మోడలింగ్ అంటే రూపురేఖలకు పట్టం కట్టే రంగం. ఎత్తు, బరువు, కొలతలు అన్నీ తూకం వేసినట్టు ఉంటేనే అందులో అడుగు పెట్టగలరన్న ప్రచారం ఉంది. అందాల పోటీలకు ఓ అడుగు వెనక ఉంటుందేమో కానీ, ఇక్కడ మిగతాదంతా సేమ్ టు సేమ్. అలాంటి చోట ఒంటి చేత్తో రాణిస్తున్నది మిషెల్లీ సి. గూగుల్, విక్టోరియా సీక్రెట్, పాప్ షుగర్లాంటి పేరుగాంచిన సంస్థలకు మోడల్‌గా పనిచేస్తున్న ఈమెది ఓ ఆత్మవిశ్వాసపు ప్రయాణం.
పదహారేండ్ల క్రితం ఒక భయానక కార్ యాక్సిడెంట్… అప్పటికి మిషెల్లీకి 19 సంవత్సరాలే. ప్రాణమే పోతుందేమో అనుకునే పరిస్థితి నుంచి బతికి బట్టకట్టింది. కానీ, కుడివైపు చేయి, కాలు బాగా దెబ్బతిన్నాయి. చికిత్స తర్వాత కాలు కాస్త కోలుకునే అవకాశం కనిపించినా, చేతిని మాత్రం మోచేయికి పైనే తీసేయాల్సి వచ్చింది. దీంతో దివ్యాంగురాలిగా మారిందామె. అతి కష్టం మీద తిరిగి నడవడం ప్రారంభించింది. తనకే ఎందుకిలా అయిందని ఎన్నో రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ, దేవుడిచ్చిన శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించాలని నెమ్మదిగా సర్దిచెప్పుకొంది. అదే ధోరణిని పూర్తిగా అలవరచుకుంది కూడా. ఇక, తనను మాత్రమే ప్రత్యేకంగా చూసే చూపులు ఆమెను తాకలేకపోయాయి. పూర్తిగా కోలుకున్నాక మిషెల్లీ తన మనసుకు నచ్చిన పనులు చేయడం ప్రారంభించింది. సాధారణ వ్యక్తుల్లాగే కష్టపడి వ్యాయామాలు చేస్తూ చక్కటి శరీర ఆకృతిని సొంతం చేసుకుంది. అదే తన కలల రంగం మోడలింగ్‌లోకి అడుగు పెట్టేందుకు సాధనంగా పనిచేసింది.
ఇటీవలి కాలంలో శారీరకంగా విభిన్నతలు ఉన్న వ్యక్తులు, ట్రాన్స్జెండర్లలాంటి ఎల్‌బీజీటీక్యూ వర్గాలనూ తమ సంస్థ ప్రకటనల్లో భాగం చేయాలని కొన్ని పెద్ద సంస్థలు భావిస్తున్నాయి. తద్వారా వారికి సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు కలిగించాలన్న ఉద్దేశం వాటిది. ఇక, ఇటీవల దుస్తులు, సౌందర్య ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ సంస్థ విక్టోరియా సీక్రెట్ శారీరక అవకరాలు ఉన్న వారికోసం ప్రత్యేకంగా కొత్త కలెక్షన్‌ను తీసుకువచ్చింది. ముఖ్యంగా మహిళలు ధరించే లోదుస్తులను ఇందులో చేర్చింది. వాటి ప్రకటన కోసం సంస్థ తరఫున మోడల్‌గా మిషెల్లీ పనిచేస్తున్నది.
మన దగ్గర మింత్రాలాంటి యాప్‌లలో కూడా విక్టోరియా సీక్రెట్ మోడల్‌గా కనిపిస్తున్నది. అయస్కాంతంతో మూసి తెరిచేలా (మ్యాగ్నటిక్ క్లోజర్లు) ఈ బ్రాలు, అండర్వేర్లలాంటి వాటిని తయారుచేశారు. దీనికి ముందు పరేడ్ అనే అమెరికన్ లోదుస్తుల కంపెనీతో పాటు, వెల్లా అనే జర్మనీ సౌందర్య ఉత్పత్తుల సంస్థ సహా గూగుల్‌లాంటి బహుళజాతి సంస్థలకూ మిషెల్లీ పనిచేసింది. అంతేకాదు, ఆమె మంచి స్టోరీ టెల్లర్, థియేటర్ ఆర్టిస్ట్ కూడా. సినిమా రంగానికి సంబంధించి ఔత్సాహిక నటి. వంటలు, యోగాలాంటివీ చాలా ఇష్టం. చక్కగా తయారైపోయి మంచి మంచి వీడియోలు చేసి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెడుతుంది.
సరదా సంగతులతో పాటు తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలనూ పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నది. తన భావాలను అందమైన కవితల రూపంలో రాయగలదు. పదేండ్ల బాబుకు తల్లికూడా అయిన మిషెల్లీ, ఇటీవల తన జీవితంలోని ఒడుదొడుకుల్ని వివరిస్తూ, సాహసోపేతమైన ఆ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. తనలా ప్రమాదాల కారణంగా అవకరం పాలైన వాళ్లలో ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉపయోగపడుతుందని ఆమె భావిస్తున్నది. మిషెల్లీ సంకల్పం నిజమవ్వాలని మనమూ కోరుకుందాం!