ఈతరం పిల్లల వ్యాపకం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం, సెల్‌ఫోన్‌తో దోస్తీ చేయడం! ఈ రెండిటి మధ్య చిక్కుకున్న బాల్యం కథలకు దూరమైపోతున్నది. కథలు చెప్పే వాళ్లేరి? ఉన్నా… వినే ఓపిక మన పిల్లలకు ఎక్కడిది? బడిలో పాఠాలు.. ఇంట్లో మొబైల్లో ఆటలు!! కానీ, ఈ పదకొండేండ్ల బుడతడు మాత్రం కథలు వినడం కాదు.. ఏకంగా రాసేస్తున్నాడు. చుట్టూ ఉన్న పరిసరాలనే కథా వస్తువులుగా ఎంచుకొని చిట్టిపొట్టి వాక్యాల్లో 26 గట్టి కథలు రాశాడు. తాను రాసిన కథలతో ఓ సంకలనం కూడా తీసుకొచ్చి సాహితీవేత్తలతో ‘ఔరా!’ అనిపించుకున్నాడు బొక్కల విశ్వతేజ. ఈ బాల రచయిత కథ మీరూ చదివేయండి..
కథలు రాయడం సృజనాత్మక కళ. కథలు చెప్పడం కూడా అంతే. చాలామంది తమ ఊహలో మెదిలిన భావాలను అందమైన అక్షరాలుగా రాయాలనుకుంటారు. కానీ, ఎలా మొదలుపెట్టాలో తెలియక ఆలోచనలను అంతరంగంలోనే దాచేస్తుంటారు. విశ్వతేజ మాత్రం ఇందుకు మినహాయింపు. మస్తిష్కంలో మెదిలిన భావాలను.. మనోఫలకంపై దర్శించి.. ముచ్చటైన కథలు రాసేస్తున్నాడు. విశ్వతేజది సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్ గ్రామం.
అమ్మ సంధ్య గృహిణి, నాన్న లక్ష్మణ్ ఊరిలోనే మీ సేవ పెట్టుకొని బతుకు బండి సాగిస్తున్నాడు. తన ఈడు పిల్లలంతా సెల్ఫోన్లో గేమ్‌లకు అంకితమైతే.. విశ్వతేజకు మాత్రం తన చుట్టూ ఉన్న పరిసరాలను తదేకంగా పరిశీలించడమే కాలక్షేపం. చుట్టుపక్కల వాళ్ల సంభాషణలు, వారి సాధకబాధకాలు మనసుతో వినేవాడు. ‘పక్కింటోళ్లు ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నరు’ అని తల్లిని ఆరా తీసేవాడు. ‘బెట్టింగ్ భూతానికి బలైన యువకుడు’ వార్త చదివి ‘బెట్టింగ్ అంటే ఏంటి నాన్నా?’ అని తండ్రిని అడిగి తెలుసుకునేవాడు. వాళ్లు చెప్పిన విషయాలకు తన ఆలోచనలు జోడిస్తూ… కథలుగా రాయడం మొదలుపెట్టాడు.

విశ్వతేజ స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లవాడిలోని సృజనాత్మకత హిందీ ఉపాధ్యాయుడు భైతి దుర్గయ్య గమనించాడు. కథలు ఎలా రాయాలో సూచన ప్రాయంగా తెలియజేశాడు. ఇంకేం… తన ఆలోచనలను అందమైన కథలుగా రాయడం మొదలుపెట్టాడు విశ్వతేజ. ఏదో ఆవు కథ రాసేసి.. అద్భుతం అనుకునే బాపతు కాదు ఈ కుర్రాడు. చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఈ వండర్ కిడ్‌కు కథా వస్తువులు. ‘కొత్త బండి కావాలంటూ తల్లిదండ్రుల వద్ద మారాం చేసిన కొడుకు.. అదే బండి మీది నుంచి పడి చనిపోయిన సందర్భం. అ తల్లి పడే వేదన’ను హృద్యమైన కథగా రాసి పెద్దలనూ మెప్పించాడు. బెట్టింగ్ భూతంపై కనువిప్పు కలిగించే మరో కథ రాశాడు. ఇలా విభిన్న నేపథ్యాలను స్పృశిస్తూ.. తన కథాసాగు కొనసాగించాడు.

కేవలం ఏడాది కాలంలోనే 26 కథలు రాశాడు విశ్వతేజ. వీటిలో 22 కథలు వివిధ పత్రికల్లోని బాలసాహిత్యం విభాగంలో ప్రచురితమయ్యాయి. అందులో నాలుగు కథలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు అందుకోవడం విశేషం. అక్కడితో ఆగకుండా తన కథలన్నింటినీ ఓ పుస్తక రూపంలో తేవాలని నిర్ణయించుకున్న విశ్వతేజ తన గురువుల సహకారంతో 18 కథలతో ‘విశ్వతేజం’ అనే బాలల కథా సంపుటిని తీసుకొచ్చాడు. బెట్టింగ్ గేమ్, రహదారుల భద్రత, సాగులో రసాయనాల వాడకం, శాస్త్రీయ పరిజ్ఞానం లాంటి సమకాలీన అంశాలను ఎంచుకొని రాసిన కథలు వేటికవే ప్రత్యేకం అనిపించుకున్నాయి. రచనలతోనే కాదు.. మాటతోనూ అందరినీ ఆకట్టుకుని ‘విశ్వతేజం’ పుస్తకావిష్కరణ సభలో సాహితీవేత్తలతో ‘శభాష్’ అనిపించుకున్నాడు.
పుస్తక పఠనం, వార్తా పత్రికలు చదవడం, చెస్ ఆడటం విశ్వతేజ అభిరుచులు. వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తూ తోటి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బడి ఒడిలో ఉండగానే రచయితగా ఎదిగిన విశ్వతేజను ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని ఎవరైనా అడిగితే ‘ఆర్మీలో చేరుతా’ అని రొమ్మువిరిచి చెబుతాడు. అంతేకాదు, సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేస్తానని విశ్వాసంతో చెబుతున్న ఈ బాల రచయిత ఆబాలగోపాలం మెచ్చే గొప్ప వ్యక్తి కావాలని మనమూ ఆశిద్దాం!
1. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి కథల పోటీలో నగదు బహుమతి (2024)
2. సుగుణ సాహితీ సమితి సిద్దిపేట వారి ఉగాది కథల పోటీలో నగదు బహుమతి (2025)
3. తెలుగు తల్లి కెనడా వారి ‘కథ చెబుతారా’ ప్రపంచ స్థాయి అంతర్జాల సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం
4. పెందోట బాల సాహిత్య పీఠం వారి కవితల పోటీలో ప్రత్యేక బహుమతి. కవితా సంకలనంలో స్థానం (2024)
5. ఖమ్మం ఉరిమల్ల ఫౌండేషన్ వారి జాతీయ స్థాయి కథల పోటీలో ప్రత్యేక బహుమతి (2025)
– రాజు పిల్లనగోయిన