 
                                                            చిన్నప్పటి నుంచి ఆమె చదువుల్లో నేర్పరి. నిరంతరం పుస్తకాలతో దోస్తీ చేస్తూనే… తన తండ్రి పడే కష్టాన్నీ గమనించింది. పండిన టమాటాలను ధర లేక పొలంలోనే వదిలేసిన తల్లిదండ్రుల దైన్యాన్నీ చూసింది. ఆ కష్టాలను మనసులోనే దాచుకొని.. ఉన్నతంగా చదువుకుంది. కార్పొరేట్ కొలువు సాధించింది. కానీ, ఆమెకు కావాల్సింది ఇది కాదు. అందుకే, ఉద్యోగాన్ని వదిలేసి స్టార్టప్ ప్రారంభించింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి కీర్తిప్రియ. 2018లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి.. కాయగూరలతో ఒరుగులు, పొడులు తయారు చేయడం మొదలుపెట్టింది. స్థానిక రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, వినియోగదారులకు సేంద్రియ ఉత్పత్తులను అందిస్తున్న ‘కోహ్ ఫుడ్స్’ వ్యవస్థాపకురాలు కీర్తిప్రియ సక్సెస్ స్టోరీ ఇది..
కీర్తి ప్రియది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి వెంకన్న కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. సొంతూరులో ఆరెకరాల సాగుభూమిలో వ్యవసాయం చేసేవారు. వరితోపాటు కూరగాయలు వేసేవారు. కీర్తి తల్లి విజయలక్ష్మి వ్యవసాయం చూసుకునేది. కీర్తి కోదాడ, వరంగల్‌లో ఇంటర్ వరకు చదివింది. తర్వాత బిట్స్ పిలానీలో బీఫార్మసీ, ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ పూర్తి చేసింది. మంచి ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగం సాధించింది. మంచి ఉద్యోగం లభించినా.. తాను కోరుకున్న జీవితం ఇది కాదు అనిపించింది ఆమెకు. చిన్నప్పుడు సాగులో తన తండ్రికి ఎదురైన చేదు అనుభవాలు ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. టమాటాలకు ధర లేక కోత కోయకుండానే వదిలేసిన తండ్రి దుఃఖం ఆమెను వెంటాడింది. తాను చదువుకునే రోజుల్లో తల్లి పంపించిన ఒరుగులు, పొడులను గుర్తు చేసుకుంటూ… వాటినే ఎందుకు తయారు చేయకూడదని ఆలోచన చేసింది. దాన్ని అమలు చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించింది కీర్తి.

Koh Foods Keerthi Priya
ఎంబీఏ చదివిన కీర్తికి వ్యాపార మెలకువలు కొట్టిన పిండి. ఆ ధైర్యంతోనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2018లో ఈ వ్యాపారం మొదలుపెట్టింది. తొలుత లక్ష రూపాయల వ్యయంతో సోలార్ డ్రయర్ కొనుగోలు చేసింది. తొలినాళ్లలో ఒడుదొడుకులు ఎదురైనా కుటుంబం సహకారంతో నిలబడింది. అంచెలంచెలుగా ఎదిగి 2021లో నట్స్ అండ్ ఫీల్డ్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసింది. 2022లో ‘కోహ్ ఫుడ్స్’ సంస్థను స్థాపించి సేంద్రియ పద్ధతుల్లో పండించిన రకరకాల పంటలతో ఒరుగులు, పొడులు, టీ పొడి తయారు చేస్తూ.. తన కలను సాకారం చేసుకున్నది.

తొండ గ్రామానికి పదిహేను కిలోమీటర్ల పరిధిలోని రైతులను కలిసి ఎలాంటి ఎరువులు, మందులు వేయకుండా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసేలా ప్రోత్సహించింది కీర్తి. అలా రైతులు సాగు చేసిన పంటను బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది. టమాటాలు, బీట్రూట్, క్యారెట్, బెండకాయలు, మునగ, పాలకూర ఇలా 15 రకాలను సేకరించి, వాటిని ఒరుగులుగా, పొడులుగా తయారు చేసి ‘కోహ్ ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నది. అరటి పూతతో టీ పొడి తయారు చేస్తున్నది. కీర్తిప్రియ తన స్టార్టప్‌తో రైతులకు మేలు చేయడంతోపాటు 25 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించింది.

‘2022లో ‘కోహ్ ఫుడ్స్’ ప్రొడక్షన్ ప్రారంభించాను. 20 లక్షల టర్నోవర్‌తో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు కోటి రూపాయలకు చేరింది. ఈ ఏడాది రెండు కోట్లు టార్గెట్ పెట్టుకున్నాను. ఇది నా సొంత ఆలోచన కాదు. ఇప్పుడు మనం మర్చిపోయాం కానీ, సీజనల్ కాయగూరలతో ఒరుగులు పెట్టడం ఒకప్పుడు ఇంటింటా కనిపించేది. మా అమ్మ నాకు పంపిన ఒరుగులు, పొడులే నా ఆలోచనకు కారణమైంది. కోహ్ ఫుడ్స్ ద్వారా రైతులకు మద్దతుగా నిలవడం, మహిళలకు ఉపాధి కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందివ్వడం సంతృప్తినిస్తున్నది’ అని చెబుతున్నది కీర్తి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలనుకునే యువతకు కీర్తిప్రియ ఆదర్శమని చెప్పవచ్చు.
– గుండా శ్రీనివాస గుప్త, సూర్యాపేట
 
                            