‘అనగనగా ఒక రాజు…’ అని మన నానమ్మలు, తాతయ్యలు కథలు చెబుతుంటే విన్నాం. మూడు పదులు కూడా నిండని ఓ యువకుడు అనగనగా అంటూ కథలు చెప్పడం అరుదే! అతను చెప్పేది రాజుల కథలు కాదు.. చూపించేది రాజ్యాలు అంతకంటే కాదు. మట్టిమనుషుల ఆప్యాయతలు, అనుబంధాలు, మన విలువలను ‘అనగనగా తెలంగాణ’ అంటూ ఒక అందమైన డాక్యుమెంటరీ రూపంలో తెస్తున్నాడు జాస్తి శ్రీనివాస్. ఈ డాక్యుమెంటరీని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. త్వరలోనే ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘బతుకమ్మ’తో జాస్తి పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..
‘అనగనగా తెలంగాణ’ డాక్యుమెంటరీ ట్రైలర్ ఎవరి చేతులమీదుగా విడుదల చేస్తే బాగుంటుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన. 70 శాతం మంది కేసీఆర్ లేదా కేటీఆర్ అయితే బాగుంటుందని కామెంట్లు పెట్టారు. ఆ పోస్ట్ కేటీఆర్ టీం చూసి ఫోన్ చేశారు. ఆ తరువాత ఆయన మమ్మల్ని పిలిచి ట్రైలర్ రిలీజ్ చేసి, మా టీమ్‌ని మెచ్చుకున్నారు. రామన్న ఆప్యాయత వెలకట్టలేనిది.
మాది ఖమ్మం జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం. అమ్మానాన్నలిద్దరూ వ్యవసాయం చేస్తూనే మా అన్నను, నన్ను చదివించారు. బీటెక్ తర్వాత బెంగళూరులో ఉద్యోగం చేశాను. నిజానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేకున్నా ఇంట్లోవాళ్ల కోసం వెళ్లాను. నా ఆఫీస్ టైం అయిపోగానే ఒక్కడినే నగరమంతా తిరుగుతూ అనేక కొత్త విషయాలు తెలుసుకునేవాణ్ని. అలా కొన్నిరోజులు ఫ్రెండ్స్‌తో కలిసి కెఫే స్టార్టప్ పెట్టాను. కొన్నాళ్లకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్‌లో చేరాను. తరువాత వీడియో కంటెంట్ చేయడం ప్రారంభించా. ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేశా. వారానికి మూడు కంటెంట్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేసేవాణ్ని. రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదని.. డిజిటల్ కంటెంట్ వైపు అడుగులు వేశాను. ఈ విషయం అమ్మకు చెబితే ‘ఉద్యోగం లేకపోతే పెండ్లికి పిల్లను ఎవరిస్తార’ని తిట్టింది. అన్నకు చెబితే ‘నీకు నచ్చింది చేయ్‌రా’ అని భరోసానివ్వడంతో 2022లో ఉద్యోగానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ వచ్చేశా.
కొత్త కంటెంట్ చేయాలంటే ఇతర వీడియోలు కూడా చూడాలి కదా. నేను కూడా అదే ఫాలో అయ్యాను. నేను చూసిన వాటిల్లో.. చాలామంది తెలుగువాళ్లు తమ వీడియోల్లో బయటి ప్రాంతాల ప్రాముఖ్యాన్ని చూపించడం కనిపించింది. మన ప్రాంత విశేషాలు చూపడం లేదనిపించింది. మన ప్రాంత విశేషాలను అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ‘అనగనగా’ ప్రయాణం మొదలుపెట్టాను. మన మట్టి పరిమళాలు, అంతరించిపోతున్న కళలను తెరమీదికి తేవాలనుకున్నాను. అందుకోసం తెలుగు రాష్ట్రాల డాక్యుమెంటరీ చేయాలని నిర్ణయించుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2024లో 60 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీ చేశాం.
ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనను సోషల్ మీడియా వేదికలో పంచుకున్నప్పుడు నాకు ముఖేశ్ పరిచయమయ్యాడు. తను కూడా నాలాంటి ఆలోచనలు ఉన్నవాడు కావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు తోడుగా నిలిచాడు. ఇద్దరం కలిసి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రయాణించాం. బస్సులు, ఆటోల్లో తిరుగుతూ కనిపించిన మనుషులతో మాట్లాడుతూ అక్కడి కళలు, సంస్కృతులపై డాక్యుమెంటరీ తయారుచేశాం. అలా సీజన్ వన్‌లో ‘అనగనగా ఆంధ్రప్రదేశ్’ పేరుతో 9 ఎపిసోడ్లు చేశాం. మా శ్రమను గుర్తించిన డైరెక్టర్ త్రివిక్రమ్ మా డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు.
ఎలాంటి ప్లానింగ్ లేకుండా చేసిన సీజన్ 1 డాక్యుమెంటరీలో లోపాలను గుర్తించి వాటిని సీజన్ 2లో సరిచేసుకున్నాను. అందుకోసం ఆరు లక్షలు లోన్ తీసుకొని మరీ షూటింగ్ పరికరాలు సమకూర్చుకున్నాను. సీజన్ 2లో తెలంగాణను చూపించాం. తెలంగాణ సంస్కృతి విభిన్నమైనది. ఇక్కడ ప్రతీ 50 కిలోమీటర్లకు తినే ఆహారం, మాట్లాడే యాస మారుతుంది. 2025 జనవరిలో మా ప్రయాణం మొదలైంది. వర్షాల కారణంగా మూడు విడుతలుగా మా జర్నీ సాగింది. భద్రాచలం, కరీంనగర్, జహీరాబాద్, అసిఫాబాద్, గార్ల, పాపికొండలు, గోదావరిఖని, రామగుండం, ములుగు, వరంగల్ మొదలైన ప్రాంతాలన్నీ చుట్టొచ్చాం.
చేర్యాల పెయింటింగ్స్, జహీరాబాద్ మహిళా రైతుల పురోగతి, చేనేత, గిరిజన పండుగలు, దేవాలయాలు, సేంద్రియ సాగుతీరు, ఈ మట్టిమనుషుల మాటా ముచ్చట్లన్ని కలిపి 13 ఎపిసోడ్లు చేశాం. ఇవే కాకుండా తెలంగాణ అంటే ఏమిటో 50 నిమిషాల నిడివితో ఓ చిన్నపాటి సినిమా తీశామనే చెప్పాలి. ‘తెలంగాణ ప్రజలంటే మందు తాగుతారు, గొడవకు దిగుతారు, బూతులు తిడత’ని ఇతర ప్రాంతాల్లో ఓ అభిప్రాయం ఉంది. కానీ, అదంతా పచ్చి అబద్దం. ఇక్కడి జనం కల్మషం లేని ప్రేమమూర్తులు. వాళ్ల ఆత్మీయత ఎలా ఉంటుందో మా డాక్యుమెంటరీ చెబుతుంది.
ఒక్కరోజు టూర్‌కు వెళ్తేనే.. సెల్ఫోన్లో మ్యాప్ ఆన్ చేసుకుంటున్న రోజులివి. మేము రెండు రాష్ర్టాలు తిరిగినా ఏనాడు సెల్ఫోన్లో మ్యాప్ చూడలేదు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికులను, హోటల్స్‌లో తింటున్నప్పుడు పక్కన టేబుల్ వాళ్లను, చాయ్ తాగుతున్నప్పుడు ఆ షాప్ ఓనర్లను అడిగి ప్రయాణ వివరాలు, ఆ ప్రాంతాల విశేషాలను తెలుసుకునేవాళ్లం. మా సోర్స్ అంతా ప్రజలే. మా షూటింగ్ సాయంత్రం ఆరు కల్లా ముగించుకొనే వాళ్లం. స్థానికులు ప్రేమతో పెట్టింది తిని.. అక్కడే బస చేసేవాళ్లం.
సామాన్యులకు కూడా ఈ డాక్యుమెంటరీ చేరాలన్నదే నా ఆలోచన. ‘అనగనగా ఆంధ్రప్రదేశ్’ కూడా యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశా. ఇప్పుడు ‘అనగనగా తెలంగాణ’ సైతం అదే తరహాలో చేయబోతున్నాం. ఇప్పటికే నా చానెల్‌కు లక్ష మందికిపైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత.. మరింత మందికి చేరువ అవుతుందని నమ్ముతున్నాను. ఈ డాక్యుమెంటరీ కోసం నాతోపాటు మరో తొమ్మిది మంది కష్టపడ్డారు. మనం చెప్పాలనుకుంటున్నది కథ రూపంలో చెబితేనే జనాలకు కనెక్ట్ అవుతుందన్న భావనతోనే ‘అనగనగా..’ అనే పేరు పెట్టాం. ప్రకృతితో మనిషికున్న బంధాలకే ఇందులో ప్రాధాన్యమిచ్చాం. భవిష్యత్తులో మరిన్ని ప్రజల కథలు చెప్పాలన్నది నా లక్ష్యం. వివిధ రాష్ర్టాల డాక్యుమెంటరీలను తీసి మీకు అందిస్తాను.
– రాజు పిల్లనగోయిన