిగువ మధ్య తరగతి కుటుంబంలోని పిల్లలు పెద్దగా చదువుకోవాలంటే ఎన్ని ఆటంకాలను ఎదుర్కోవాలో అన్నిటినీ ఆమె ఎదుర్కొంది. కానీ, తన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు. అందుకే ఆమె ప్రయాణమూ ఆగలేదు. అక్షరాభ్యాసం నుంచి ఇంజినీరింగ్ దాకా సాంగ్లీలోనే సాగింది. ఆపై పెద్ద చదువులు చదవాలని అక్సా కోరిక. కానీ, ఆమె కుటుంబం అందుకు అంగీకరించలేదు. సంప్రదాయ ముస్లిం కుటుంబాల్లో ఉండే కట్టుబాట్ల వల్ల ఆమెను చదివించేందుకు పెద్దలు సంశయించారు. ఆ పరిస్థితుల్లో ఒంటరిగా విదేశాలకు వెళ్తానని ఇంట్లోవాళ్లతో చెప్పింది.
“డేటాను పంచుకునే సందర్భాల్లో వచ్చే సమస్యలను గుర్తించడం, వాటికి సరైన పరిష్కారాలను రూపకల్పన చేయడంలో ఎంతో కష్టపడ్డాను. అందుకు తగ్గ సంతృప్తి కూడా దక్కింది” అని చెబుతున్నది అక్సా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసుల్ని భవిష్యత్‌లో అత్యంత పారదర్శకంగా, పర్సనలైజ్డ్గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమంటున్నది. ఆన్లైన్లో పనులు చక్కదిద్దుకునేందుకు మరో డేటా విప్లవం వస్తుందనీ చెబుతున్నది అక్సా.
సాధించాలనే పట్టుదలతో ఇంటా బయటా గెలిచి అమెరికా చేరింది అక్సా. యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్ డిగ్రీలో చేరింది. అది పూర్తి కాగానే ఇంటిబాట పట్టకుండా ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో శిక్షణ పొందింది. ఆ వెంటనే గూగుల్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఏడేండ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల్లో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఎన్నో నూతన పద్ధతులు వచ్చాయి. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తూ గూగుల్ కంపెనీని విజయపథంలో నడపడంలో ఆమె కూడా భాగస్వామి అయింది. సాంకేతిక రంగంలో ఆమెకున్న ఆసక్తిని గుర్తించిన గూగుల్ కంపెనీ.. అక్సాకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తూ ప్రోత్సహించింది.
ఏడేండ్ల కిందట గూగుల్ కంపెనీలో టెక్నికల్ కన్సల్టెంట్ విధుల్లో చేరింది అక్సా. గూగుల్ యాప్స్ రూపకల్పన కోసం పనిచేసింది. కంపెనీల అవసరాల కోసం గూగుల్ సేవలను రూపొందించే బాధ్యతను ఆమెకు అప్పగించింది. ఆ సందర్భంలో కస్టమర్ల అవసరాలను అధ్యయనం చేయడంలో ఆమె పట్టుదలతో పనిచేసింది. సాంకేతిక రంగంలో ఉండే సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేసి కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రొడక్ట్‌లను రూపొందించడంలో ఆమె నాయకత్వం ఉపయోగపడింది. కార్పొరేట్ అవసరాలు తీర్చే ప్రొడక్ట్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగించడంలో మంచి నేర్పరిగా ఆమె ప్రశంసలు అందుకుంది. వైజ్ఞానిక పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి కోసం కృషి చేసేవాళ్లలో 37 శాతం మాత్రమే మహిళలు ఉంటున్నారు. ఇందులోనే కాదు గ్రాడ్యుయేట్స్‌కి ఉండే ఇంటర్న్‌షిప్ అవకాశాల్లోనూ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. అవకాశాల్లో మహిళలకు ఎక్కువ ఆటంకాలు ఉన్న టెక్నాలజీ రంగంలో అక్సా ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధారణమైన విషయం కాదు.
గూగుల్ ఉత్పత్తులైన వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో రూపకల్పనలో అక్సా ప్రధాన పాత్ర పోషించింది. కలిసి పనిచేసేందుకు వివిధ రకాల ఫైల్స్‌ని పంచుకునేలా, ఆన్లైన్ వేదికగా కలిసి పనిచేసేందుకు గూగుల్ ఉత్పత్తుల తయారీ ఆమె నాయకత్వంలో జరిగింది. ‘డేటాను పంచుకునే సందర్భాల్లో వచ్చే సమస్యలను గుర్తించడం, వాటికి సరైన పరిష్కారాలను రూపకల్పన చేయడంలో ఎంతో కష్టపడ్డాను. అందుకు తగ్గ సంతృప్తి కూడా దక్కింద’ని చెబుతున్నది అక్సా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసుల్ని భవిష్యత్‌లో అత్యంత పారదర్శకంగా, పర్సనలైజ్డ్గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమంటున్నది ఆమె.
ఆన్లైన్లో పనులు చక్కదిద్దుకునేందుకు మరో డేటా విప్లవం వస్తుందనీ, పదేండ్లలో ఆ లక్ష్యాన్నీ చేరుకుంటామని చెబుతున్నది అక్సా. అప్లికేషన్ల రూపకల్పన, కంటెంట్ మేనేజ్మెంట్లో ఆమె నాయకత్వంలో గూగుల్ కంపెనీ పలు ఆవిష్కరణలు చేసింది. ఈ ఆవిష్కరణలకు గాను కంపెనీలో గుర్తింపే కాదు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రంగంలోనూ ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ‘ప్రొడక్ట్స్ దట్ కౌంట్’ ప్రదానం చేసే ‘ప్రొడక్ట్ మేనేజర్ అవార్డ్స్ 2024’ గెలుచుకుంది. ఇంట్లో సామాజిక కట్టుబాట్లు, బయట మహిళలకు ఆటంకాలు ఉన్న రోజుల్లో వాటిని లక్ష్యపెట్టకుండా తన లక్ష్యంవైపే పయనించి అక్సా అద్భుతమైన విజయం సాధించింది. మరెందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.