ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్‌కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. అలా ఉభయ తారకంగా ప్రస్థానం కొనసాగిస్తున్నది పదిహేనేళ్ల చిన్నారి అనన్య పర్సా. అమెరికాలో చదువులో రాణిస్తూనే, కూచిపూడి నృత్యాభినయంతో కళకు అభివాదం చేస్తున్నది. ప్రవాసంలో ఏడేళ్లపాటు నేర్చుకున్న నృత్యరీతుల్ని మన హైదరాబాద్ రవీంద్రభారతిపై జైత్రయాత్రలా ప్రదర్శించిన అనన్య అంతరంగం ఆమె మాటల్లోనే..
నాకు మూడేళ్ల వయసులో భారత్ నుంచి అమెరికా వెళ్లాం. అక్కడ నార్త్ కరోలినాలో ఉంటున్నాం. అమ్మ నీతా, నాన్న అవినాశ్ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్నప్పుడు పాటలు వినిపిస్తే డ్యాన్స్ చేసేదాన్ని. నా ఆసక్తిని గమనించి, అమ్మ కూచిపూడి ఇన్స్టిట్యూట్లో చేర్పించింది. కూచిపూడి గురువు కుబేరిణి గారు నాతో తొలి అడుగులు వేయించారు. అలా ఏడేళ్ల వయసులో మొదలైన నా ప్రయాణం రంగప్రవేశం వరకు ఆసక్తిగా సాగిపోయింది.
చిన్నప్పటినుంచి నాకు కళలంటే ఇష్టం. బొమ్మలు గీయడం, పాడటం, డ్యాన్స్ బాగా ఇష్టం. ఇప్పటికీ ఇంట్లో ఇవన్నీ చేస్తుంటాను. నేను చదువుకునే స్కూల్లో వెస్ట్రన్ డ్యాన్స్‌తోపాటు చాలా అంశాలు ఉంటాయి. అయినా.. కూచిపూడి నేర్చుకోవాలి అనిపించింది. మనసు పెట్టి నేర్చుకున్నా. స్కూల్ అయిపోయిన తర్వాత కూచిపూడి ఇన్స్టిట్యూట్కి వెళ్తాను. ‘కూచిపూడి నృత్యకారిణిగా కాదు.. నాట్య ప్రదర్శకురాలిగా ఎదగాలి’ అని మా గురువు కుబేరిణి గారు పదేపదే చెప్పేవారు. ఆమె నేర్పించిన భంగిమలు, ముద్రలు, హావభావాలను నేర్చుకునేందుకు చాలానే కష్టపడ్డాను.
శోభానాయుడు గారు, మరికొందరు లబ్ధప్రతిష్ఠులైన కళాకారుల ప్రదర్శనల వీడియోలు చూస్తూ సాధన చేసేదాన్ని. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయడమే తెలుసు. స్కూల్లో, ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చినా, ప్రాక్టీస్ చేసినా నా ప్రదర్శన పూర్తిస్థాయిలో ఉండేలా ప్రయత్నించేదాన్ని. ఆ తర్వాత దాని ఫలితం కోసం ఎదురుచూడను. నేను చదివే స్కూల్లో, తెలుగు అసోసియేషన్ సభల్లో, ఫెస్టివల్స్‌లో కూచిపూడి నృత్యం ప్రదర్శించేదాన్ని. మా టీచర్లకు, ఫ్రెండ్స్‌కి ఆ ఫొటోలు చూపిస్తే.. అభినందించడమే కాదు అభిమానించేవాళ్లు.
కూచిపూడితోపాటు నాకు హైదరాబాద్ ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు సిటీ అంతా చుట్టేస్తాను. హిస్టారికల్ ప్లేసెస్ చూస్తాను. వాటి చరిత్ర తెలుసుకుంటాను. హైదరాబాదీ ఫుడ్ చాలా ఇష్టం. ఉన్నన్ని రోజులూ వాటిని తింటూ హ్యాపీగా గడిపేస్తాను.
మా అమ్మ కూడా కూచిపూడి నేర్చుకుంది. ఎనిమిదేళ్లు కష్టపడి నేర్చుకున్నా తాను రంగప్రవేశం చేయలేదు. నేను చేయగలిగాను. చదువు, పెళ్లి, ఉద్యోగం వల్ల అమ్మ కూచిపూడి నృత్యం వదిలేసింది. నేను నేర్చుకున్న తర్వాత అమ్మకు నేర్పడం మొదలుపెట్టాను. అమ్మ మళ్లీ నేర్చుకుంటానంటున్నది. మా అమ్మకు నేనే టీచర్!
నాకు క్రియేటివ్ ఫీల్డ్ ఇష్టం. డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్ ఇష్టపడతాను. కెరీర్ కూడా అలాగే ఉండాలనుకుంటాను. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, ఇంజినీరింగ్ నాకు ఇష్టమైన పనులు. నా ఎదుగుదలతోపాటే నా కోరికలు మారుతున్నాయి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ కావాలని ఉంది. కూచిపూడి రంగప్రవేశం కోసం ఏడాదిన్నర క్రితం ప్రణాళిక చేసుకున్నాను. రెగ్యులర్ టైమ్ కన్నా ఎక్కువ సమయం సాధన చేస్తూ వచ్చాను. అంత కష్టపడినందుకు విజయవంతంగా ప్రదర్శన ఇవ్వగలిగాను. మరింత నేర్చుకోవాల్సి ఉంది. మరిన్ని ప్రదర్శనలు ఇస్తాను. శాస్త్రీయ నృత్యం, సంగీతంలోనే నా మూలాలు ఉన్నాయనిపిస్తుంది. దూరదేశంలో ఉన్న నన్ను భారతదేశంతో కనెక్ట్ చేసింది కూచిపూడి నృత్యమే! రేపు ఏ వృత్తిలో ఉన్నా.. కూచిపూడి నృత్యం మాత్రం కొనసాగిస్తాను. ఎందుకంటే, మన మూలాలు వదులుకోవద్దు కదా!!
– నాగవర్ధన్ రాయల