పిల్లల కోసం పెద్దలు కథలు రాయడం ఎంత కష్టమో. పిల్లల కోసం పెద్దలు ఆ కథలు చదవడం కూడా అంతే కష్టం. అయితే, ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదని అంటున్నారు గజ్వేల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని డాక్టర్ సిరిసిల్ల చందన. పిల్లల పాఠాల కోసం కథలు చదువుతూ.. చివరికి ఆ కథలపైనే పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారామె. హిందీ బాలసాహిత్యంపై తెలంగాణలో జరిగిన తొలి పరిశోధన ఇది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న మాటను నిజం చేసిన చందన కథ ఇది..
చిన్నప్పటి నుంచీ సాహిత్యం అంటే ఇష్టం. హిందీ కథల పుస్తకాలు, కామిక్స్ బాగా చదివేదాన్ని. నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వారెంట్ ఆఫీసర్‌గా పని చేసేవారు. తరచూ ట్రాన్స్ఫర్స్ ఉండేవి. బదిలీ ఉత్తర్వులు వచ్చిన ప్రతిసారీ ఊళ్లు మారేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా సరే.. తరచూ మా సొంతూరు సిరిసిల్లకు వచ్చేవాళ్లం. దీంతో రైలు ప్రయాణాలు ఎక్కువగా ఉండేవి. అదీ రెండుమూడు రోజుల సుదీర్ఘ యాత్రలే. రైల్వే స్టేషన్‌కు వెళ్లగానే నాన్న మమ్మల్ని బుక్ స్టాల్‌కు తీసుకుపోయేవారు. నాకు, అన్నయ్యకు, తమ్ముడికి ఇష్టమైన కామిక్ బుక్స్ కొనిచ్చేవారు. అలా మా రైలు ప్రయాణం.. చందమామ, విక్రమ్ బేతాళ్, సూపర్ మ్యాన్ సిరీస్, సరిత, ఫెమినా తదితర పత్రికలతో హుషారుగా సాగిపోయేది.
హిందీ ప్రేమ
బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయలో చదువుతున్నప్పుడు హిందీ టీచర్ ప్రేమా సింగ్‌తో మంచి అనుబంధం ఉండేది. ఆమె పాఠం చెప్పే విధానం బాగా నచ్చేది. పద్యాలను, శ్లోకాలను చక్కగా విశ్లేషించేవారు. ఆ స్ఫూర్తితో ప్రాచీన కావ్యాలు, ప్రేమ్‌చంద్ నవలలు, కథలు చదివాను. హిందీ భాష, సాహిత్యం మీద అభిమానం పెంచుకున్నాను. ఆ ప్రేమ కాలేజి రోజుల్లో ఇంకా పెరిగింది. బీఏలో హిందీ లిటరేచర్ తీసుకున్నాను. చాలా మంది హిందీలో పాస్ మార్కులు వస్తే చాలనే ధోరణితో ఉంటారు. దీంతో హిందీ టీచర్‌కు ప్రాధాన్యం తగ్గింది. హైస్కూల్లో అయిదేళ్లు చదివినా హిందీలో మాట్లాడలేరు. దీనికి మన విద్యా విధానంలోని లోపాలే కారణం. టీచర్లు ఎంతసేపూ భాషను సాహిత్యంతో జోడించి చెబుతున్నారు. ఇంతకు మించి వాళ్లకు అదనపు మెటీరియల్ దొరకట్లేదు. అందువల్లే పిల్లలకు హిందీ నేర్పలేకపోతున్నారు. విద్యార్థులూ నేర్చుకోలేకపోతున్నారు. అందుకు భిన్నంగా మా తరగతి గదిలో కొన్ని ప్రయోగాలు చేశాను. రోజూ పాఠం అయిపోయాక విద్యార్థులతో హిందీలో మాట్లాడిస్తాను. వచ్చినా రాకున్నా కచ్చితంగా మాట్లాడాలి. అలా అయితేనే భాష వస్తుందని వాళ్లను ప్రోత్సహిస్తాను. ‘
సాటర్డే.. ఫన్డే’ పేరుతో పిల్లలతో చిన్న చిన్న నాటికలు వాటిలోని సంభాషణలు వాళ్ల భాషా సామర్థ్యాన్ని పెంచుతాయి. విద్యార్థులతో నీతికథలు చెప్పిస్తాను. మధ్యలో ఏవైనా తెలుగు పదాలు వాడితే హిందీ పదాలు గుర్తు చేస్తాను. పుట్టిన రోజున చాక్లెట్లు కాకుండా పిల్లల కథల పుస్తకాలు తెమ్మని చెప్తాను. తరగతి గదిలో ఒక దండెం కట్టి, ఆ పుస్తకాలను వేలాడదీస్తాను. పిల్లలు తమకు ఇష్టమైన పుస్తకాన్ని తీసుకుని చదువుకోవచ్చు. నేను పిల్లలకే కాదు టీచర్లకూ పాఠాలు చెప్పాను. ఎన్సీఈఆర్టీ నేషనల్ రిసోర్స్ పర్సన్‌గా హిందీ టీచర్లకు వీడియో, ఆడియో ఎడిటింగ్, పవర్‌పాయింట్ ైస్లెడ్ ప్రజెంటేషన్, డిజిటల్ కంటెంట్ రూపకల్పన గురించి నేర్పించాను. ఎస్సీఈఆర్టీకి కూడా హిందీ రీసోర్స్ పర్సన్‌గా ఉన్నాను. టీ శాట్ కోసం 25 హిందీ పాఠాలు (డిజిటల్) రూపొందించాను.
పిల్లల్లా చదివా..
మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (హిందీ), ఎంఫిల్ పూర్తిచేసి 2018లో పీహెచ్‌డీలో చేరాను. ఆ సమయంలో నేను ఓ విద్యార్థిగా మారిపోయాను. కె. శ్యాంసుందర్ గారు నాకు గైడ్. హిందీ బాలసాహిత్యానికి సంబంధించిన తెలంగాణలో ఏ పరిశోధనా జరగలేదు. నాదే మొదటి ప్రయత్నం. నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) ప్రచురించిన హిందీ బాలసాహిత్యం గురించి నేను పరిశోధన చేశాను. ఇందులో ఎన్బీటీ హిందీ బాలసాహిత్య వర్గీకరణ, వివిధ దశలను విశ్లేషించడంతోపాటు పిల్లల ఆలోచనల్లో, సృజనాత్మకతలో వచ్చిన మార్పుల్ని కూడా చర్చించాను.
…? నాగవర్ధన్ రాయల
– రాజేశ్