ఇంట్లోకి చప్పున తేనెటీగ చొరబడితే.. అందరికీ హడల్. అట్టలు అందుకొని దాన్ని తరిమేసే దాకా కదం తొక్కుతారు! రుచికరమైన తేనెను అందించే ఈ కీటకానికి ఇంట్లో ప్రవేశం ఉండదు. చూరుకు తేనెపట్టు వెలిసిందా… మంచిరోజు చూసుకొని మరీ, పొమ్మని పొగబెట్టేస్తారు. కానీ, తెలంగాణ బీ హబ్ సంస్థ స్థాపకురాలు కె.ఇందిరారెడ్డి మాత్రం తన ఇంటిని తేనెటీగల నిలయంగా మార్చేశారు. పట్టుబట్టి ఇంటిపట్టునే తేనెతుట్టెలను సాగుచేస్తున్నారు. ‘తెలంగాణ క్వీన్ బీ’ పుస్తకం రాసి తేనెటీగల పెంపకం లోతుపాతులను విశదపరిచారు. స్వచ్ఛమైన తేనె కోసం ఆమె సాగించిన ప్రస్థానం తేనెటీగలకు మాత్రమే కాదు, ఈ కీటకాలపై ఆధారపడిన సాగుబడికీ సాయమైంది. కొండల్లో, కోనల్లో, పొలాల్లోనే కాదు ఇంట్లోనూ తేనెటీగలను పెంచొచ్చని చెబుతున్న ఆంత్రప్రెన్యూర్ ఇందిరారెడ్డి ‘జిందగీ’తో పంచుకున్న తేనె పలుకులు ఆమె మాటల్లోనే..
కొవిడ్ ప్రబలినప్పుడు చాలామంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్నారు. అప్పుడు తేనె వినియోగం పెరిగింది. తేనె ప్రయోజనాల గురించి ఆయుర్వేద వైద్యులు చెప్పడం వల్ల తేనెకు గిరాకీ పెరిగింది. నేనూ స్వచ్ఛమైన తేనె కోసం ప్రయత్నించాను. మార్కెట్లో ఒకటీ, రెండు బ్రాండ్లు మినహా మిగతావన్నీ నకలీ అని తేలింది. అప్పటిదాకా డబ్బులు పెట్టి కొని తిన్నదంతా తేనె కాదని తెలిశాక చాలా బాధపడ్డాను. మాకు తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో తేనెటీగల పెంపకం చేపడితే ఈ కల్తీ బాధ తప్పుతుందనుకున్నాను. మా కోసం తేనెను తయారు చేసుకుంటే, స్నేహితులకూ మంచి తేనె ఇవ్వొచ్చనే ఆలోచన వచ్చింది.
తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమానికి వెళ్లాను. ఆ శిక్షణలో తేనెటీగల ప్రాముఖ్యం ఏంటో తెలిసింది. ఈ కీటకాలు తగ్గడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించీ తెలిసింది. పరపరాగ సంపర్కం లేక పంటల దిగుబడి తగ్గుతున్నది. ఎన్నో రకాల అంతరపంటలు అంతరించే ప్రమాదం ఉందని తెలిసింది. హాబీ కోసమని వెళ్లాను. సాగుబడి సంక్షోభం గురించి తెలిశాక, ఈ రంగంలో ఎక్కువగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. మన తెలంగాణలో తేనెటీగల పెంపకం సాధ్యపడదని, తేనె దిగుబడికి అనువైనది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి తేనెటీగల పెంపకం విస్తృతంగా చేపట్టిన పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాలకు వెళ్లాను.
అక్కడి తేనెటీగల పెంపకందార్ల అనుభవాలు తెలుసుకున్నా. మన రాష్ట్రంలో కూడా పెద్ద మొత్తంలో తేనెటీగల పెంపకం చేపడితే రైతులకు వ్యక్తిగత లాభమే కాదు వ్యవసాయరంగానికి కూడా మేలు జరుగుతుందని భావించాను. నా కోసం కాకుండా రైతులతో కలిసి పనిచేసేలా భవిష్యత్ కార్యచరణను మార్చుకున్నాను. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి గురించి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమం చేపట్టాను. తెలంగాణ బీ హబ్ సొసైటీ స్థాపించాను. ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాను. శ్రీకొండాలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, మహీంద్రా యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ సహకారం, కృషి విజ్ఞాన కేంద్రాల తోడ్పాటుతో నా ప్రయాణం మొదలుపెట్టాను.
సంగారెడ్డిలో మా పొద్దు తిరుగుడు తోటలోనే అరవై బాక్సులతో తేనెటీగల పెంపకం మొదలుపెట్టాను. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నా అనుభవాలు చెప్పాను. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ద్వారా రైతులకు నలభై శాతం సబ్సిడీతో తేనెటీగల పెంపకం యూనిట్లు, బాక్సులు ఇప్పించాను. రైతులు, యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఉండటంతో చాలామంది శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు నేనే ఎంతోమందికి తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తున్నాను. రైతులకు శిక్షణ ఇవ్వడమే కాదు వాళ్లతో కలిసి తేనెటీగల పెంపకం చేపట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాను.
జగిత్యాల, సిద్దిపేట, నిర్మల్, వికారాబాద్, సాతులూరు ప్రాంతాల్లో రైతులతో కలిసి తేనె ఉత్పత్తి చేస్తున్నాను. ఒకప్పుడు తెలంగాణలో తేనె ఉత్పత్తి చాలా తక్కువ. ఇప్పుడు 30 మంది తేనెటీగల పెంపకందార్లు పూర్తిగా దీనికోసం పని చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తేనెటీగలు బతకవు అనేవాళ్లు. ఇప్పుడు మన రాష్ట్రంలో 5,000 తేనెటీగల బాక్సులున్నాయి. నెలకు అయిదు టన్నుల తేనె ఉత్పత్తి జరుగుతున్నది. నేనే వెయ్యి బాక్సులతో తేనె ఉత్పత్తి చేస్తున్నాను.
ప్రస్తుతం మా ఇంటి ఆవరణలో కూడా తేనెటీగలు పెంచుతున్నాను. మిద్దెతోటలు, పెరట్లో, ఇంటి ఆవరణలో కూడా తేనెటీగలు పెంచుకోవచ్చు. నగరాల్లో, పట్టణాల్లో తేనెటీగలు పెంచుకోవచ్చా? అని చాలామంది సందేహిస్తారు. దానికి మా ఇల్లే సమాధానం. ఇంట్లో తేనెటీగల పెంపకం అంటే చాలామంది భయపడతారు. అసలు తేనెటీగలంటేనే భయపడతారనుకోండి. తేనెటీగలు వాటికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే కుడతాయి. అంతవరకు అవి మనల్ని ఏం చేయవు. వాటిపైకి రాళ్లు విసిరినా, తుట్టెపై బలంగా కొట్టినా అవి కుడతాయి. అవి కుట్టినా ప్రమాదం కాదు.
కానీ, కొన్ని కొండజాతి తేనెటీగలు వాటికి హాని చేసినప్పుడు ఒకేసారి దాడి చేస్తాయి. అవి మాత్రమే ప్రమాదం. మిద్దెతోటలో, పెరట్లో దేశీ తేనెటీగలు (ఇఫిస్ సెరినా ఇండియా), పుట్టజాతి తేనెటీగలు, జొర్రీగలు (మెల్లికోనా) పెంచుకోవచ్చు. విదేశీ తేనెటీగలు వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రమే పెంచుకోవాలి. ఇంట్లో పెంచుకునే తేనెటీగలతో లాభసాటిగా తేనె ఉత్పత్తి సాధ్యం కాదు. తేనెటీగల పెంపకం ఒక వ్యాపకంగా, కల్తీ తేనెలు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.
నేను ఎంబీఏ, ఎల్ఎల్ఎం, బీఈడీ చదివాను. మా అమ్మ నడుపుతున్న స్కూల్లో చాలాకాలంగా పనిచేస్తున్నాను. ఇన్నేళ్ల టీచర్ వృత్తిలోకన్నా తేనెటీగల పెంపకంలో, రైతులకు శిక్షణ ఇవ్వడంలో ఎక్కువ సంతృప్తి కలిగింది. తేనెటీగల పెంపకం నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తున్నది. ఇది నేను సృష్టించుకున్న సంస్థ. అలాగే ప్రకృతికి, సమాజానికి, ఎంతోమంది యువతకు, రైతులకు మేలు జరుగుతున్నది. తేనెటీగల పెంపకం కేవలం ఉపాధి మాత్రమే కాదు, దేశ ప్రగతికి ఇది అవసరం. నా ప్రయాణం, ప్రయోగాలు, రైతులతో అనుభవాలన్నిటినీ ‘తెలంగాణ క్వీన్ బీ’లో పంచుకున్నాను.
తేనె తాగితే ఎంత మేలో… తేనెటీగలు కుడితే అంతకన్నా మేలు! వాటి ముల్లులో ఉండే విషం వల్ల నొప్పి, వాపు కలుగుతుంది. కానీ, ఆ విషంలో ఉండే ఎంజైమ్స్, ప్రొటీన్స్, పప్టైట్స్, మెలిటిన్, హిస్టమైన్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి ట్యూమరల్ ఎఫెక్ట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ విషం రొమ్ము క్యాన్సర్‌తోపాటు నలభై రకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు), ఒంటినొప్పులు, పార్కిన్సన్, నరాల వ్యాధుల నివారణకు ఉపయోగించే మందుల తయారీలో దీనిని వాడతారు. తేనెటీగలు కుడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యవంతులం అవుతాం. కాబట్టి తేనెటీగలు కుడతాయని భయపడకండి. ప్రమాదమేమీ కాదు. కొన్ని కొండజాతి తేనెటీగలు మినహా తొంబై శాతం తేనెటీగల నుంచి ప్రమాదం ఉండదు. మమ్మల్నీ ఒకటీ, రెండు కుడతాయి. కానీ, దాడి చేయవు. ఇరుగు పొరుగు వాళ్లకూ ఇంతవరకు ఇబ్బంది కలగలేదు.
తేనెటీగలు మకరందాన్ని సేకరించే చెట్లను బట్టి తేనే రుచి ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒక పంటను విస్తారంగా పండిస్తారు. ఆ పంట పూల నుంచి తేనె వస్తుంది. కాబట్టి ఆ పంట నుంచి వచ్చే ఫలాలు ఏ రంగు, రుచి కలిగి ఉంటాయో తేనె కూడా అదే రంగు, రుచిని కలిగి ఉంటుంది. ఆ ఫలాల్లో ఉండే పోషకాలూ ఇందులో ఉంటాయి! మేం పలు ఆరోగ్య ప్రయోజనాలు అందించేలా తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నాం. నేరేడు, వామ, పొద్దుతిరుగుడు, బత్తాయి, నువ్వులు, దోస, కుంకుడు చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో తేనెటీగల పెంపకం చేపడుతున్నాం. ఆయా రకాల తేనెలతోపాటు మైనంతో తయారుచేసిన ఆర్గానిక్ సబ్బులు, మాయిశ్చరైజర్లు, లిప్‌స్టిక్‌లు తయారుచేస్తున్నాం. ఆన్లైన్లో వీటిని మార్కెట్ చేస్తున్నాం. కొన్ని స్టోర్లతో ఒప్పందం చేసుకుని, సీఐఎస్ఎఫ్, జైళ్ల శాఖ స్టాల్స్‌లో కూడా అమ్ముతున్నాం.
– నాగవర్ధన్ రాయల
– కేశమౌని మహేష్‌గౌడ్