గోట్ లైఫ్ ఓ సంచలనం. పనికోసం గల్ఫ్కేగిన కేరళ కుర్రాడి వ్యథ ఇది. తెరకెక్కక ముందు ‘ఆడు జీవితం’ కేరళకే కథ. సినిమాగా విడుదలయ్యాక వలస బాధితులందరి గాథ. ఆ ‘ఆడు జీవితం’ ఎడారి దేశంలో వలస బాధలు ‘మేక బతుకు’ పేరుతో తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టాయి. సింగరేణి (నల్ల)బంగారు కొండ స్వర్ణ కిలారి ఒయాసిస్సుల వెంట పరుగెత్తే పేదల బాధల్ని గుండెకు హత్తుకునేలా అనువదించారు. పాఠకుల గుండెల్ని ఎడారి దారిలో తడారేలా ఆవిష్కరించారు. గల్ఫ్ దుఃఖానికి, పొక్కిలైన తెలంగాణ బతుక్కీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తున్న సింగరేణి బిడ్డ చెప్పే ముచ్చట్లివి…
నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యంతో అనుబంధం ఉంది. పదేండ్లప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. యద్దనపూడి, మధుబాబు లాంటి పాపులర్ రచయితల నవలలు చదివాను. నా వయసుకు అవి నచ్చాయి. ఇంటర్మీడియెట్‌కు వచ్చాక కాలక్షేప సాహిత్యం నుంచి అభ్యుదయ సాహిత్యంలోకి మళ్లాను. ఆ తర్వాత కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌లో ఉద్యోగం. సాఫ్ట్వేర్ కంపెనీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీలో కౌన్సెలర్‌గా చేరాను. పెండ్లి తర్వాత కొంతకాలం సీటీవీలో జర్నలిస్ట్‌గా పనిచేశాను. న్యూస్ రీడర్‌గా కూడా చేశాను. ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలనుకున్నాను. గ్రూప్స్ కోచింగ్ కోసం ఆర్సీ రెడ్డిలో చేరాను. అక్కడే నా జీవితం మరో దశకు మారిపోయింది. గ్రూప్స్ కోచింగ్ ఆలోచన నా జీవితాన్ని మార్చివేసింది. కరీం సార్ హిస్టరీ, సోషియాలజీ ద్వారా కొత్త ప్రపంచం చూపించారు.
నేను చాలా పుస్తకాలు చదివాను. కానీ, ఏదైనా విషయం ఒక లైన్ రాయలంటే భయపడేదాన్ని. 2014లో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఒక లైన్ రాసి మా ఆయన దిలీప్‌కు ఫోన్ చేసి ‘ఇలా రాశాను. సరిగ్గానే ఉందా?’ అని అడిగేదాన్ని. తను ‘పర్వాలేదు’ అంటేనే పోస్ట్ చేసేదాన్ని. మార్పులు చేయమంటే చేసేదాన్ని. ఏడాదిన్నర తర్వాత… దిలీప్ ‘ఓకే’ అంటే పోస్ట్ చేసే స్టేజ్ నుంచి ఆయనకు చెప్పకుండానే పోస్ట్ చేసే స్థాయికి వచ్చాను. చిన్నగా కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ కథల్లో కొన్ని నా అనుభవాలు ఉన్నాయి. మరికొన్ని కల్పనలు ఉన్నాయి. భర్త చనిపోతే పదకొండు రోజుల తంతులో గాజులు తీయడం మీద ఒక విప్లవాత్మకమైన కథ రాశాను. భర్త చనిపోయిన వాళ్ల బొట్టు తీయడం, గాజులు పగులగొట్టడం చూసి నా గుండె పగిలింది. మా అత్తగారి తరఫు బంధువుల్లో ఎనభై ఏళ్లు పైబడిన పెద్దావిడకు అలా చేస్తుంటే ఆమె మనుమరాళ్లు వచ్చి అడ్డుపడ్డారు. గాజులు తీయడానికి ఒప్పుకోలేదు. ఆ ఘటనలు నన్ను వెంటాడాయి. ఆ అమానుష చర్య గురించి ‘అయిదోతనం’ కథ రాశాను. మా కుటుంబంలో ముగ్గురు స్త్రీల బాధ చూసి ఒకళ్లో ఇద్దరో మారతారని ఆ కథ రాశాను. ఖమ్మం ఈస్తటిక్స్ పోటీల్లో ఆ కథకు మూడో బహుమతి వచ్చింది.
నా బాల్య జ్ఞాపకాలను ‘నల్ల బంగారం కథలు’ అని రాస్తున్నాను. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి డిగ్రీ వరకు కథలుగా రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ కథల సంకలనం కోసం ఇంటర్నెట్లో వెతుకుతుంటే ఒకబ్బాయి నెత్తి మీద మేకతో ఉన్న ‘గోట్ డేస్’ పుస్తకం కనిపించింది. అది నాకు చాలా ఆసక్తి కలిగించింది. అది చూడగానే పెరుమాళ్ మురుగన్ నవల ‘పూనాచ్చి’ గుర్తుకొచ్చింది. ఏమిటిదని చూస్తే… మలయాళ రచయిత బెన్యామిన్ రాసిన ఆడు జీవితం ఆంగ్లానువాదం. ఇంకాస్త తెలుసుకుందామని నెట్లో వెతికితే.. ఆ పుస్తకం ఆధారంగా ‘గోట్ లైఫ్’ సినిమా తీశారని తెలిసింది. వారం రోజుల్లో విడుదలైంది. సినిమా చూశాను. పుస్తకం చేతికి రాగానే చదవడం మొదలుపెట్టాను. ‘ఆడు జీవితం’ ముందుమాట చదవగానే కనెక్ట్ అయిపోయాను. గల్ఫ్ వలస బతుకుల గురించి నేనూ విన్నాను.
దేశంలో గల్ఫ్ వలసల్లో కేరళ తర్వాత రెండో స్థానం తెలంగాణదే. అప్పటికే గల్ఫ్ వలస బతుకుల గురించి పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘ఎడారి మంటలు’ నవల చదివాను. ఆయన కథలు, వ్యాసాలూ చదివాను. గల్ఫ్ వలస జీవితాలపట్ల సానుభూతి వల్ల ఈ నవల పూర్తి చేయాలనే ఆసక్తి మరింత పెరిగింది.
ఈ నవల అనువాదం గల్ఫ్‌తోపాటు కేరళ జీవితాన్ని, సమాజాన్ని, పరిసరాలను అర్థం చేసుకోవడం అనివార్యమైంది. మూల రచయితతో మాట్లాడలేదు కానీ, ఆంగ్ల అనువాదం చేసిన జోసెఫ్ కొయిప్పల్లితో మాట్లాడాను. గల్ఫ్ జీవితంలో తెలియని మాటలకు నజీబ్ (ఆడు జీవితంలో ప్రధాన పాత్ర) ఎలా ఇబ్బందులు పడ్డాడో అనువాదం చేస్తున్నప్పుడు సరైన అర్థాలు దొరక్క నేనూ అంతే ఇబ్బంది పడ్డాను. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఏ కష్టమూ పట్టదు. రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఆనందంగా శ్రమించేదాన్ని. మూడు నెలల్లో పూర్తిచేశాను. ఆ కాలమంతా ఎడారిలో బతికానేమో అనిపిస్తుంది. నజీబ్లా నేనూ తప్పిపోయానేమో అనిపించింది.
‘ఇంతియానం’ పుస్తకానికి సంపాదకురాలిగా పనిచేశాను. నలభై మంది మహిళల ట్రావెలాగ్స్ ఇందులో ఉంటాయి. థాయ్‌లాండ్‌లోని థాలువాంగ్ గుహల్లో 12 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను కాపాడేందుకు వేలాది మంది సాహసికులు ప్రయత్నించారు. ఆ రోజుల్లో ప్రపంచమంతా ఆ రెస్యూ ఆపరేషన్ వైపు ఉగ్గబట్టి చూసింది. ఆ ఆటగాళ్లు గుండెబలంతో అన్నిరోజులు గుహలో బతికి బయటపడ్డారు. ఆ సాహసగాథను దిలీప్ నేను కలిసి రాయాలనుకున్నాం. అందుకోసం థాయ్‌లాండ్ పోయివచ్చాం. ఆ గుహలు చూసి, ఆ క్రీడాకారులతో మాట్లాడాం. ఆ సాహసగాథను ‘13’ పేరుతో తెలుగు పాఠకులకు అందించాం.
అడవిలోనే పుట్టాను. అడవిలోనే పెరిగాను. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. సింగరేణి కాలరీస్‌లో ఉండటం వల్ల మంచి మెమరీస్ ఉన్నాయి. స్కూల్ కోసం రెండు, మూడు కిలోమీటర్లు కొండలుదాటుతూ నడిచేవాళ్లం. వానాకాలం తడిసేవాళ్లం. తెలంగాణ గడిగోలు గ్రూప్‌లో తెలంగాణ పదాలు, సంస్కృతి గురించి చర్చ ఉండేది. అవన్నీ రాస్తున్నప్పుడు డైరెక్టర్ కేవీఆర్ మహీంద్ర నన్ను సంప్రదించారు. ‘దొరసాని’ సినిమా కోసం ఎనభైల నాటి నగలు, ఆడపిల్లల దుస్తులు ఎలా ఉండేవి, ఏ ఆటలు ఆడేవారో చెప్పమన్నారు. నాకు తెలిసింది చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి.. ‘మా సినిమాలో పెద్ద దొరసాని క్యారెక్టర్ చేస్తారా?’ అనడిగారు. నేను పెద్దగా నవ్వాను. సర్లే ఓకే అన్నాను. నటించాలని, సినిమాల్లో కనిపించాలనే కోరిక లేదు. కాదనలేక నటించాను. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలో కూడా డైరెక్టర్ అక్షర అడిగాడు. ఆ తమ్ముడిని కాదనలేకపోయాను. రాసినా, నటించినా.. మా ఆయన సపోర్ట్ చేయాల్సినంత చేస్తాడు. పెళ్లి తర్వాత డే వన్ నుంచి ఇప్పటివరకు తనకంటే ఓ మెట్టు పైనే ఉండాలని కోరుకుంటాడు. అంతకన్నా కావాల్సిందేముంది?
ఇప్పటికి రెండు పుస్తకాలు అనువాదం చేశాను. ఆ రెండూ కేరళకు సంబంధించినవే, ఇంటర్నెట్లో కనిపించినవే! ఆ రెండూ విషాదాలే కావడం యాదృచ్ఛికమే. ‘మేక బతుకు’ కంటేముందు ‘లిప్తకాలపు స్వప్నం’ అనువాదం చేశాను. ఇది క్లింట్ అనే బాల చిత్రకారుడి కథ. క్లింట్ ఏడేండ్ల వయసులో చనిపోయాడు. 2300 రోజుల జీవితంలో 25 వేల బొమ్మలు గీశాడంటే ఎంత గొప్ప జీవితం. తల్లిగా నేను క్లింట్కి బాగా కనెక్టయ్యాను. వెంటనే ఆ పుస్తకం చదివాను. అనువాదానికి సిద్ధమయ్యాను. క్లింట్ని నా కొడుకో, నా ఫ్రెండో అన్నట్టుగా ఫీలయ్యాను. ఇది అనువాదం చేస్తున్నప్పుడు క్లింట్ వాళ్ల అమ్మతో చాలాసార్లు మాట్లాడాను. ఆ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు వచ్చింది. ఆ పారితోషికం క్లింట్ వాళ్ల అమ్మకు ఇస్తానంటే తను తీసుకోనంది. క్లింట్ లాంటి పిల్లల కోసం ఆ డబ్బు ఖర్చుచేశాను. తెలుగు పాఠకుల్లో ఈ రెండు అనువాదాలూ పాపులర్ అయ్యాయి.
– నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరిగౌడ్