మొదలుపెట్టిన ప్రయాణం గమ్యాన్ని చేరితే అంతకు మించిన సంతోషం ఉండదు. ఆ అడుగులే వేరొకరికి దారి చూపితే, దాన్ని ఆదర్శం అంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ కూడా అలాంటి వారే. పల్లవి ఉటాగి.. ‘సూపర్ బాటమ్స్ డైపర్స్’ కంపెనీ సీయీవో. ఎకోఫ్రెండ్లీ డిస్పోజబుల్ డైపర్స్ అనే సరికొత్త వ్యాపార ఆలోచనకు రూపమిచ్చి.. పిల్లల కోసం నాణ్యమైన డైపర్లను అందుబాటులోకి తెచ్చారు.
దాదాపు 25 లక్షల కుటుంబాలు తమ పిల్లలకు రోజూ ఐదు డైపర్లు వాడినా.. మూడేండ్లు తిరిగే సరికి ఆ సంఖ్య 1,125 కోట్లకు చేరుతుంది. ‘ఇవన్నీ చెత్తకుప్పల్లో పారేస్తే పర్యావరణానికి ఎంత నష్టమో మీరే చెప్పండి’ అంటూ ప్రశ్నిస్తున్నారామె. ‘ఒక డైపర్ భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏండ్లు పడుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎంత కష్టం, ఎంత నష్టం! ఒక్కసారి ఊహించుకోండి’ అని నిలదీస్తున్నారామె. వాటికి ప్రత్యామ్నాయంగా మట్టిలో ఇట్టే కరిగిపోయే డైపర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి సౌకర్య వంతంగా ఉంటూనే పర్యావరణాన్ని కాపాడుతాయి. ఓ సంస్థకు ప్రాణం పోయడమే కాదు, ఒక తీవ్ర
సమస్యకు పరిష్కారమూ సూచించారు పల్లవి.