‘నిరుపేదగా పుట్టడం తప్పు కాదు.. అలా మిగిలిపోవడమే తప్పు’ అంటారు ఆర్థికవేత్తలు. ఈ వాక్యం జగిత్యాలకు చెందిన రమ్యా నాగేంద్రకు అతికినట్టు సరిపోతుంది. సృజనాత్మకతకు అంకితభావం జోడించి సాగించిన ఆమె ప్రస్థానం.. పేదరికాన్ని చెరిపేసింది. రూ.500తో మొదలుపెట్టిన వ్యాపారం తొమ్మిదేండ్లలో ఏడాదికి రూ. ఐదు కోట్ల టర్నోవర్‌కు చేరువైంది. ఒకప్పుడు ఉపాధి కోసం వెతుకులాడిన ఆమె ఇప్పుడు 29 కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. ఇమిటేషన్ జువెలరీ తయారీతో తన జీవితంలో వెలుగులు నింపుకొన్న చెట్పల్లి రమ్యా నాగేంద్ర విజయ యాత్ర ఇది.
ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అందుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత ఉంటే.. అడుగులు వడివడిగా పడతాయి. అలసట దరి చేరినా.. ఇష్టపడి చేసే కష్టం విజయాన్ని అందుకుంటుంది. రమ్య ప్రయాణం కూడా ఇలాగే సాగింది. ఆమె తల్లిదండ్రులు పద్మ, వేముల శంకర్. వీరికి ముగ్గురు సంతానం. తండ్రి టిఫిన్ సెంటర్ నడిపేవాడు. తల్లి టైలరింగ్ చేసేది. వీరి పెద్ద కూతురు అంజలి కూడా టైలరింగ్ నేర్చుకొని అదే వృత్తిలో స్థిరపడింది. అన్న రాజు డీటీపీ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు రమ్య మంచి చదువరి. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసింది. కానీ, ఆశించిన ఉద్యోగం దొరకలేదు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆమె కూడా కుట్టు మిషన్‌తో జట్టు కట్టాల్సి వచ్చింది. 2014లో రమ్యకు జగిత్యాలకు చెందిన ప్రైవేట్ టీచర్ నాగేంద్రతో వివాహమైంది. భర్తది అత్తెసరు సంపాదన. కుటుంబ పోషణ కోసం పెండ్లి తర్వాత కూడా రమ్యకు టైలరింగ్ తప్పింది కాదు.
రోజులు గడిచాయి. రమ్య, నాగేంద్ర దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు. బాధ్యతలు పెరిగాయి. ఆర్థిక అవసరాలు అధికమయ్యాయి. చాలీచాలని సంపాదనతో సంసారం నడవడం సాధ్యం కాదనుకున్నారు ఇద్దరు. టైలరింగ్ చేస్తూనే ఇమిటేషన్ జువెలరీ అమ్మకాలు మొదలుపెట్టింది రమ్య. 2018లో రూ.500 పెట్టుబడితో రోల్డ్‌గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేసి.. తిరిగి విక్రయించే వ్యాపారం మొదలుపెట్టింది. ఆరు నెలల పాటు క్రయవిక్రయాలు కొనసాగించింది. ఎంతోకొంత మిగిలేది. ఇలా ఎన్నాళ్లు కష్టపడినా తన సంపాదన గొర్రె తోక బెత్తడే అన్నట్టుగా ఉంటుందని రమ్యకు త్వరగానే అర్థమైంది. తానే స్వయంగా నగలు డిజైన్ చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చని అనుకుంది. ఇతరుల కన్నా.. నాణ్యమైన, భిన్నమైన, నవ్యత కలిగిన నగలు తయారు చేస్తే డిమాండ్ ఉంటుందని గ్రహించింది. తన సృజనాత్మకతకు పదును పెట్టింది.
జువెలరీ విడిభాగాలను తెప్పించుకొని కొత్త డిజైన్లతో నల్లపూసల దండలు, వడ్డాణాలు, కంకణాలు, ఇతర నగలు తయారు చేయడం ప్రారంభించింది. అలా తయారు చేసిన వాటిని ఎక్కడ విక్రయించాలో అర్థం కాలేదు ఆమెకు. బహిరంగ మార్కెట్లో పెద్దగా ఆదరణ కనిపించలేదు. తన శ్రమ పరుల పరం కావొద్దని భావించి కస్టమర్లకే నేరుగా అందించడానికి యూట్యూబ్‌ను వేదికగా ఎంచుకుంది. ఆ చానెల్ ద్వారా తను తయారు చేసిన నగలను ప్రదర్శిస్తూ, వాటి ధరలను ప్రకటిస్తూ ఆన్లైన్ బిజినెస్‌కు అంకురార్పణ చేసింది. ఆన్లైన్ అంగట్లో విశేషమైన ఆదరణ లభించడంతో రమ్య వ్యాపారం మూడు నగలు ఆరు ఆర్డర్లుగా విస్తరించింది.
వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో కరోనా కల్లోలం మొదలైంది. కొవిడ్ దెబ్బకు తన బిజినెస్ కుదేలు అవుతుందేమో అని కంగారుపడింది రమ్య. అయితే కరోనా సమయం తనకు కలిసొచ్చిందని చెబుతుందామె. లాక్డౌన్ టైమ్‌లో యూట్యూబ్ వీక్షకుల సంఖ్య వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షకు పెరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో యూట్యూబ్‌కు అలవాటు పడటంతో రమ్య నగలు కొత్త నిగనిగలు సొంతం చేసుకున్నాయి. ఆమె యూట్యూబ్ చానెల్‌కు వ్యూస్ విపరీతంగా పెరిగాయి.
అందులోని డిజైన్లు చూసినవాళ్లు పెద్దసంఖ్యలో ఆర్డర్లు పెట్టడం మొదలైంది. అయితే, అన్ని ఆర్డర్లకు సరిపడా ముడిసరుకు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు వెనుకడుగు వేస్తే.. తన కష్టమంతా వృథా అవుతుందని రమ్యకు తెలుసు. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకుంది. ఉద్దెర మీద ముడిసరుకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.80 లక్షల విలువ చేసే ముడిసరుకు తెప్పించుకున్నది. అప్పటికే తను ఉపాధి కల్పించిన మహిళల సహకారంతో యుద్ధప్రాతిపదికన నగలు చేయడం ప్రారంభించింది. అనుకున్న సమయానికి ఆర్డర్లు అన్నీ అందించగలిగింది. అనతికాలంలోనే అప్పులు తీర్చేసి లాభాల బాట అందుకుంది రమ్య.
కరోనా తగ్గాక కూడా రమ్య జువెలరీకి గిరాకీ తగ్గలేదు. రోజురోజుకీ మరింత పెరిగింది. ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్న చదువుకున్న యువతులను ఎంపిక చేసుకొని, వారికి నగల తయారీలో తర్ఫీదునిచ్చింది. నయా నయా డిజైన్లతో నగలు రూపొందిస్తూ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేసేది. నిత్యం వందల్లో ఆర్డర్లు వస్తుండటంతో ఐదుగురితో డిజైనింగ్ టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాము అద్దెకు ఉంటున్న ఇంటినే కొనుగోలు చేసింది. నగల తయారీకి, విక్రయానికి అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకుంది. ఏడాది కిందటి దాకా పూర్తిగా ఆన్‌లైన్‌కే పరిమితమైన అమ్మకాలు.. ఇప్పుడు ఆఫ్లైన్లోనూ జోరుగా సాగుతున్నాయి.
రిటైల్ వ్యాపారులకూ గంపగుత్తగా నగలు విక్రయిస్తున్నది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఆరు నెలల కిందట ఓ బ్రాంచ్‌ను ప్రారంభించింది. జగిత్యాల నుంచి వచ్చిన ఐదుగురు వర్కర్లు, ఇద్దరు డిజైనర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. జువెలరీ బిజినెస్ పుంజుకోవడంతో రమ్య భర్త నాగేంద్ర తన ప్రైవేట్ టీచర్ కొలువు మానేసి, వ్యాపార నిర్వహణలో భార్యకు అండగా నిలిచాడు. ఒకప్పుడు ఉద్యోగం లేక స్వయం ఉపాధి ఎంచుకున్న రమ్య ఇప్పుడు 29 మందికి ఉపాధినిచ్చే స్థాయికి చేరుకుంది. రూ.500తో మొదలుపెట్టిన వ్యాపారాన్ని నెలకు రూ.40 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లింది. అంకిత భావమే తన విజయ రహస్యం అంటున్న రమ్యానాగేంద్ర ఎందరికో ఆదర్శం అనడంలో సందేహం లేదు!
ఈ బిజినెస్ ఇంత సక్సెస్ అవుతుందని నేనెన్నడూ ఊహించలేదు. పదేండ్ల కిందట రూ.100 కోసం గంటలపాటు టైలరింగ్ చేసేదాన్ని. ఇప్పుడు 29 మందికి ఉపాధినిచ్చే స్థాయికి చేరుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నెలకు రూ.3 లక్షలకు పైగా వేతనాలు ఇస్తున్నాను. మా దగ్గర రూ.9 వేలు తీసుకునే ఉద్యోగులు ఉన్నారు, రూ.40వేల వేతనం తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. 400 మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం.
ముఖ్యంగా విద్యావంతులకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను.మనిషి కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు సాధిస్తారో లేదో తెలియదు కానీ, ఇష్టపడి పనిచేస్తే మాత్రం తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటారు. ప్రస్తుత ప్రపంచం చాలా వేగంగా మారిపోతున్నది. నిన్న మిన్నగా అనిపించింది.. ఇవాళ తేలిపోతున్నది. అయితే, అందం, అలంకరణపై మాత్రం ఆసక్తి ఎన్నటికీ తగ్గదు. వాటికి అవుట్‌డేట్ అనేదే లేదు. అందుకే ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నాను. ఈ ప్రయాణం ఇంతే గొప్పగా సాగుతుందని ఆశిస్తున్నా!
– చెట్పల్లి రమ్యా నాగేంద్ర
– కొత్తూరి మహేశ్ కుమార్, జగిత్యాల