ఆమె పుట్టింటి చిరునామా కూచిపూడి. ప్రఖ్యాత కూచిపూడి కళాకారులు రాజారెడ్డి గారాలపట్టి యామిని రెడ్డి. బుడిబుడి అడుగుల నాడే జతులు నేర్చింది. ముద్రలు తనకు వెన్నతో పెట్టిన విద్య. వారసత్వంగా నాట్యకళలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రయోగాలతో కూచిపూడికి ఆదరణ తెస్తున్నది. హిందుస్థానీ రాగాలపై కూచిపూడిలో నర్తించి ఉత్తరాదినీ మెప్పిస్తున్నది. సౌరమండల విశేషాలు మేళవించి ‘సూర్య త్వం సూర్య ప్రణమామ్యహం’తో రంగస్థలంపై వైజ్ఞానిక ప్రదర్శన గావించింది. కూచిపూడిని ఎల్లలు దాటించడమే కాదు, ఈ నాట్యకళను నేటి తరానికి చేరువ చేయడానికి ప్రయోగాలు అవసరమే అంటున్న యామిని రెడ్డి జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
త్యాగయ్య, అన్నమయ్య రాసిన కీర్తనలు వాళ్ల కాలానికి కొత్తవి. అవి ఓ ప్రయోగం. ఈ రోజుల్లో వస్తున్న కథల్లో భాష వేరు. ప్రాచీన రచనలు, పాతకథల్లో భాష వేరుగా ఉంది. కాలానుగుణంగా భాష అనేక మార్పులకు లోనవుతుంది. సాహిత్యం, నాటకం కాలానికి తగినట్టుగా కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. కానీ, తరతరాల కూచిపూడి.. ఈ తరం కోసం ఏమన్నా మారిందా? మాకంటే ముందున్న కూచిపూడి కళాకారులు ఎన్నో ఏండ్ల నుంచి అవే ప్రదర్శిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నా. అందంగా ఉన్నాయి. కానీ, కొత్తదనం లేదనిపించింది. కొత్త తరం కోసం మార్పును ఆహ్వానించాలి అనిపించింది.

కొత్త ప్రయోగాలు చేయాలనిపించే వయసు నాది. ఈ కాలానికి తగ్గట్టు కూచిపూడిని కొత్తగా చూపించాలనుకున్నాను. దాని కోసం ఏం చేయగలుగుతామని ఆలోచించాను. కూచిపూడి నా భాష. ఆ భాషలో కొత్తదనమే.. వైజ్ఞానికమైన ఆలోచనలతో రూపొందిన ‘సూర్య త్వం సూర్య ప్రణమామ్యహం’ ప్రయోగం. సౌర వ్యవస్థ గురించి మనమంతా చదువుకున్నాం. మన పురాణ గ్రంథాల్లోని నవగ్రహాల ప్రస్తావనలున్నాయి. ఈ తరం కోసం.. కూచిపూడి ప్రదర్శన ద్వారా నవగ్రహాలకు సూర్యుడు కేంద్రమని, ప్రకృతికి వెలుగు సూర్యుడేనని, ఈ వెలుగు లేకుంటే ఈ ప్రకృతి అందాలు చూడలేమని, మన జీవితమూ లేదని చెప్పాం. దీనికి నేనే కొరియోగ్రఫీ చేశాను. పాతికమంది కళాకారులతో అద్భుతంగా ప్రదర్శించాం!
చిన్నప్పుడు మా అమ్మానాన్న హిందుస్థానీ స్వరాలకు కూచిపూడి ప్రదర్శనలు చేశారు. పండిట్ రవిశంకర్ స్వరకల్పనకు ఓ ప్రదర్శన ఇచ్చారు. అమ్మానాన్న చేసే ఇలాంటి ప్రయోగాల్లో నేనూ చేరాను. అవన్నీ పది నిమిషాలు, పదిహేను నిమిషాల ప్రదర్శనలే. పూర్తి స్థాయి ప్రదర్శన జరగలేదు. గతేడాది ఆగస్టులో ఓ అడుగు ముందుకేసి ఢిల్లీ వేదికపై ‘కూచిపూడి కీ షామ్ హిందుస్థానీ కే నామ్’ పేరిట ఓ ప్రదర్శన ఇచ్చాను. ఇదో ప్రయోగం. హిందుస్థానీ స్వరకల్పనకు కూచిపూడి నృత్యం చేస్తే.. కూచిపూడి అందం ఉంటుందా, పోతుందా? అని సందేహం వచ్చింది. కానీ, హిందుస్థానీ రాగంపై కూచిపూడి ప్రదర్శనను గంటన్నరపాటు ఆహుతులంతా ఆస్వాదించారు. రెండు మహానదులు సంగమించినట్టు అనిపించిందని చాలామంది అన్నారు. సంగీతం, నాట్యం రెండూ బాగా సరిపోయాయని అందరూ మెచ్చుకున్నారు. దీంతో కూచిపూడిని ఇతర ప్రాంతాలకూ పరిచయం చేయొచ్చని అర్థమైంది.
ఢిల్లీలో కూచిపూడి నేర్చుకునేవాళ్లలో కొంతమంది వాళ్ల పిల్లలకు హిందుస్థానీ ట్యూన్స్‌తో కొంతైనా నేర్పమని కోరారు. కూచిపూడికి కర్ణాటక సంగీతం ఆత్మ. ఈ సంగీతానికి భాష తెలుగు, తమిళం, సంస్కృతాలు. నార్త్ ఇండియాలో కూచిపూడికి ప్రాచుర్యం తీసుకురావాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో ప్రదర్శన చేయాలి అనిపించింది. అప్పుడే ఈ కళకు మరింత ఆదరణ దక్కుతుంది. కూచిపూడి కళాకారులకు కర్ణాటక సంగీతం తెలిసి ఉండటం అవసరమని మా అమ్మలు రాధా రెడ్డి, కౌలస్యా రెడ్డి చెప్పారు. ఢిల్లీలో కూచిపూడి నేర్చుకుంటూనే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాను. నేను ఢిల్లీలో పుట్టి, పెరిగాను కాబట్టి హిందుస్థానీ సంగీతంపై అవగాహన ఉంది.
మా పేరెంట్స్ ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల రెండిటినీ ఎలా మేళవిస్తారో చూశాను. ఆ అనుభవంతోనే హిందుస్థానీ రాగాలకు కూచిపూడి నృత్యార్చన చేశాను. హిందుస్థానీ గాయకురాలు అదితి శర్మ గార్గ్ గాత్ర దానం చేశారు. ఈ ప్రదర్శన కోసం హిందుస్థానీ దృపద్ ఎంచుకున్నాను. దీనిలో రిథమ్ ఎక్కువగా ఉంటుంది. కూచిపూడికి అనువుగా ఉంటుంది. ఇందులో గమకాలు అధికంగా ఉంటాయి. అదితి మాతో ఇరవై ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నది. తనకు కూడా కూచిపూడిపై అవగాహన ఉంది. హిందుస్థానీ రాగాలే అయినా.. తాళం, జతులు కూచిపూడికి సరిపోయేలా సిద్ధం చేశాం. ఇలా నాట్యానికి తగ్గట్టుగా గీతాన్ని తీర్చిదిద్దాం. ఈ మేళవింపు అందరి ప్రశంసలూ అందుకుంది.

కూచిపూడిని కెరీర్‌గా ఎంచుకోవద్దని అమ్మ చెప్పేది. ఆర్టిస్ట్ జీవితంలో చాలా పోరాటం ఉంటుంది. అది వాళ్లకు అనుభవం. కాబట్టి తన పిల్లలకు ఆ కష్టాలు వద్దనుకుంది. ఉద్యోగమైతే భద్రత ఉంటుందని చెప్పింది. నేను డాక్టర్ కావాలని అమ్మ కోరుకునేది. బయాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. బైపీసీలో చేరాలని అనుకున్నా. మెడిసిన్ చదివితే నాట్యానికి దూరమవుతానని భయపడ్డా. అందుకే కామర్స్ తీసుకున్నా. కామర్స్ చదువుతూ కూచిపూడి నేర్చుకున్నా. అమ్మ చదువుకోవాలని చెప్పేది. తనను సంతోష పెట్టడానికే ఎంబీఏ ఫైనాన్స్‌లో చేరాను. చదువు అయిపోగానే జాబ్ చేయనని చెప్పాను. డ్యాన్సే నా కెరీర్ అన్నాను. ‘సరే నీ ఇష్ట’మన్నారు.
మా అత్త గారిది హైదరాబాద్. బిజినెస్ ఫ్యామిలీ. పెళ్లి నాటికే డ్యాన్స్ కెరీర్లో బిజీగా ఉన్నాను. ఇక్కడంతా కొత్త. ఏం చేయాలో అర్థమవ్వలేదు. డ్యాన్స్ నాకు ఎంత ఇష్టమో మా ఆయనకు కూడా అంతే ఇష్టం. నా ఇష్టానికి సపోర్ట్‌గా ఉన్నారు. ‘నువ్వు చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టుకో. నలుగురికి డ్యాన్స్ నేర్పించవచ్చు. బిజీగా ఉంటావు. సంతోషంగానూ ఉంటావు’ అని మా ఆయన సలహా ఇచ్చారు. ఇంట్లోనే కూచిపూడి శిక్షణ మొదలుపెట్టాను. నలుగురు స్టూడెంట్స్‌తో నా ‘నాట్య తరంగిణి’ మొదలైంది.
కూచిపూడి సాధనలో తరాల అంతరం ఉంది. మా పేరెంట్స్ చేసినంత మేం చేయలేదు. మేం చేసినంత మా స్టూడెంట్స్ చేయట్లేదు. జీవితం షార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా వచ్చాక అన్నీ తొందరగా నేర్చుకోవాలనుకుంటున్నారు. తొందరగా స్టేజ్ ఎక్కాలని ఆరాటపడుతున్నారు. ఈ రోజుల్లో చిన్న వయసులో రంగ ప్రవేశం చేస్తున్న పిల్లల్లో ఎంతోమందిలో ప్రావీణ్యం లేదు. తల్లిదండ్రుల ఆరాటమే ఉంది. పిల్లల్ని కొంచెం నేర్చుకోనివ్వండి. కూచిపూడి అంత తొందరగా రాదు. అందులో ప్రావీణ్యం సాధించాలంటే సాధన ఒక్కటే మార్గం.
– నాగవర్ధన్ రాయల