‘పాస్ మార్కులొస్తే సాలు’ అనుకుంట కాలేజీకి వచ్చే ఆర్ట్స్ విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దడం ఎలాగో ఈ సార్‌ను చూసి నేర్చుకోవాలె. గ్రామీణ, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న విద్యార్థుల్ని చేరదీసి.. బువ్వ పెట్టి.. పాఠం చెప్పి తీర్చిదిద్దిండు. ఎకనామిక్స్ ఎంట్రన్స్ జరిగితే ఆయన స్టూడెంట్సే టాపర్స్. అర్థశాస్త్రంలో విజేతలకు అడ్డా ‘నల్లగొండ ఎకనామిక్ ఫోరం’కు కర్త, కర్మ, క్రియ డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య సార్! ఒక దీపంతో వేల దీపాలు వెలిగించడమంటే ఏమిటో.. ఈ సార్ జీవితం చెప్తది.
ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య సార్‌కి ఓ ఇరవై ఏండ్ల కిందట డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా ప్రమోషన్ వచ్చింది. నల్లగొండ పట్టణంల గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్‌ల పోస్టింగ్ ఇచ్చినరు. సార్ ఆ కాలేజీకి పోయే నాటికి విద్యార్థినులకు చదువంటే పెద్దగ ఆసక్తి లేకుండెనట. అంతకుముందు ఏడాది చూస్తె.. ఆ కాలేజీ విద్యార్థినులకు ఎవరికీ డిగ్రీ తర్వాత పీజీలో సీటు రాలె. అట్లనే మొదటి ఏడాదిలో చేరినవాళ్లల నలుగురైదుగురు రెండో ఏడాది కల్లా మానేసేటోళ్లట. ‘ఈ డ్రాప్ అవుట్స్‌ని తగ్గించాలె. ఆడపిల్లల్ని ఉన్నత చదువులవైపు మళ్లించాలె. బతకనీకి వాళ్లకో దారి చూపించాలె’ అనుకున్నడు మీనయ్య సార్!
డిగ్రీ తర్వాత ఉన్న చదువేంది? ఏది చదివితే ఏ జాబొస్తదో స్టూడెంట్స్‌కి చెప్పి ‘బాగా చదవాలె. మంచిగ బతకాలె’ అనే ఆశపుట్టించిండు సార్. తన పాఠాలతో స్టూడెంట్స్‌కి ఆర్థిక శాస్త్రం మీద ఇష్టం పెంచుకుంట పోయిండు. స్టూడెంట్స్‌తోనే పాఠాలు చెప్పించడం, ప్రాజెక్ట్‌లు చేయించడం, క్విజ్ పోటీలు పెట్టడం షురూ చేశిండు. అటెండెన్స్ పెరిగింది. డ్రాప్ అవుట్స్ తగ్గినయ్. పిల్లలు మంచిగ చదువుడు మొదలైంది. పరీక్షలు అయిపోయినయ్. ఎండాకాలం వచ్చింది. అయినా కాలేజీకి వస్తున్నరు. ఎందుకో తెలుసా? డిగ్రీ అయిపోంగనే పీజీకి పోవాలె గదా. ఎంట్రన్స్ రాయాల్నంటె మంచిగా ప్రిపేర్ కావాలె. పేదింటి పిల్లలకు కాలేజీలనే ఫ్రీగా కోచింగ్ చెప్పిండు సార్. ఆయినె కష్టం ఫలించింది.
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ 2005ల మంచి ర్యాంకులు తెచ్చుకొని.. అయిదుగురు అమ్మాయిలు ఎంఏ ఎకనామిక్స్‌ల చేరినరు. కష్టపడితే ఫలితమొస్తదని మీనయ్య సార్కే గాదు స్టూడెంట్స్కీ ఎరుకైంది. ‘మన బాగు కోసం సార్ అంతగనం కష్టపడుతుంటె.. మన కోసం మనం కష్టపడలేమా’ అని ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు పోటీలు పడి సదివినరు. అట్ల సదువబట్టి ఆ స్టూడెంట్స్ ఏటా కోచింగ్ వస్తున్నరు. యూనివర్సిటీలకు పోతున్నరు. మీనయ్య సార్ 2008ల ముప్పై మంది స్టూడెంట్స్‌కి కోచింగ్ ఇస్తె అందుల ఇరవై మంది ఉస్మానియా యూనివర్సిటీల ఎం.ఎ. ఎకనామిక్స్‌ల సీటు తెచ్చుకున్నరు. అప్పటి సంది మీనయ్య సార్ స్టూడెంట్స్ ఏటా పీజీ సీట్లు తెచ్చుకుంటనే ఉన్నరు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజ్‌ల ఆయన స్టూడెంట్స్లేని బ్యాచ్ లేదనుకో!
ఉమెన్స్ కాలేజీ నుంచి నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌కి మీనయ్య సార్ ట్రాన్స్ఫర్ అయిండు. ఆడగూడ ఇదే పని మీదేసుకున్నడు. ‘నా స్టూడెంట్స్ బాగా సదువాలె. పీజీలోకి పోవాలె’ అన్న పట్టుదలతోని పీజీ కోచింగ్ పెట్టిండు. అమ్మాయిలు ఆడిదాంక రాలేరనుకొని ఉమెన్స్ కాలజీలనే కోచింగ్ క్లాసులు నడిపిండు. ఆ బ్యాచ్‌ల ఉన్న షేక్ సుల్తానా ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ 2009ల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అప్పటి దాంక నల్లగొండ సుట్టుపక్కల ఊళ్లకే ఎరుకైన మీనయ్య సారు కోచింగ్ గురించి రాష్ట్రమంతా ఎరుకైంది.
‘సారు దగ్గర సదువాలే. ఎకనామిక్స్ సీటు కొట్టాలె’ అనే టార్గెట్తోని వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి గూడ సమ్మర్లో కోచింగ్‌కి వచ్చేది. వాళ్లందరికీ కలిపి ఎన్జీ కాలేజీలనే ఎకనామిక్స్ (సమ్మర్) కోచింగ్ ఇచ్చేది. ఆ ఏడాదిలనే కొత్త యూనివర్సిటీలొచ్చినయ్. ఎకనామిక్స్ సబ్జెక్ట్ పీజీ సీట్లు పెరిగినయ్. ఇగ మీనయ్య సార్ పాఠాలు విన్నోళ్లందరికీ సీటు గ్యారెంటీ అన్న పేరు పడ్డది. అంత పేరొచ్చినా ఏమన్నా సొమ్ము చేసుకున్నడా!? అంటే.. లేదనే చెప్పాలి! పైసా తీసుకోకుండా పాఠాలు చెబుతడు. చెప్పిన పాఠాలు గుర్తుండేటట్టు కోచింగ్ మెటీరియల్ తయారు చేస్తడు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చినోళ్లకు పాఠాలు చెప్పేందుకు మీనయ్య సార్ మరికొంత మందితో కలిసి ‘నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం’ పెట్టిండు. పెద్ద సదువులు సదివిన ఆయన స్టూడెంట్స్ నరేశ్, శోభ, కవిత వీళ్లంతా సార్ తీరుగ నలుగురికి సాయపడాల్నని ముందుకొచ్చినరు. 2013ల నల్లగొండ ఎకనామిక్స్ ఫోరంని రిజిస్ట్రేషన్ చేసినరు. మీనయ్య సార్ రిటైర్ అయినా.. స్టూడెంట్స్‌ని, ఎకనామిక్ పాఠాలని వదులుకోలే. నల్లగొండల ఉన్న మల్లు వెంకటనర్సింహా రెడ్డి విజ్ఞాన కేంద్రంల చేరిండు.
ఆ విజ్ఞాన కేంద్రానికి కన్వీనర్‌గా ఉండుకుంటు.. ఎంఏ కోచింగే కాదు లెక్చరర్ జాబ్లకు, నెట్, స్లెట్ అర్హత పరీక్షలకూ కోచింగ్ ఇస్తున్నడు. విజ్ఞాన కేంద్రంల ఉచితంగ వసతి కల్పించి, అన్నం పెట్టి సదువు చెప్తున్నడు. ఏడాది కింద లెక్చరర్ పోస్టుల నియామకాలు జరిగినయి. మొత్తం 81 పోస్టుల్లో 42 ఫోరం స్టూడెంట్స్‌కే వచ్చినయ్. సగం కొలువులు సార్ స్టూడెంట్సే దక్కించుకున్నరన్నట్టు.
పీజీ ఎంట్రన్స్కి ప్రతి బ్యాచ్‌కి యాభై నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటుండె. కొవిడ్ వచ్చినంక పిలగాళ్ల సదువు పాడుకాగూడదని ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టినరు. ఒక ఎన్ఆర్ఐ ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కోసమని సాఫ్ట్వేర్ ఇచ్చిండు. జూమ్ల క్లాసులు చెబుతున్నరు. ఆన్లైన్ల పరీక్షలు పెడుతున్నరు. ఆన్లైన్ క్లాస్‌ల వీడియోలని యూట్యూబ్‌ల అప్లోడ్ చేస్తున్నరు. పీజీ ఎంట్రన్స్, స్లెట్, నెట్ అర్హత పరీక్షలకు పాఠాలన్నీ https://www.youtube.com/@nalgondaeconomicsforum33యూట్యూబ్‌ల ఉన్నయ్.

నేను పేద కుటుంబంలో పుట్టిన. గోపులాయిపల్లి నుంచి ఆరు కిలోమీటర్లు నడుకుంటవోయి నార్కెట్‌పల్లి బడిల చదివిన. నేను డిగ్రీ చదివిన ఎన్జీ కాలేజీల పాఠాలు చెప్పిన. మొదటి నుంచి నాకు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండేది. ఆచరించి చూపిన. నా సహచరి పార్వతి నా ఆలోచనకు గౌరవమిచ్చి, ఆచరణకు సహకారం అందించింది. పైసా ఆశించకుండా పాఠాలు చెప్పిన. ఆస్తులు పెంచుకోకున్నా అభిమానించే మనుషుల్ని సంపాదించుకున్న.
– డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య
– నాగవర్ధన్ రాయల