పడిలేచిన కెరటం తిరిగి సంద్రంలో కలిసిపోతుందే కానీ… పదేపదే ఎగసే ఓర్పు దానికి కూడా ఉండదు. తుపానుకు తట్టుకున్న చెట్టు, వరద తాకిడికి కొట్టుకుపోతుంది కానీ అన్ని సందర్భాలనూ ఓర్చుకోలేదు. కానీ బహుశా మనిషి మాత్రమే ఎన్నిసార్లు ఓడినా తట్టుకునే ైస్థెర్యంతో ఉంటాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్చుకునే ధైర్యంతో ఉంటాడు. అందుకు సాక్ష్యం కోసం చరిత్రను వెతకాల్సిన పనిలేదు. మన చుట్టూ కనిపించే వందలాది వ్యక్తిత్వాలే రుజువు. అలాంటి ఓ కథే! దలైలామా! కటిక పేదరికంలో పుట్టి ఆధ్యాత్మిక పీఠాన్ని అధిరోహించారు, బలశాలి చైనాను ఎదిరించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు, శాంతిని ప్రచారం చేస్తూనే తన ప్రజల అస్తిత్వం కోసం పోరాడారు, ఆంక్షలను ఎదుర్కొంటూనే లోకాన్ని చుట్టేశారు. అలాగని ఆయన జీవితం తెల్లని కాగితమేమీ కాదు. నినాదాలున్నాయి, వివాదాలున్నాయి! ఈరోజుతో దలైలామాకు 90 ఏళ్లు నిండుతున్నాయి. కేవలం ఓ మతబోధకుడిగా, శాంతిసాధకుడిగానే కాదు… తన సుదీర్ఘ జీవితంలో శతాబ్దపు ప్రపంచ చరిత్రను దగ్గరగా చూసి, కొన్ని సందర్భాలలో అందులో భాగమైన ఆయనను తలుచుకోవడం సబబే. నెహ్రూ నుంచి మావో వరకు ఆయన స్నేహాలను, ఘర్షణలను గుర్తుచేసుకోవడం ఆసక్తికరమే!
బుద్ధుడి బోధలనే జీవన విధానంగా ఏర్పరుచుకుని ఓ మతం ఏర్పడింది. ఇతర మతాలలాగానే అది కూడా రకరకాల మార్పుచేర్పులను ఇముడ్చుకుంది. ఎంతగా విస్తరించిందో అన్ని శాఖలుగా విడిపోయింది. హీనయానం, మహాయానం, వజ్రయానం లాంటి శాఖలు ఏర్పడ్డాయి. ఇక ప్రాంతాలు, గురువులను బట్టి జెన్, టిబెటన్ లాంటి విభాగాలు మొదలయ్యాయి. ఆ టిబెటన్ బౌద్ధానికి గురువే దలైలామా. అది కేవలం టిబెట్‌కు మాత్రమే పరిమితం కాదు! భూటాన్, మంగోలియా, నేపాల్‌తో పాటుగా హిమాలయ పరిసర ప్రాంతాలైన అరుణాచల్‌ప్రదేశ్, లద్దాఖ్ ప్రజలలో ఈ టిబెటన్ బౌద్ధం పట్ల విశ్వాసం ఎక్కువే. బౌద్ధంలో ఉన్న హీనయాన, వజ్రయాన తత్వాలతో పాటుగా స్థానిక ఆచారాలను అన్వయించుకోవడం టిబెటన్ బౌద్ధానికి ఉన్న ప్రత్యేకత. అదే దాని బలం కూడా!
టిబెటన్ బౌద్ధానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నో ప్రభావాలను తట్టుకుంటూ, కొన్నిటిని తనలో ఇముడ్చుకుంటూ శతాబ్దాల తరబడి మార్పు చెందిన నేపథ్యం ఉంది. సిల్క్‌రూట్ ప్రయాణాలు, భారతీయ గురువులు, మంగోల్ దండయాత్రలు… ఇలా ఎన్నో సందర్భాల తర్వాత 14వ శతాబ్దానికి అది నిర్దిష్టమైన మతంగా స్థిరపడింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న టిబెటన్ బౌద్ధులను ఒకటి చేసేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు… ఒక పీఠాధిపతిని కనుగొనే ప్రయత్నం మొదలైంది. ఇది కేవలం ఓ ఆలోచన మాత్రమే కాదు. నిర్వాణం అందుకున్న బౌద్ధులు మనుషుల మీద కరుణతో తిరిగి వస్తారని నమ్మకం. బుద్ధుని ఆ కరుణా రూపాన్ని అవలోకితేశ్వరుడిగా కొలుస్తారు. ఆ అవలోకితేశ్వరులను గుర్తించి తమకు నాయకులుగా ఎంచుకునే ప్రయత్నమే దలైలామా ఎంపిక. దలై అంటే సంద్రం, లామా అంటే గురువు. చాలా చిత్రమైన పేరే. సముద్రం అంత విజ్ఞానం ఉన్న గురువు అనో, సంద్రంలా అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటారనో, దానంత గంభీరమైన వ్యక్తి అనో… రకరకాల అన్వయాలు చేసుకోవచ్చు. 14వ శతాబ్దంలో మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ పరంపరలో 14వ గురువే నేటి దలైలామా!
ఒక దలైలామా చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడ జన్మించాడో తెలుసుకోవడానికి చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ప్రకృతి అందించే ఎన్నో శకునాలు, సూచనల ఆధారంగా బౌద్ధ ప్రతినిధులు సుదూరతీరాల వరకూ వెళ్లి, లామా కోసం వెతుకుతారు. అలా వెతుకుతూ వెళ్లిన ప్రతినిధులకు ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న రైతు కుటుంబం ఆసక్తి కలిగించింది. ఆ రైతుకు పుట్టిన 16 మంది పిల్లలలో తొమ్మిదిమంది చనిపోయారు. చావును జయించిన మిగతా పిల్లల్లో ఒకరు అనూహ్యంగా కనిపించాడు. మారువేషంలో వెళ్లిన ప్రతినిధులను గుర్తుపట్టడం, 13వ లామాకు సంబంధించిన వస్తువులను పోల్చుకోవడం లాంటి చర్యలతో అతనే లామా అనే నమ్మకం కలిగింది. నిజానికి ఇది తనకో విజయం. కానీ పీఠాధిపత్యం కంటే ముందే తనను కష్టాలు పలకరించాయి. ఓ స్థానిక నాయకుడి కన్ను ఈ ఎంపిక మీదపడింది. తను పాలించే చోట పుట్టినవాడు లోకానికి అవసరమయ్యాడు అనే ఆలోచన ఆత్యాశ కలిగించింది. భారీగా డబ్బులు ముట్టచెబితే కానీ అతణ్ని వదలనని కూర్చున్నాడు. చివరికి టిబెట్ ప్రభుత్వం నుంచి అనుకున్నంత డబ్బు రాబట్టుకున్నాడు.
టిబెటన్ బౌద్ధంలో దలైలామా తర్వాతి స్థానంలో ఉండే వ్యక్తి పంచన్ లామా. పంచన్ అంటే గొప్ప పండితుడు అని అర్థం. 17వ శతాబ్దం నుంచి ఈ పరంపర మొదలైంది. మత గురువుగానే కాకుండా తదుపరి దలైలామాలను ఎంచుకోవడంలో వీరిది ముఖ్యపాత్ర. పంచన్ లామా ఎంపికలో కూడా చైనా జోక్యం ఉంటుంది. బంగారుపాత్రలో లాటరీ ద్వారానే వారిని ఎంచుకోవాలని పట్టుబడుతున్నది. ఇంత జరిగినా పంచన్ లామాల ఉనికి కూడా వివాదాస్పదంగా మారుతున్నది.
పదో పంచన్‌లామా నేపాల్ మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఓ ఉపన్యాసం ఇచ్చిన రోజే అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన తర్వాత 11వ పంచన్ లామాను ఎన్నుకున్నారు. చైనాను సంప్రదించకుండానే ఈ ప్రక్రియ ముగించడంతో… ఎంపిక జరిగిన మూడు రోజులకే ప్రభుత్వం ఆయనను కిడ్నాప్ చేసింది. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, తను ఎక్కడ ఉన్నారో చెప్పలేదు.
2020లో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి ఓ ప్రకటన చేసింది. పంచన్ లామా బతికే ఉన్నాడు, ఓ కాలేజిలో చదువుకుంటున్నాడు… అన్నది ఆ ప్రకటన సారాంశం. అంతేకాదు! ఇతనే అసలైన పంచన్ లామా అంటూ చైనా అధికారులు మరో వ్యక్తిని ప్రకటించారు. సహజంగానే ఆయనను చాలామంది బౌద్ధులు గురువుగా గుర్తించలేదు. అసలైన పంచన్ లామా ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు!
దలైలామా ఎంపిక ప్రక్రియ, పీఠాధిపత్యం, స్థానిక నాయకుల చెర…ఇవన్నీ దాటేసరికి 1940 సంవత్సరం వచ్చేసింది. చరిత్రలో టిబెట్‌ను మంగోలుల వంటి శక్తిమంతులు పాలించినా కూడా… దలైలామాకు గౌరవం ఇచ్చేవారు. ఓ సామంతుడికి ఇచ్చినంత స్వేచ్ఛ ఆయనకు ఉండేది. కానీ 14వ దలైలామా నాటికి పరిస్థితులు మారిపోయాయి. ఇక చైనాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి, అది టిబెట్‌ను పూర్తిగా కబళించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు దలైలామా ఓ కంటగింపుగా తోచాడు.
కుర్రవాడైనప్పటికీ దలైలామా వారితో సయోధ్య కోసం ఎంతగానో ప్రయత్నించాడు. మావోను సైతం కలిశాడు. ఎప్పటికప్పుడు తన అనుయాయులను పంపి వారితో సంప్రదింపులు జరిపాడు. కానీ టిబెట్, చైనాలో సంపూర్ణ భాగంగా ఉండాలని నాటి ప్రభుత్వం భావించింది. పరిస్థితులు తన చేయి జారిపోతున్నాయని గ్రహించిన దలైలామా, భారత్ వైపు చూడటం మొదలుపెట్టాడు. బౌద్ధానికి పుట్టిల్లుగాను, శాంతిని కోరే దేశంగానూ ఇండియానే తనకు సరైన ఆశ్రయం ఇవ్వగలదని ఆశించాడు. కానీ తన అభ్యర్థనను భారత్ తోసిపుచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ విప్లవం మొదలైంది!
దలైలామా ఓ కొరకరాని కొయ్యగా మారడం చైనా సహించలేని విషయం. టిబెట్ ప్రజల్లో స్వేచ్ఛా కాంక్షకు తను కేంద్రకంగా మారతాడనే అభద్రత దాన్ని వెన్నాడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఓ అధికారిక వేడుకలో దలైలామాను అపహరించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఆ సమయంలో దలైలామా చుట్టూ చేరిన చైనా అధికారుల తీరు అనుమానాలను బలపరిచింది. అంతే! దలైలామా అనుయాయులు ఒక్కసారిగా తన నివాసానికి చేరుకుని రక్షగా నిలిచారు. ఎక్కడికక్కడ తిరుగుబాట్ల్లు మొదలయ్యాయి. ఇక దలైలామాను అక్కడినుంచి తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఓ రాత్రివేళ ఆయనకు సైనికుడి వేషం వేసి, నమ్మకస్తులైన అనుచరులతో కలిసిన ఓ బృందం సరిహద్దులు దాటి మనదేశం చేరుకుంది. నాటి తిరుగుబాటు సమయంలో వేలమంది టిబెటన్లు ఊచకోతకు బలయ్యారు. వారితో బౌద్ధసన్యాసుల సంఖ్యా తక్కువేమీ కాదు. మరెంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భారత్‌కు వచ్చారు. అలా వచ్చిన శరణార్థులు ఒకేచోట ఉంటే స్థానిక వ్యవస్థల మీద ప్రభావం ఉంటుందని గ్రహించిన భారత ప్రభుత్వం, వారికి వేర్వేరు ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటుచేసింది. ఇప్పటికీ వారు హాయిగా ఉన్నారు.
భారతదేశానికి వచ్చిన దలైలామా ఇక్కడ క్రియాశీలకమైన జీవితాన్నే గడిపారు. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఓ సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్ల బాగోగులు, టిబెట్ నుంచి వచ్చిన కాందిశీకులు, టిబెట్ స్వేచ్ఛ కోసం పాటుపడుతుందీ ప్రభుత్వం. టిబెటన్ బౌద్ధ ప్రచారం, తమ సంస్కృతికి అనుగుణమైన విద్యావవస్థ, గ్రంథాలను సేకరించడం లాంటి ఎన్నో లక్ష్యాలతో దలైలామా తలమునకలై ఉంటూ వచ్చారు. 1970ల నుంచి ప్రపంచ దేశాలను పర్యటిస్తూ శాంతి సందేశాలను వినిపించడం మొదలుపెట్టారు. ఫలితంగా నోబెల్, రామన్ మెగసెసె, టెంపుల్టన్ లాంటి అంతర్జాతీయ పురస్కారాలనూ అందుకున్నారు.
ఒకవైపు శాంతిని ప్రకటిస్తూనే మరోవైపు చైనా ఆగడాలను నిరసించేందుకు ఏమాత్రం వెనకాడలేదు. ఫలితంగా చైనా ఆయన మీద విరుచుకుపడుతూనే వచ్చింది. మోసగాడు, వేర్పాటువాది అంటూ నిందిస్తున్నది. ఏ దేశం తనను ఆహ్వానించినా, ఏ ప్రభుత్వం ఆదరించినా, ఏ అంతర్జాతీయ వేదిక మీద ఉపన్యసించినా… తీవ్రంగా ఖండిస్తుంది. ఇంతాచేసి దలైలామా కోరుకుంటున్నది టిబెట్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం కాదు, ప్రాథమిక హక్కులతో బతికే స్వేచ్ఛ. అది కూడా గొంతెమ్మ కోరికగానే ఉంది. ఈ 14వ దలైలామా తర్వాత ఆ కోరిక, పోరాటం, శాంతి కాముకత్వం, విజ్ఞానం తన వారసుడిలో కనిపిస్తాయా అన్నది సందేహమే. అసలు ఇప్పుడు వారసత్వమే వివాదంగా మారనుంది. చైనా తరఫున ఓ దలైలామా, టిబెట్ బౌద్ధుల తరఫున ఓ దలైలామా ఎంపికయ్యే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.
దలైలామా మన దేశంలో అడుగుపెట్టి ఆరుదశాబ్దాలు గడిచిపోతున్నది. తనకు ఎదురుతిరిగే వ్యక్తి మీదైనా, దేశం మీదైనా కక్ష పెంచుకుని సాధించే చైనాలాంటి దేశానికి కంటగింపుగా… ఆయనకు ఇన్నాళ్లపాటు ఆశ్రయం ఇవ్వడం చిన్నపాటి సాహసం ఏం కాదు. పైగా ఎక్కడికి వెళ్లాలి, ఏం మాట్లాడాలి అనే విషయాల మీద దలైలామా మీద ఆంక్షలూ విధించలేదు. బౌద్ధం మొత్తానికీ గురువు కాకపోయినప్పటికీ, ఓ శాఖకు అధిపతిగా ఆయనకు భారతదేశం సముచితమైన గౌరవం ఇస్తూనే వచ్చింది. ఒకోసారి తనకు ఆశ్రయం ఇచ్చిన దేశ నాయకుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, అది వాక్ స్వాతంత్య్రంగా భావించి పెద్ద మనసుతో ఊరుకుంది. అందుకే ఇది కేవలం దలైలామాను తలుచుకునే సమయం మాత్రమే కాదు, అనేక పరిమితుల మధ్య లోకాన్ని ఎదిరించి మరీ అభయాన్ని అందించేంత పెద్దమనసున్న మన ఆతిథ్యానికి కూడా గర్వించే సందర్భం.
Dalai lama
దలైలామా పాలిట చైనాతో సంఘర్షణ ఎలాగూ ముడిపడి ఉంది. దాంతోపాటుగా ఇతర వివాదాలూ లేకపోలేదు. ఓ మత నాయకుడిగా ఆయన వేర్వేరు అంశాల మీద కచ్చితమైన అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. అవి అందరికీ నచ్చకపోవచ్చు. అబార్షన్, స్వలింగ సంపర్కం లాంటి విషయాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆమోదం తెలిపినప్పటికీ మరణశిక్ష, మాంసాహారం లాంటి అంశాల మీద తన వ్యతిరేకత తేల్చి చెప్పేశారు.
టిబెట్ బౌద్ధంలో డార్జే షూజ్డెన్ అనే శాఖ చాలా ముఖ్యమైంది. కానీ అందులోని బోధలను విస్మరిస్తూ, ఆ శాఖ అనుయాయులను దలైలామా నిరుత్సాహపరిచారు. ఈ పక్షపాతం బౌద్ధ సమాజాన్ని విడదీసిందనీ, డార్జే అనుచరులకు ఉపాధిరంగంలో అన్యాయం జరిగిందని అంటారు.
2015లో బీబీసీతో జరిగిన ఒక ముఖాముఖిలో తదుపరి దలైలామా ఒక అందమైన అమ్మాయి అయితే మంచిది అని చెప్పారు. ఈ అభిప్రాయం మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ అడిగారు.
చైనా-అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలు లేని సమయంలో దలైలామాకు అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కోట్లు కుమ్మరించింది. దాన్ని ఎవరూ ఖండించలేదు కూడా. ఆ డబ్బు ఆయన అభిప్రాయాలను, ఉపన్యాసాలను ప్రభావితం చేసిందని ఆరోపణ.
దలైలామా మీద ఉన్న ఇతర ఆరోపణలన్నీ ఖండించడానికీ, తనవైపు వాదన సమర్థించుకోవడానికీ వీలైనవే. ఆ స్థాయి వ్యక్తి చేసే ప్రతి పనీ, అనే ప్రతి మాటా శల్యపరీక్షకు లోనవడం సహజమే. కానీ ఇవన్నీ ఒక ఎత్తయితే తన జీవితం చరమాంకంలో వచ్చిన ఆరోపణ మరో ఎత్తు. 2023లో ధర్మశాలలో వందమంది విద్యార్థులతో ఓ సమావేశం జరిగింది. ఓ విద్యార్థి తనను ఆలింగనం చేసుకోవాలంటూ దలైలామాను అభ్యర్థించారు. దానిని ఆయన మన్నించారు కూడా. అక్కడితో విషయం ముగిసిపోలేదు.
తన బుగ్గల మీదా, పెదాల మీదా ముద్దు పెట్టుకోమని దలైలామా సూచించారు. దాన్ని ఆ బాబు పాటించగానే… ఏకంగా తన నాలుకను చాపి దాన్ని ముద్దుపెట్టాలని సూచించారు. ఈ సన్నివేశం ఇంటర్నెట్ అంతా దావానలంలాగా వ్యాపించింది. దాన్ని దలైలామా కార్యాలయం ఎంతలా సమర్థించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. అది సరదాగా చేసిన ఆట అనీ, కొన్ని ప్రాంతాల్లో ఆచారం అని చెప్పినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 90 ఏళ్లు హుందాగా, ధైర్యంగా సాగిన తన జీవితం మీద ఓ మచ్చలా మిగిలిపోయింది.
సాధారణంగా దలైలామా చనిపోయిన తర్వాతే ఆయన వారసుడిని ఎంచుకుంటారు. దలైలామా అంత్యక్రియల తర్వాత అక్కడి పొగ కదిలే దిశ, చిన్నారి లామా తల్లిదండ్రులకు వచ్చే కలలు, ప్రకృతిలో వస్తున్న మార్పులు లాంటి ఎన్నో సూచనల ద్వారా తనను గుర్తిస్తారు. కానీ ఇప్పుడైతే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. దలైలామా, పంచన్ లామాలను తనే ఎంచుకోవాలని చైనా పట్టుదలతో ఉంది. తన కీలుబొమ్మలనే లామాలుగా నిర్ణయించాలనుకుంటున్నది. దాన్ని అడ్డుకోవాలనే తపన దలైలామాలో కనిపిస్తున్నది.
తను ఈసారి టిబెట్‌లో అవతరించననీ, బహుశా ఒక అమ్మాయిగా పుడతాననీ, అసలు అవతారమే ఉండకపోవచ్చనీ… రకరకాల ప్రకటనలు ఆయన నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలనే అభ్యర్థన ఆయన అనుయాయుల నుంచి వస్తున్నది. మరోవైపు చైనా కూడా ఈ విషయంలో పావులు కదుపుతున్నది. ఇప్పటికే 25 మంది అధికారులను ఈ ప్రక్రియ కోసం నియమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు! తాము ఎన్నుకునే దలైలామాను వ్యతిరేకించకుండా ఉండేందుకు, బౌద్ధ ప్రముఖులను సంప్రదిస్తున్నది కూడా. తమ ఎంపికను గుర్తించినవారికి ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవని అభయం ఇస్తున్నదని వార్త.
Dalai lama
దలైలామా అవతారమా కాదా అన్న సందేహం ఉన్నవారికి కూడా ఆయన మేధాశక్తి మీద అనుమానం లేదు. ఆయన ఏకసంథాగ్రాహి. భాష, తత్వశాస్ర్తాల మీద మంచి పట్టుంది. నిరంతర అధ్యయనమే కాదు, రచనా వ్యాసంగం కూడా ఆయన సొంతం. తన ఆత్మకథతో పాటుగా ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. తంత్రశాస్త్రం నుంచి క్రైస్తవం వరకు, కోపాన్ని అదుపుచేసుకోవడం నుంచి ప్రశాంతతను పొందడం వరకు దాదాపు 50 పుస్తకాలు రాశారు. ఆయన అభిప్రాయాలతో రూపొందించిన డాక్యుమెంటరీలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇక తన పల్లవులు, మంత్రాలతో రూపొందించిన ‘ఇన్నర్ వరల్డ్’ అనే మ్యూజిక్ ఆల్బం ఓ సంచలనం!
మొదట్లో దలైలామా, పంచన్ లామా తదితర బౌద్ధ ప్రముఖుల ఎంపికలో రాజ్యం ప్రమేయం ఉండేది కాదు. నాయకులకు ఈ తీరు కాస్త కంటగింపుగానే తోచింది. దాంతో 1793లో క్వింగ్ వంశపు రాజు ఓ చిత్రమైన ఆచారాన్ని మొదలుపెట్టారు. ఒక లామా చనిపోయిన వెంటనే ఆ విషయాన్ని రాజాస్థానానికి కబురు పంపాలి. అతని వారసునిగా ఒకరినే కాకుండా కొన్ని పేర్లను సూచించాలి. ఆ పేర్లను ఓ బంగారు పాత్రలో (Golden Urn) వేసి లాటరీ తీస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.
10, 11, 12వ లామాలను ఈ లాటరీ ద్వారానే ఎంచుకున్నారు. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ నిబంధనను అమలుచేయడంతో పాటుగా… దలైలామా ఎంపికను మరింత కఠినతరం చేశారు. చైనా ప్రభుత్వ అనుమతి, పర్యవేక్షణ లేకుండా లామాను ఎంచుకోరాదని హెచ్చరించారు. పీఠాధిపత్యం కూడా చైనా కనుసన్నలలోనే జరగాలని తేల్చారు. ఇంత జరిగినా… తమకు ఇష్టం లేకపోతే ఆ బిరుదును తొలగించే అధికారాన్ని కూడా చైనా ఎంచుకుంది!
– కె.సహస్ర