Bhagya Sri | బిడ్డలు.. కన్నవారి కలలు నెరవేరుస్తారు. ఈ ఆడకూతురు అంతకుమించి! తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేసింది. కట్టుకున్న వాడు అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఆమె చేరుకుంది. గోదావరి ఒడ్డున బుడిబుడి అడుగులు వేసిన ఒకనాటి చిన్నారి.. నేడు ఎస్సై క్యాడెట్ల దీక్షాంత్ పరేడ్‌లో అందరినీ ముందుకు నడిపించింది. ఇది చూసి ఆమె పుట్టిన సారపాక మనసారా పొంగిపోయింది. ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడుగా నిలిచిన శ్రీవారు అందరూ ఉప్పొంగిపోయారు. ‘చీఫ్ మినిస్టర్స్ రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్ రౌండర్’, ‘హోం మినిస్టర్ బాటెన్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్’ క్యాడెట్‌తోపాటు టాపర్ ఆఫ్ ద 2024 ఎస్సై బ్యాచ్ బెస్ట్ క్యాడెట్‌గా ఎంపికైన విజయ స్త్రీ.. భాగ్యశ్రీ కథ ఇది.
2019లో భాగ్యశ్రీ పెండ్లయింది. 2021లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుసటి ఏడాది ఎస్సై నోటిఫికేషన్ విడుదలైంది. పాలుతాగే పసిపాప ఒడిలో ఉండగా.. ఎస్సై పోస్టుకు ఎవ్వరూ కూడా అప్లయ్ చేయడానికి సాహసించరు. ఆమె మాత్రం పట్టుబట్టి పరీక్షకు సిద్ధమైంది. గట్టిగా కసరత్తులు చేసింది. బెస్టుగా పరీక్ష రాసింది. శిక్షణ పూర్తయ్యేసరికి ఫస్టుగా నిలిచిన భాగ్యశ్రీ విజయగాథ ఆమె మాటల్లోనే..
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సారపాక. ప్రాథమిక విద్య ఖమ్మంలోని గురుకుల విద్యాలయంలో.. ఇంటర్, ఇంజినీరింగ్ కొత్తగూడెంలో పూర్తిచేశాను. మా నాన్న పల్లి నాగేశ్వరరావు పెండ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. అమ్మ సారపాకలో బడ్డీకొట్టు నడుపుతుంటుంది. మేము ముగ్గురు సంతానం. చదువు ఒక్కటే జీవితాన్ని మార్చే ఆయుధమని అమ్మానాన్నలు బలంగా నమ్మారు. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని పెద్ద చదువులు చదివించారు. వారి ప్రోత్సాహంతో అక్క, తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. బీటెక్ తర్వాత నా పెండ్లి చేశారు.
మా ఆయన పవన్‌కుమార్ హైదరాబాద్‌లో ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పెండ్లికి ముందు కూడా ఉద్యోగం చేశాను. చదువుకొని ఉద్యోగం చేయకపోతే ఆడబిడ్డకు విలువ ఉండదని అమ్మానాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించేదాన్ని. 2018లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికయ్యాను. 2020లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాను.
2021లో మాకు ఆడబిడ్డ పుట్టింది. ఆ మరుసటి ఏడాది ఎస్సై నోటిఫికేషన్ పడింది. మా వారికి పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. యూనిఫాం సర్వీసుల్లో చేరాలని ఎప్పుడూ అనుకునేవారు. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల తను అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. ఆయన కోరిక నేను నెరవేర్చాలని అనుకున్నా. ఆయన కారణంగానే పోలీసు ఉద్యోగంపై నాకు ఇష్టం పెరిగింది. నేను ఎస్సై పోస్టుకు అప్లయ్
చేస్తానని చెబితే.. ఆయన ఎంతో సంతోషించారు. పరీక్షకు సన్నద్ధం కావడంలో అండగా నిలిచారు. తనకు తెలిసిన మెలకువలు నేర్పారు. రోజూ ఇద్దరం గ్రౌండ్‌కు వెళ్లేవాళ్లం. దగ్గరుండి కసరత్తులన్నీ నేర్పారు.
మా బంధువుల్లో పోలీసులెవరూ లేరు. మా వాళ్లందరికీ మార్గదర్శిగా ఉండాలనుకున్నా. ముఖ్యంగా నా కూతురి ముందు విజేతగా నిలవాలనే ఉద్దేశంతోనే పోలీసు ఉద్యోగం వైపు అడుగులు వేశాను. నేను ఉద్యోగానికి ఎంపికయ్యే నాటికి నా బిడ్డది పాలు తాగే వయసు. ఓ అమ్మగా బాధ ఎంత భారంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ, నాకది తప్పని పరిస్థితి. నేను శిక్షణలో ఉన్న ఏడాదంతా మావారు, అమ్మానాన్నలు, అత్తమామలు నా చిట్టితల్లి ఆలనాపాలన చూసుకున్నారు.
నా దృష్టంతా లక్ష్యంపైనే ఉండేలా మా ఆయన స్ఫూర్తినిచ్చారు. సివిల్స్ టాపర్స్ పరేడ్‌ను లీడ్ చేసే విధానంపై ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ‘వందలాది మంది ఉన్నా.. పరేడ్‌ను లీడ్ చేసే అవకాశం కేవలం ఒక్కరికి మాత్రమే వస్తుంది. అందుకోసం ఎంతో కష్టపడాలి. ఇండోర్, అవుట్డోర్ ఈవెంట్లలో, సబ్జెక్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మాత్రమే ఈ అవకాశం వస్తుంద’ని చెప్పేవారు. ఆ మాటలు నాపై మంత్రంలా పనిచేశాయి. ఆ ఉత్సాహంతోనే ఎస్సై ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, ఫైనల్ ఎగ్జామ్స్‌లో నా బెస్ట్ పెర్ఫార్మెన్ ఇచ్చాను.
ఎస్సైగా ఎంపిక కావడంతోనే నా టార్గెట్ పూర్తయిందని ఊరుకోలేదు. పరేడ్ కూడా లీడ్ చేయాలనుకున్నా. ఇండోర్, అవుట్డోర్ ఈవెంట్లలో చక్కటి ప్రతిభ కనబర్చాను. చివరికి పరేడ్ లీడ్ చేసే అరుదైన అవకాశాన్ని అందుకున్నాను. పైగా ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘చీఫ్ మినిస్టర్స్ రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్ రౌండర్ ఎస్సై’, ‘హోం మినిస్టర్ బాటెన్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్’ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉంది. ఇవి నా బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంటాయి.
నా పేరు సౌమ్య. నేను ఏఆర్ ఎస్సైగా ఎంపికయ్యాను. మా స్వస్థలం హైదరాబాద్ మలక్‌పేట్. నాన్న ఏఆర్ ఏఎస్సై. నా శిక్షణ పూర్తయ్యేంత వరకు కూడా మా నాన్న ఏఆర్ ఏఎస్సై అనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నేనేంటో నిరూపించుకోవాలి అనుకున్నా. పోలీసు విభాగంలో ఉంటే ప్రజలకు, ముఖ్యంగా పేదవారికి ఎక్కువ సేవ చేసే అవకాశం దక్కుతుందని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే నేను కూడా ఈ దిశగా అడుగులు వేశాను. చిన్నప్పుడు ‘నాన్నా నేను పోలీసు ఉద్యోగం చేస్తే మాత్రం.. నా దగ్గరే నిన్ను ఉండేలా చూసుకుంటాను’ అని అంటుండేదాన్ని. ‘నా కూతురి దగ్గర పనిచేయడం నాకూ గర్వకారణమ’ని నాన్న అనేవారు.
అప్పుడు నేను సరదాగా అన్న మాటలు నేడు నిజమయ్యాయి. నాన్న నాకు సెల్యూట్ చేసినప్పుడు నా ఆనందానికి హద్దు లేదు. ఎంబీఏ చదువుకుంటూనే ఎస్సై ఉద్యోగానికి సిద్ధమయ్యాను. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు. ఆన్లైన్లో సబ్జెక్ట్ చూసుకుంటూ, చదువుకుంటూ సొంతంగా మెటీరియల్ తయారు చేసుకున్నా. అమ్మ ఎంతో ప్రోత్సహించింది. మొత్తానికి అనుకున్నది సాధించాను. ఆ కష్టానికి ఫలితమే ‘చీఫ్ మినిస్టర్స్ రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్‌రౌండర్’, ‘హోం మినిస్టర్ బాటెన్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్’ అవార్డులు. అక్క చార్టెడ్ అకౌంట్, తమ్ముడు డెలాయిట్‌లో జాబ్ చేస్తున్నారు. మొత్తానికి నా సక్సెస్‌ను వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
– సౌమ్య, బెస్ట్ ఆల్‌రౌండర్
నా పేరు మమత. మాది నల్లగొండ జిల్లా బండవారిగూడెం. ఎంటెక్ చేశాను. అమ్మానాన్నలు ఇందిర, రంగారెడ్డి. భర్త ఈశ్వర్ రెడ్డి. మా బాబుకు ఎనిమిదేండ్లు. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా.. ఓ ల్యాండ్ ఇష్యూలో ఓ పోలీసు అధికారి వచ్చి.. తన క్యాప్ నా తలపై పెట్టి.. ‘నువ్ పోలీసు అవుతావా’ అన్నారు. అప్పట్నుంచి పోలీసు కావాలని అనుకునేదాన్ని. నేను మూడో ప్రయత్నంలో ఎస్సై సాధించాను. రెండు ప్రయత్నాల్లో రాకపోవడంతో ఇదే చివరిసారి అనుకొని శిక్షణ తీసుకున్నా. గతంలో చేసిన తప్పులు చేయకుండా గ్రాండ్ టెస్ట్‌లు రాశాను. ఫిజికల్ ఈవెంట్స్ సమయానికి నాకు ఆపరేషన్ అయింది.
మూడు నెలలు అదే నొప్పితో లక్ష్యం కోసం 800 మీటర్లు పరుగెత్తాను. గత నోటిఫికేషన్ 7 మార్కులతో ఎస్సై ఉద్యోగం మిస్ అయింది. ఆ బాధ నుంచి కోలుకొని మళ్లీ బరిలో నిలిచి గెలిచాను. నాకు ఫైరింగ్‌లో డైరెక్టర్ మెడల్ వచ్చింది. రేంజ్ సెట్ చేసుకోవడం, ట్రిగ్గర్ ఆపరేషన్, సైట్ ఎలైన్మెంట్ ఇవన్నీ సెట్ చేయడం అనుకున్న తేలికేం కాదు. పైగా వెపన్స్ బరువు ఉంటాయి. హిట్ ఇచ్చినప్పుడు వెనక్కి పడిపోతుంటారు. కాగా, మొదట చిన్న వెపన్తో చేసిన ప్రయత్నం నాలో ఆసక్తి పెంచింది. ఆ తర్వాత నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే నన్ను ప్రత్యేకంగా నిలిపింది.
– బి. మమత, డైరెక్టర్ ట్రోఫీ గ్రహీత
– రవికుమార్ తోటపల్లి